Wednesday, January 22, 2025

కన్వర్ యాత్రికుల వాహనానికి విద్యుత్ షాక్.. ఐదుగురి మృతి

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో కన్వర్ యాత్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కన్వర్ యాత్ర చేపట్టిన యాత్రికుల వాహనానికి హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మేరర్ జిల్లాలో సంభవించింది. హరిద్వార్‌లో పవిత్ర గంగా జలాలను తీసుకుని సొంత ఊళ్లకు వెళ్తున్న కన్వరీల వాహనం శనివారం రాత్రి 8 గంటలకు మీరట్ చేరుకుంది. భజనలు చేసుకుంటూ వస్తున్న వీరి వాహనం మేరర్ జిల్లా భావన్‌పుర్ లోని రాలీ చౌహాన్ గ్రామ సమీపానికి చేరగానే తక్కువ ఎత్తులో వేలాడుతున్న హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో వాహనం సమీపం లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

స్థానికులు పవర్ స్టేషన్‌కు ఫోన్ చేసి విద్యుత్ సరఫరా నిలిపివేయాల్సిందిగా కోరే లోపునే ప్రాణనష్టం జరిగిపోయింది. తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురిని సమీప ఆస్పత్రులకు తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన తరువాత గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విద్యుత్ శాఖ నిర్లక్షం కారణం గానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ యాత్రలో శివభక్తులు పవిత్ర గంగా నదీ జలాలను సేకరిస్తారు. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి దాదాపు కోటి మందికి పైగా భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News