కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టీకరణ
న్యూఢిల్లీ : భారత్‌లో కొవిడ్ ప్రారంభమైనప్పటి నుంచీ ఇప్పటివరకు 5 లక్షల 21 వేల మంది మరణించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే కరోనా విజృంభణ సమయంలో ఆక్సిజన్ అందక చాలామంది చనిపోయారనే వార్తలూ వినిపించాయి. దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టత నిస్తూ ఇప్పటివరకు ఆక్సిజన్ కొరత వల్ల ఏ ఒక్కరూ మరణించలేదని వెల్లడించింది. ఆయా రాష్ట్రాలు ఇచ్చిన సమాచారం ఆధారం గానే కొవిడ్ కేసులు, మరణాల వివరాలను పొందుపరుస్తున్నామని పేర్కొంది. దేశంలో 2022 ఏప్రిల్ 4 నాటికి 5,21,358 కొవిడ్ మరణాలు సంభవించాయి. కొవిడ్ కేసులు, మరణాల గణాంకాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నాం. ఇందులో భాగంగా ఆక్సిజన్ అందక పోవడం వల్ల మరణించిన బాధితుల వివరాలను వెల్లడించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరాం. వీటిపై 20 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు స్పందించాయి.
కానీ ఆక్సిజన్ అందక పోవడం వల్ల ఎవరూ మరణించలేదని ఆయా రాష్ట్రాలు వెల్లడించాయి అని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ వెల్లడించారు. ఇక కొవిడ్‌తో మరణించిన బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వడంపై మార్గదర్శకాలు జారీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి వెల్లడించారు. ఎన్‌డిఎమ్‌ఎ సిఫార్సు మేరకు ప్రతి బాధిత కుటుంబానికి రూ.50 వేలు అందజేసే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. కొవిడ్ ఉధ్ధృతి నేపథ్యంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలపై వివరిస్తూ ఇప్పటివరకు 300 కు పైగా ల్యాబ్‌లు, ఐదు లక్షలకు పైగా ఆక్సిజన్‌తో కూడుకున్న పడకలు, 1.5 లక్షల ఐసీయూ బెడ్‌లు, 4 వేల పీఎస్‌ఏ ప్లాంట్లతో పాటు 60 వేల వెంటిలేటర్లను అదనంగా అందుబాటు లోకి తెచ్చామన్నారు. ఇక కొత్త వేరియంట్లు, వైరస్‌లను గుర్తించేందుకు బయో సేఫ్టీ ల్యాబ్ లెవల్ (బిఎస్‌ఎల్ )3 త్వరలోనే అందుబాటు లోకి రానుందని మంత్రి వివరించారు.