Sunday, December 29, 2024

గల్ఫ్ కార్మికుల కోసం వెల్ఫేర్‌బోర్డు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ :గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ‘తెలంగాణ గల్ఫ్, ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు’ను ఏ ర్పాటు చేయనున్నట్లు సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ వి భాగానికి సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమిస్తామని ఆ యన తెలిపారు. జూన్, జూలైలో పాలసీ డాక్యుమెంట్ విడుదల చేస్తామన్నారు. గల్ఫ్ కార్మికుల సహాయార్థం ప్రజాభవన్ లో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తామని సిఎం రేవంత్ హామీనిచ్చారు. గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రేవంత్ తెలిపారు. మంగళవారం తాజ్‌డెక్కన్ లో గ ల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో సిఎం రేవంత్ రెడ్డి సమావే శం అయ్యారు. ఈ సందర్భంగా సిఎం
రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రైతుబీమా తరహాలో, గల్ఫ్ కార్మికులు చనిపోతే రూ.5 లక్షలు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 15 లక్షల కుటుంబాలు గల్ఫ్ ఉపాధిపై ఆ ధారపడి ఉన్నారని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

గల్ఫ్ కా ర్మికులకు ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17వ తేదీ లోగా తెలంగాణ గల్ఫ్, ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు పెట్టాలని నిర్ణయించామన్నారు. ఉపాధి కోసం వెళ్లిన వారి వేతనాలు, బాగోగులు కూడా ప్రభుత్వం చూసుకోవాలని, కొన్ని దేశాలు, రాష్ట్రాలు అవలంభిస్తున్న విధానంపై అధ్యయనం చేస్తున్నట్లు సిఎం రేవంత్ పేర్కొన్నారు. ఓవర్సీస్ కార్మికుల కోసం ఫిలిప్పీన్, కేరళలో మంచి విధానం ఉందని, అన్నీ అధ్యయనం చేసి తెలంగాణ ప్రభుత్వం కూడా సమగ్ర విధానం రూపొంస్తామని ఆయన హామీ ఇచ్చారు. గల్ఫ్ ఏజెంట్లకు చట్టబద్ధత ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. చట్టబద్ధమైన ఏజెంట్ల ద్వారా మాత్రమే కార్మికులకు వెళ్లేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. గల్ఫ్ కార్మికులకు వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చే వ్యవస్థను ఏర్పాటు చేస్తామని సిఎం రేవంత్ హామినిచ్చారు.

గల్ఫ్ కార్మికుల కోసం పాలసీని రూపొందిస్తున్నాం
ఉత్తర తెలంగాణ నుంచి ఎక్కువమంది గల్ఫ్ కార్మికులు ఉన్నారని, ఏజెంట్ల బారిన పడి కొందరు, యాజమాన్యం చేతిలో మరికొందరు కార్మికులు ఇబ్బంది పడుతున్నారని సిఎం రేవంత్ అన్నారు. గల్ఫ్‌తో పాటు ఇతర దేశాలకు వెళ్లే కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు అధ్యయనం చేస్తున్నామన్నారు. ఇప్పటికే గల్ఫ్ కార్మికుల కోసం ఒక పాలసీ డాక్యుమెంట్‌ను తయారు చేశామని ఎన్నికల కోడ్ ముగిశాక ప్రభుత్వం తరపున గల్ఫ్ కార్మికులు ఆహ్వానించి పాలసీ డాక్యుమెంట్‌పై అభిప్రాయాలను, సూచనలను తీసుకుంటామన్నారు. గల్ఫ్ కార్మికులకు న్యాయపరమైన సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని, ఏజెంట్ల చేతుల్లో మోసపోకుండా చర్యలు చేపట్టనున్నట్టు సిఎం రేవంత్ తెలిపారు.

త్వరలోనే టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు
ఏ దేశంలోనైనా తెలంగాణ బిడ్డలు ఇబ్బందుల్లో ఉంటే వారు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించేలా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. విదేశాల్లో కాయకష్టం చేసి రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఇక్కడ ఏదైనా ఆస్తులు కొనుకుంటే అలాంటి ఆస్తులు వివాదాల్లో చిక్కుకుంటున్నాయని, అలాంటి ప్రాపర్టీకి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని కుటుంబాల్లోని వారు విదేశాలకు వెళ్తే ఇక్కడ ఉండే వారి తల్లిదండ్రుల ఆరోగ్యం చూసుకునే వారు ఉండరని అందువల్ల విదేశాలకు వెళ్లిన వారి ఆరోగ్యంతో పాటు ఇక్కడ ఉన్న వారి ఆరోగ్యం, ఇతర సాయం అందించేలా వారి వివరాలు కూడా ప్రభుత్వం నమోదు చేసుకునేలా ఆలోచన చేస్తున్నామన్నారు. వారి పిల్లల చదువుల కోసం రెసిడెన్సియల్ స్కూళ్ల ఏర్పాటు కోసం ఆలోచన చేస్తోందన్నారు. అయితే ఈ అంశం రాష్ట్ర పరిధితో పాటు కేంద్ర పరిధిలోని అంశం అని అందువల్ల జాతీయ స్థాయిలో మీ ప్రతినిధులు ఉండాలని అందువల్ల పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని సిఎం రేవంత్ కోరారు.

2018లో ఎమ్మెల్యేగా ఓడిపోయినందునే ఎంపి అయ్యాను
2018లో ఓడిపోయినందునే 2019లో ఎంపి అయ్యానని, 2023లో రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయ్యానని సిఎం రేవంత్ తెలిపారు. అలాగే, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయినందునే 2024లో కేంద్ర మంత్రి అవుతారని ఆయన చెప్పారు. ఇక, తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు కొందరు బాధ పడ్డారని, నా శత్రువులు మాత్రం సంతోష పడ్డారని సిఎం రేవంత్ పేర్కొన్నారు. వీడి పని అయిపోయిందని నా శత్రువులు సంతోష పడ్డారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యనించారు. ఈ సమావేశంలో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ, నిజామాబాద్ ఎంపి అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, గల్ఫ్ ఎన్‌ఆర్‌ఐ కార్మిక సంఘాల నేతలు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News