రాములోరి ఉత్సవంలో ప్రసాదంగా వితరణ
ఉజ్జయిన్: అయోధ్యలో ఈనెల 22న జరగనున్న రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం కోసం మధ్యప్రదేశ్ ఉజ్జయిన్‌లోని ప్రఖ్యాత మహాకాళేశ్వర్ ఆలయం నుంచి 5 లక్షల లడ్డూలు శుక్రవారం బయల్దేరి వెళతాయని ఆలయ అధికారి ఒకరు గురువారం వెల్లడించారు. ఇప్పటికే 4 లక్షల లడ్డూల ప్యాకింగ్ పూర్తయిందని, మరో లక్ష లడ్డూల ప్యాకింగ్ జరుగుతోందని ఆయన చెప్పారు. ఒక్కో లడ్డూ బరువు సుమారు 50 గ్రాములు ఉంటుందని, మొత్తంగా కలిపి 250 క్వింటాళ్లు ఉంటుందని ఆయన వివరించారు.
శుక్రవారం నాలుగైదు ట్రక్కులలో ఈ లడ్డూలు అయోధ్యకు బయల్దేరి వెళతాయని మహాకాళేశ్వర్ ఆలయ సహాయ నిర్వహాకుడు మూల్‌చంద్ జున్వాల్ తెలిపారు. అయోధ్యలో ఈనెల 22న జరిగే ఆలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవంలో బాబా మహాకాళ్ ప్రసాదంగా లడ్డూలను పంపనున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించిన నేపథ్యంలో గత ఐదు రోజులుగా లడ్డూల తయారీలో 150 మంది ఆలయ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల సభ్యులు నిమగ్నమయ్యారని ఆయన చెప్పారు. లడ్డూల తయారీ కోసం మహాకాళ్ ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక విభాగం పనిచేసిందని ఆయన చెప్పారు.
జనవరి 12న భోపాల్‌లో విలేకరులతో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ అయోధ్య మహోత్సవం కోసం ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ ఆలయం నుంచి 5 లక్షల లడ్డూలను పంపనున్నట్లు తెలిపారు. అయోధ్యలో ఆలయాన్ని మొఘల్ రాజు బాబర్ కూల్చివేశాడని, ఇప్పుడు ఆలయాన్ని నిర్మించిన ఈ భుభ సందర్భంలో వేడుకలు చేసుకోవడంలో మధ్యప్రదేశ్ ఎందుకు వెనుకబడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 300 టన్నుల అత్యంత నాణ్యమైన బియాన్ని పంపింది.