న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంతో పెండింగ్ డిమాండ్లపై చర్చల కోసం ఐదుగురు నేతలతో కమిటీని ఏర్పాటు చేసినట్టు రైతు సంఘాల ఐక్యవేదిక కిసాన్ సంయుక్త మోర్చా(ఎస్‌కెఎం) తెలిపింది. పంటలకు కనీస మద్దతుధర(ఎంఎస్‌పి)కి చట్టబద్ధత కల్పించడం, మూడు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో మృతి చెందిన రైతుల కుటుంబాలకు పరిహారం, ఆందోళనకారులపై కేసులు ఎత్తివేయడం తమ డిమాండ్లని రైతు సంఘం నేత రాకేశ్‌టికాయత్ తెలిపారు. శనివారం సమావేశమైన ఎస్‌కెఎం నేతలు కమిటీ సభ్యుల పేర్లను ప్రకటించారు. కమిటీకి రైతు నేతలు బల్బీర్‌సింగ్ రాజేవాల్, అశోక్ ధవాలే, శివకుమార్‌కక్కా, గుర్నామ్‌సింగ్ చాదునీ, యుధ్‌వీర్ సింగ్‌లను ఎంపిక చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకూ సింఘూ సరిహద్దులో ఆందోళన విరమించేదిలేదని ఎస్‌కెఎం నేతలు స్పష్టం చేశారు. తమ భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించేందుకు ఈ నెల 7న ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నట్టు ఎస్‌కెఎం నేతలు తెలిపారు. రైతుల తరఫున ఆయా రాష్ట్రాల్లో చర్చలు జరిపేవారిని కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు. ఎస్‌కెఎం ప్రధాన డిమాండైన కేంద్రం తెచ్చిన మూడు సాగుచట్టాలు ఇప్పటికే రద్దయ్యాయి. మిగతా డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వకపోవడంతో ప్రతిష్టంభన నెలకొన్నది.
5 member Committee to talks with Centre on farmers demands