లండన్ : రొమ్ము క్యాన్సర్ చికిత్సలో కొత్తదైన సమర్థమైన విధానం బ్రిటన్లో అందుబాటు లోకి వచ్చింది. ఈ చికిత్స విధానం వల్ల బాధితులు ఆస్పత్రిలో రెండున్నర గంటల వరకు ఉండనవసరం లేదు. ఐదు నిముషాలుంటే చాలు. కిమో థెరపీ చేయించుకుంటున్న రొమ్ము క్యాన్సర్ రోగుల కోసం ఈ విధానాన్ని ప్రవేశ పెట్టారు. పిహెచ్ఈఎన్జివొ అనే ఈ చికిత్స విధానంలో ఔషధాన్ని ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. దీన్ని సిద్ధం చేసి బాధితులకు ఇవ్వడానికి ఐదు నిమిషాలు సరిపోతాయి. ఇప్పటివరకు ఉన్న విధానాల్లో రెండు రకాల ఔషధాలను శరీరం లోకి ప్రవేశ పెట్టవలసి ఉంటుంది. దానికి రెండున్నర గంటల సమయం పడుతుంది. కొత్త చికిత్స విధానంలో సమయం తగ్గిపోవడంతో ఎక్కువ మంది రోగులకు వైద్యం అందించడానికి వీలవుతుంది. అలాగే బాధితులకు కొవిడ్ సోకే ముప్పు కూడా తగ్గుతుంది. పిహెచ్ఈఎన్జివొలో పెర్దుజుమాబ్ , ట్రాస్డుజుమాబ్ అనే ఔషధాల మిశ్రమం ఉంటుంది. హెచ్ఈఆర్2 పాజిటివ్ రొమ్ము క్సాన్సర్ రోగుల్లో అర్హులైన వారికి దీన్ని ఇస్తారు.