Thursday, December 26, 2024

బిఆర్‌ఎస్ ఎల్పీ సమావేశానికి ఐదుగురు ఎంఎల్‌ఎలు డుమ్మా..!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: పార్టీ ఎంఎల్‌ఎల వరుస ఫిరాయింపులతో సతమతమవుతున్న బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్‌కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు మరో బిగ్ షాక్ నిచ్చేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. మంగళవారం స్వయంగా కెసిఆర్ నిర్వహించిన బిఆర్‌ఎస్ ఎల్‌పి సమావేశానికి ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎంఎల్‌ఎలు, ముగ్గురు ఎంఎల్‌సిలు గైర్జాజరవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ భేటీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, హరీష్ రావు సహా ఇతర బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు హాజరయ్యారు.

అయితే కాంగ్రెస్‌లోకి పోయిన ఎంఎల్‌ఎలు పోగా, మిగిలిన 28 మంది బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలలో ఐదుగురు ఈ భేటీకి డుమ్మా కొట్టారు. జహిరాబాద్ ఎంఎల్‌ఎ మాణిక్య రావు, దుబ్బాక ఎంఎల్‌ఎ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఉప్పల్ ఎంఎల్‌ఎ బండారు లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్ ఎంఎల్‌ఎ తీగుళ్ళ పద్మారావు గౌడ్, సనత్ నగర్ ఎంఎల్‌ఎ తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంఎల్‌సిలు చల్లా వెంకటరామిరెడ్డి, గోరేటి వెంకన్న, వెంకట్రామ్రెడ్డిలు ఈ సమావేశానికి హాజరు కాలేదు. బిఆర్‌ఎస్ ఎల్పీ సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలకు ముందుగానే అందించినప్పటికీ వీరు హాజరుకాక పోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

పార్టీ మారే క్రమంలోనే వారిలో కొందరు ఈ సమావేశానికి గైర్హాజరైనట్లుగా ప్రచారం జోరందుకుంది. మరోవైపు బిఆర్‌ఎస్ ఎల్పీ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బిఆర్‌ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలను ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలకు కెసిఆర్ దిశానిర్దేశం చేశారు. రైతు భరోసా, నిరుద్యోగుల ఆందోళన, రూ.2 లక్షల రుణమాఫీకి నిబంధనలు విధించడం, ఆరు గ్యారెంటీల అమలు వంటి అంశాలను హైలెట్ చేస్తూ సభలో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని నేతలకు కెసిఆర్ సూచించారు. అయితే, కెసిఆర్ అధ్యక్షతన జరిగిన బిఆర్‌ఎస్‌ఎల్‌పి సమావేశానికి ముందస్తు అనుమతితోనే కొందరు ఎంఎల్‌ఎలు భేటీకి హాజరు కాలేదని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎంఎల్‌ఎ హరీశ్‌రావు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News