హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన గృహలక్ష్మి పథకంలో వికలాంగులకు ఐదు శాతం కేటాయించాలని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె. వాసుదేవ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేవారు. ఈ మేరకు చైర్మన్ బుధవారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని మంత్రుల నివాస సముదాయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం వికలాంగుల సమాజానికి ఎంతో కృషిచేసిందని, ఎవరూ అడగకుండా మొదటి ప్రభుత్వంలో రూ. 1500, తర్వాత ప్రభుత్వంలో రూ.3వేలు, మళ్లీ ఇప్పుడు అడగకుండానే వెయ్యి
రూపాయలు అదనంగా పెంచి వికలాంగులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అందజేస్తోందని, ఈ ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కిందన్నారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది వికలాంగులు ఉన్నారని, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న అన్ని సంక్షేమ పథకాల్లో కూడా వికలాంగులకు రిజర్వేషన్ అవకాశాలను కల్పిస్తున్నదని తెలిపారు. కొత్తగా ప్రవేశపెడుతున్న గృహలక్ష్మి లో కూడా 5 శాతం అందజేసి వికలాంగులకు అండగా నిలవాలని మంత్రిని కోరారు. మంత్రి వేముల సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారని వాసుదేవ రెడ్డి తెలిపారు.