Sunday, November 24, 2024

కొత్త వాహనం కొనుగోలుపై 5శాతం రిబేట్

- Advertisement -
- Advertisement -

5 percent rebate on new vehicle purchase

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021 కేంద్ర బడ్జెట్ సందర్భంగా పాత వాహనాల స్క్రాపేజ్ విధానాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విధానం భారత ఆటోమొబైల్ పరిశ్రమకు ఒక ‘గేమ్ చేంజర్’ అవుతుందని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మొదటినుంచీ చెబుతూ వస్తున్నారు. కాగా ఈ పథకం కింద తమ పాత వాహనాలను స్క్రాప్ కింద విక్రయించే యజమానులకు వాహనాల తయారీ దారులనుంచి కొన్ని ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయని ఆయన గతంలో అనేక సందర్భాల్లో చెప్పారు. కాగా ఈ విధానం కింద పాత వాహనాల యజమానులు కొత్త వాహనాన్ని కొనే సమయంలో ఉత్పత్తిదారులనుంచి 5 శాతం రిబేటు పొందుతారని గడ్కరీ ఆదివారం పిటిఐతో మాట్లాడుతూ చెప్పారు. ‘ఈ విధానంలో నాలుగు ప్రధాన అంశాలున్నాయి. రిబేటు కాకుండా కాలుష్య కారక పాత వాహనాలపై గ్రీన్ టాక్స్‌లు, ఇతర సుంకాలు విధించేందుకు కూడా ఈ విధానంలో అవకాశం ఉంది. ఈ పాత వాహనాలు ఆటోమేటెడ్ కేంద్రాల్లో తప్పనిసరిగా ఫిట్‌నెస్, కాలుష్య పరీక్షలకు గురి కావలసి ఉంటుంది.

దేశవ్యాప్తంగా ఇలాంటి ఆటెమేటెడ్ ఫిట్‌నెస్ సెంటర్లు అవసరమవుతాయి. ఈ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది’ అని గడ్కరీ చెప్పారు. స్క్రాపేజ్ పాలసీ ప్రకారం వ్యక్తిగత వాహనాలు 20 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాత తప్పనిసరిగా ఫిట్‌నెస్ పరీక్ష జరిపించుకోవలసి ఉంటుంది. అదే వాణిజ్య వాహనాలయితే 15 ఏళ్ల తర్వాత ఫిట్‌నెస్ పరీక్ష జరపాల్సి ఉంటుంది.ఈ ఆటోమేటెడ్ సెంటర్లను ప్రభుత్వపైవేట్ భాగస్వామం (పిపిపి) పద్ధతిలో ఏర్పాటు చేస్తారు. ఈ సెంటర్లను ఏర్పాటు చేయడానికి కేంద్రం ప్రైవేటు భాగస్వాములకు, రాష్ట్రాలకు సహాయ, సహకారాలు అందిస్తుంది.ఆటోమేటెడ్ సెంటర్లలో ఫిట్‌నెస్ టెస్టులో విఫలమైతే వాహనాలపై భారీ ఎత్తున జరిమానాలు కూడా విధిస్తారు. ఈ స్క్రాపేజి స్కీము వల్ల భారత ఆటోమొబైల్ పరిశ్రమకు 30 శాతం ప్రోత్సాహకం లభిస్తుందని, ప్రస్తుతం రూ.4.5 లక్షల కోట్ల టర్నోవర్ ఉన్న పరిశ్రమ రాబోయే సంవత్సరాల్లో రూ.10 లక్షల కోట్లకు చేరుకుంటుందని కూడా గడ్కరీ చెప్పారు.

5 percent rebate on new vehicle purchase

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News