Sunday, December 22, 2024

అస్తిత్వ సంక్షోభంలో 5 ప్రాంతీయ పార్టీలు

- Advertisement -
- Advertisement -

2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో అప్రతిహతంగా అత్యధిక స్థానాలను సాధించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన బిజెపి, ఈసారి తగిన స్థానాలను దక్కించుకోవడంలో వెనుకబడడమే గాక, విపక్షాల నుంచి గట్టి పోటీని ఎదుర్కోవలసి వచ్చింది. అందుకే పొత్తు కుదుర్చుకునే అవసరం ఇప్పటివరకు రాకపోయినప్పటికీ, తెలుగుదేశం, జనతాదళ్ యునైటెడ్ పొత్తుతో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. దీంతో తెలుగుదేశం, జెడి(యు) పార్టీలకు ఎన్‌డిఎ ప్రభుత్వంలో భాగస్వామ్యం పొందే అవకాశం లభించింది. ఈ అవకాశం అన్నిప్రాంతీయ పార్టీలకు లభించలేదు. సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు తలెత్తడంతో ప్రస్తుతం బిజూ జనతా దళ్, బహుజన సమాజ్, జననాయక్ జనతా, టిఆర్‌ఎస్, అన్నాడిఎంకె ఈ ఐదు ప్రాంతీయ పార్టీల ఉనికి దెబ్బతింది.

అస్తిత్వ సంక్షోభం దిశగా చూడవలసి వస్తోంది. పార్లమెంట్‌లో తమ గొంతు వినిపించే అవకాశాన్ని కోల్పోయాయి. ఈ పార్టీలన్నీ ఒకప్పుడు ముఖ్యమంత్రులను, ఒకానొక సందర్భంలో పార్లమెంట్‌కు విశేష సంఖ్యలో ఎంపిలను పంపించినవే. ఈసారి మాత్రం అస్తిత్వ సంక్షోభాన్ని అనుభవిస్తున్నాయి. 1997 లో బిజూ జనతాదళ్ ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఎలాంటి ఎదురీత లేని పార్టీ ఇప్పుడు పార్లమెంట్‌లో తన ప్రాతినిధ్యం అన్నది లేకుండా పోయింది. మొట్టమొదటిసారి 2009 తరువాత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ మెజార్టీ సాధించుకోలేకపోయింది. గత 24 ఏళ్లుగా తిరుగులేని ముఖ్యమంత్రిగా నెగ్గుకుంటూ వస్తున్న నవీన్ పట్నాయక్ ఇప్పుడు పక్కకు తప్పుకోవలసి వచ్చింది. బిజెపి నుంచే ముఖ్యమంత్రి అవుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బిజూ జనతాదళ్ ఓట్ షేర్ 2019లో 43.32 శాతం ఉండగా, ఇప్పుడు 37.53 శాతానికి దిగజారిపోవడం శోచనీయం.

21 పార్లమెంట్ స్థానాలకు 2019 లో 12 సాధించుకోగా, ఈసారి జీరో అయింది. అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే మొత్తం 147 స్థానాలకు కేవలం 51 స్థానాలనే గెలుచుకోవడం గమనార్హం. 5% పాయింట్లు దిగజారి 40.22% ఓట్లు మాత్రమే వచ్చాయి. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లోనూ చాలా అధ్వాన పరిస్థితి దాపురించింది. ప్రాంతీయ పార్టీల్లో ఒకప్పుడు మిగతా పార్టీలన్నిటినీ తుడిచిపెట్టేసిన బిజూ జనతాదళ్ పార్టీ ఇప్పుడు ఈ ఏడాది ఒక్క సీటు కూడా సాధించలేని స్థితికి దిగజారిపోయింది. పొరుగునున్న ఉత్తరప్రదేశ్‌లో మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి)ది కూడా ఇదే పరిస్థితి. ఒకప్పుడు దళితుల గొంతుగా గుర్తింపు పొందిన ఈ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో తన పట్టును కోల్పోయినట్టు కనిపిస్తోంది. ఈసారి ఎన్నికల్లో ఖాతా తెరవలేక 10% పాయింట్ల ఓట్ల భాగస్వామ్యాన్ని 9.39 శాతం వరకు కోల్పోయింది. 2019లో ఈ పార్టీ 19.42% ఓట్ షేర్‌తో 10 పార్లమెంట్ స్థానాలను సాధించుకోగా, ఈసారి పోలింగ్‌కు ముందే ఎస్‌పితో పొత్తు విషయంలో వివాదానికి దిగింది.

హర్యానాలో ఉత్తర ఎగువ నియోజక వర్గంలో జననాయక్ జనతా పార్టీ కూడా రాష్ట్రంలోని తనకున్న పది స్థానాలను కోల్పోయింది. మాజీ ఉప ప్రధాని దేవీలాల్ భావజాలంతో 2018లో ఈ పార్టీ ఏర్పాటైంది. 2019 లో హర్యానా శాసన సభ ఎన్నికల్లో 10 స్థానాలను గెలుచుకోగా, ఈ ఏడాది మార్చి వరకు రాష్ట్రాన్ని పాలించిన బిజెపి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండేది. 2019 ఎన్నికల్లోనూ ఇప్పుడు కూడా కనీసం ఒక్క ఎంపి సీటు కూడా గెలుచుకోలేకపోయింది. చాలా స్థానాల్లో అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. ఈ పార్టీ ఓట్ల శాతం వాటా 4.9% నుంచి 0.87 శాతానికి పడిపోయింది. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) కూడా పార్లమెంట్ స్థానాలను గెలుచుకోలేక పోయింది. 2014లో 11 ఎంపి స్థానాలను గెలుచుకున్న ఈ పార్టీ 2019లో 9 స్థానాలనే గెలుచుకోగా, 2024లో జీరో స్థానాలయ్యాయి. ఇంకా దక్షిణాదిలో తమిళనాడుకు సంబంధించి ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఎఐఎడిఎంకె)ను మొదట అగ్రనటుడు, అగ్ర రాజకీయ యోధుడు ఎంజిఆర్ స్థాపించగా, తరువాత నటి జయలలిత సారథ్యం వహించారు.

మొట్టమొదటిసారి ఎన్నికల్లో ఎన్‌డిఎతో పొత్తులేకుండా పోరు సాగించిన ఈ పార్టీ ఇప్పుడు తమిళనాడులో తాను పోటీకి నిలబడిన మొత్తం 32 స్థానాలను కోల్పోయింది. ఎఐఎడిఎంకె మిత్ర పక్షాలైన దేశీయ ముర్పొక్కు ద్రవిడ కజగం (డిఎండికె), సోషల్ డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డిపిఐ), పుదియ తమిజగమ్ (పిటి) పార్టీలు కూడా రాష్ట్రంలోని మిగిలిన 7 ఎంపి స్థానాల్లో ఏ ఒక్కటీ దక్కించుకోలేకపోయాయి. 2014లో ఎఐఎడిఎంకె మొత్తం 39 ఎంపి స్థానాల్లో 37 వరకు గుండుగుత్తగా దక్కించుకోగా, 2019 ఎన్నికల్లో పార్టీ స్థాయి బాగా కుదించుకుపోయి ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. ఇప్పటి ఎన్నికల్లో ఆ ఒక్కటి కూడా మిగల లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News