మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే అతిపెద్ద దేవాలయంగా, గ్రేడింగ్లో ప్రథమ స్థానంలో ఉన్న మన్నెంకొండ దేవాలయాన్ని దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దాలన్న తలంపుతో భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించనున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు .ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 14 న జీవో నెంబర్ 390 ద్వారా 50 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 25 కోట్లు ,వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 25 కోట్ల రూపాయలతో మన్యంకొండలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు .అదేవిధంగా మహబూబ్ నగర్ పట్టణంలోని లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ అభివృద్ధికి 6 కోట్ల రూపాయలను కూడా విడుదల చేస్తూ 391 జీవోను విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు.
శుక్రవారం మహబూబ్ నగర్ లోని నూతన కలెక్టర్ కార్యాలయంలోని స్టేట్ చాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గతంలో మునుల కొండగా ఉన్న మన్యంకొండకు తిరుపతి కి ఉన్న పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని, తిరుపతికి వెళ్లలేని భక్తులు మన్నెంకొండకు వచ్చి వారి మొక్కలను తీర్చుకోవచ్చనే గొప్ప నమ్మకం ఉందని తెలిపారు. ఒక్క ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండే కాకుండా కర్ణాటక ,మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి భక్తులు వస్తున్నారని , భక్తులకు మరిన్నీ సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో తెలంగాణలో ఎక్కడ లేని విధంగా ఫలని సుబ్రమణ్య స్వామి దేవాలయం వద్ద ఉన్నట్లుగా మొట్టమొదటి రోప్ వేను ఏర్పాటు చేస్తున్నామని ,అన్న దాన సత్రం, కళ్యాణకట్ట, షాపింగ్ కాంప్లెక్స్లను నిర్మిస్తున్నామని తెలిపారు.
ఇదివరకే 15 కోట్ల రూపాయలతో టూరిజం హోటల్ చేపట్టనున్నామని, దేవాలయం కొండపైన 18 రూములతో భక్తులకు వసతి సౌకర్యం కల్పించామని, కల్యాణ కట్ట ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మన్యంకొండను దివ్య క్షేత్రంగా చేయాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి తెలిపారు. మహబూబ్ నగర్- రాయచూరు ప్రధాన రహదారి నుండి దేవాలయానికి వెళ్లే రాహధారిని నాలుగు లైన్ల రహదారిగా మార్చడం, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయని అన్నారు. నూతనంగా ఏర్పాటు చేయనున్న రోప్ వే, అన్నదాన సత్రం తోపాటు ,పార్కు, దశావతారం ఏర్పాటు చేస్తున్నామని, పూర్తిస్థాయిలో మన్నెంకొండను అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు.