ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
మన తెలంగాణ/సిటీ బ్యూరో : హ్రైడాను మరింత బలోపేతం చేసేందుకు రూ. 50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. గతంలోనూ రూ. 50 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు జారీచేసిన ప్రభుత్వం ఇప్పడు నిధులను విడుదల చేసిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని చెరువులు, పార్కులు, రోడ్లు, ప్రభుత్వ స్థలాలు పరిరక్షణకు ప్రత్యేకంగా ఏర్పడిన హైడ్రాకు పూర్తిస్థాయిలో సిబ్బంది, వాహనాలు, కార్యాలయాలు లేవు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 50 కోట్ల నిధులతో వాటిని అందుబాటులోకి తీసుకురానున్నట్టు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం 202425 వార్షిక బడ్జెట్‌లో హైడ్రాకు రూ. 200 కోట్లు కేటాయించిన ప్రభుత్వం గత రెండు మాసాల క్రితం కూడా హైడ్రాకు రూ. 50 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు జారీచేసింది. ఇప్పుడు మరోమారు నిధులు మంజూరు చేయడంతో ఇప్పటి వరకు రూ. 100 కోట్లు హైడ్రాకు ప్రభుత్వం నుంచి మంజూరుకు పరిపాలనా అనుమతులు వచ్చినట్టు అధికారులు పేర్కొంటున్నారు. అయితే, తార్నాక, నానక్‌రాంగూడలో రీజినల్ కార్యాలయాలు, బేగంపేట్ పైగా ప్యాలేస్‌లో ప్రధాన కార్యాయలం ఏర్పాటు చేయాలనే యోచనలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉన్నారు. బుద్దభవన్‌లో హైడ్రా పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయడంతో పాటు ఉద్యోగులకు ప్రత్యేకంగా వాహనాలు సమకూర్చే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇటీవల కూల్చివేతలు, వాటికి వినియోగించిన వాహనాలకు అద్దెలు కూడా చెల్లించడం జరుగుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు.