మిగతా వారందరికీ రెండు రోజుల్లో, రాష్ట్రానికి చేరుకున్న మరో 3.48 లక్షల కొవిషీల్డ్ డోసులు
మంగళవారం 894 ప్రభుత్వ సెంటర్లలో 51,997 మందికి పంపిణీ
స్వల్ప సమస్యలు తేలిన 51 మందిలో మగ్గురికి హాస్పిటల్ చికిత్స
మార్చి నెలలో సాధారణ ప్రజలకూ టీకా
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ఊ పందుకుంది. కేవలం మూడు రో జుల్లో 50 శాతం ప్రభుత్వ హెల్త్ కేర్ వర్కర్లకు టీకా ఇవ్వడం గమనార్హం. మిగతా వారందరికీ శుక్రవారం వరకు పూర్తి చేయాలని ఆరోగ్యశాఖ లక్షం పెట్టుకుంది. వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌లో పనిచేసే 3.15 లక్షల మంది హెల్త్ కేర్ వర్కర్లు కొవిన్ సాప్ట్‌వేర్‌లో ఎన్‌రోల్ అయ్యారు. వీరిలో సుమారు 1.60 లక్షల మంది ప్రభుత్వ సెక్టార్ సిబ్బంది ఉన్నారు. వీటిలో 15 వేల సెంట్రల్ ఉద్యోగులను మినహాయిస్తే స్టేట్ గవర్నమెంట్ శాఖల్లో పనిచేసే హెల్త్ కేర్ వర్కర్లలో సుమారు 50 శాతం మందికి వ్యాక్సిన్ వేసినట్లు ఆరోగ్యశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సోమవారం నుంచి ప్రైవేట్ హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు హెల్త్ డైరెక్డర్ డా జి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
సెంట్రల్ స్టోరేజ్ సెంటర్‌కు మరో 3.48 లక్షల కొవిషీల్డ్ డోసులు
రాష్ట్రానికి మరో 3,48,500 కొవిషీల్డ్ డోసులు చేరుకున్నాయి. వీటిని కోఠి సెంట్రల్ స్టోరేజ్ కేంద్రంలో నిల్వచేశారు. మొదటి డోసు పూర్తికాగానే ఈ వయల్స్‌ను రీజనల్ సెంటర్లు తరలిస్తామని అధికారులు అంటున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 894 సెంటర్లలో 51,997 మందికి టీకా వేసినట్లు అధికారులు వెల్లడించారు. వాస్తవంగా 894 సెంటర్లలో 73,673 మందికి టీకా వేయాలని లక్షం పెట్టుకోగా, కేవలం 71 శాతం మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్ వేశామని హెల్త్ డైరెక్టర్ చెప్పారు. మరోవైపు ఇప్పటి వరకు టీకా తీసుకున్న వారిలో 51 మందికి స్పల్ప సమస్యలు తేలగా, వారిలో కేవలం ముగ్గురు మాత్రమే హాస్పిటల్‌లో చేర్చి వైద్యం అందించాల్సిన పరిస్థితి ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది. మిగతా వారంతా నార్మల్‌గానే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
మార్చిలో సాధారణ ప్రజలకు టీకా
మార్చి నుంచి సాధారణ ప్రజలకూ టీకా ఇవ్వనున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. 3.15 లక్షల హెల్త్‌కేర్, 2.50 ఫ్రంట్‌లైన్ వర్కర్లకు రెండు డోసుల వ్యాక్సినేషన్ ఫిబ్రవరీలో పూర్తికానుంది. అనంతరం మార్చిలో 50 ఏళ్ల పై బడిన వారందరికీ వ్యాక్సిన్ ఇస్తామని వైద్యశాఖ పేర్కొంది. అయితే వారికి ఉచితంగా ఇస్తారా? లేదా అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ఎన్‌రోల్‌మెంట్ విధానంపై కూడా కేంద్రం ఇప్పటి వరకు మార్గదర్శకాలను విడుదల చేయలేదు.
అసత్య ప్రచారాల నివృత్తికి 104ను సంప్రదించండి: డిహెచ్
వ్యాక్సిన్లపై అపోహలు, అసత్య ప్రచారాలపై నివృత్తి చేసుకునేందుకు 104 కాల్ సెంటర్‌ను సంప్రదించాలని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని ఆయన హితవు పలికారు. అయితే వ్యాక్సినేషన్ అనేది నిరంతర ప్రక్రియని, దాన్ని సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు వైద్యశాఖ సిబ్బంది ఎంతో కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. ఆన్‌లైన్ విధానంలో ఇబ్బందులు వచ్చినప్పటికీ, మ్యాన్‌వల్‌గా నమోదు చేసిన రికార్డుల ప్రకారం లబ్ధిదారులందరికీ టీకా వేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు డిహెచ్ చెప్పారు. మరోవైపు ఇప్పటికే నమోదై భయాందోళనతో టీకా వేసుకోని వారికి మరో రోజు కేటాయిస్తామని, అప్పుడు కూడా తీసుకోని వారికి ఇక టీకా ఇచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే గర్బిణీలు, చిన్నారులకు టీకాలు ఇచ్చే నేపథ్యంలో ప్రతి వారంలో బుధ, శనివారాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ ఉండదని ఆయన మరోసారి తెలిపారు.
50% govt healthcare workers get vaccine