బెర్లిన్: ఈ ఏడాది ఫిబ్రవరి 24న రష్యా సైనిక దాడి ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు 50 లక్షల మందికి పైగా ప్రజలు ఉక్రెయిన్‌ను వదిలి ఇతర దేశాలకు పారిపోయారని ఐక్యరాజ్యసమితికి చెందిన శరణార్థుల సంస్థ వెల్లడించింది. ఉక్రెయిన్ నుంచి దాదాపు 50.10 లక్షల మంది ఉక్రెయిన్‌ను వీడి ఇతర దేశాలకు పారిపోయారని జెనీవాలో ప్రధాన కార్యాయలం గల ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్(యుఎన్‌హెచ్‌ఆర్‌సి) బుధవారం తెలిపింది.
వీరిలో సగానికిపైగా అంటే 28 లక్షల మందికి పైగాముందుగా పోలాండ్‌కు పారిపోయారని, వీరిలో చాలామంది అక్కడే ఉండిపోగా మిగిలిన వారు ముందుకు సాగిపోయారని సంస్థ తెలిపింది. యూరోపియన్ యూనియన్‌లో అనేక చోట్ల సరిహద్దు చెక్‌పోస్టులు ఉన్నాయి. మార్చి 30 నాటికి 40 లక్షల మంది ఉక్రెయిన్‌ను వీడారని, అయితే యుద్ధం మొదలైన మొదటి వారాలతో పోలిస్తే ప్రస్తుతం వలసలు వెళ్లే వారి సంఖ్య తగ్గిందని సంస్థ పేర్కొంది. శరణార్థులతోపాటు మరో 70 లక్షల మందికి పైగా ఉక్రెయిన్‌లోనే నిరాశ్రయులయ్యారని సంస్థ తెలిపింది. యుద్ధానికి ముందు ఉక్రెయిన్ జనాభా 4.40 కోట్లు ఉన్నట్లు సంస్థ తెలిపింది.