Monday, December 23, 2024

సంపదలో సగం వాళ్లదే

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: ప్రతి మనిషికీ సంపాదనే ముఖ్యం. దాన్ని బట్టే ఆ మనిషి విలువ సమాజంలో పెరుగుతుంది. ఇటీవలి కాలంలో సంపాదనే చాలా మంది లక్షంగా ఉంటోంది. ఆ విషయంలో అమెరికన్లు, చైనీయులు ఆరితేరిపోయారు. ప్రపంచంలోని మొత్తం వ్యక్తిగత సంపాదనలో సగం అమెరికా, చైనా పౌరుల సొంతమని, మిగతా సగం మిగతా ప్రపంచదేశాల పౌరుల వ్యక్తిగత సంసాదనగా ఉందని తాజాగా విడుదలయిన ఓ నివేదిక వెల్లడించింది. సాధారణంగా ఒక దేశ ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవడానికి జిడిపి (జాతీయ స్థూల ఉత్పత్తి)ని చూస్తాం.ఆర్థిక స్థితిగతులను అంచనా వేయడానికి మరో కొలమానం వ్యక్తిగత సంపద విలువ. ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిగత సంపదను లెక్కగట్టి ఏ దేశ పౌరులు ఎక్కువ సంపాదిస్తున్నారో, ఎవరు విలువైన ఆస్తులను కూడగడుతున్నారో తెలుసుకోవచ్చు.‘ క్రెడిట్ సూయిస్’ అనే సంస్థ ఏటా ‘గ్లోబల్ వెల్త్ ’ రిపోర్టును విడుదల చేస్తుంది. తాజాగా ఆ సంస్థ ‘ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్2022’ను విడుదల చేసింది.

ఇందులో 2021సంవత్సరం గణాంకాలను పేర్కొంది. 2021డిసెంబర్ చివరి నాటికి ప్రపంచంలోని మొత్తం వ్యక్తిగత సంపద 463.6 లక్షల కోట్ల డాలర్లుగా అంచనా వేశారు. ఇందులో సగం అమెరికా, చైనా పౌరులది కాగా, మిగతా సగం మొత్తం ప్రపంచ దేశాల పౌరుల సంపదగా నివేదిక పేర్కొంది. మొత్తం వ్యక్తిగత సంపదలో అమెరికా పౌరులకు 31.5 శాతం వాటా ఉండగా, తర్వాతి స్థానంలో ఉన్న చైనా పౌరుల వాటా 18.4 శాతంగా ఉంది. 3.1 శాతం వాటాతో మన దేశం ఏడో స్థానంలో నిలిచింది. టాప్10లో అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, యుకె, ఫ్రాన్స్, ఇండియా, కెనడా, ఇటలీ, ఆస్ట్రేలియా దేశాలున్నాయి. అయితే ఆయా దేశాల జిడిపి ప్రపంచ దేశాల జిడిపితో పోలిస్తే కొంత వ్యత్యాసం కనబడుతుంది. ప్రపంచంలోని అన్ని దేశాల జిడిపిలో అమెరికా వాటా 24 శాతం కాగా, వ్యక్తిగత సంపదలో 31.5 శాతంగా ఉండడం గమనార్హం. అయితే చైనా అలా లేదు. ప్రపంచ జిడిపిలో చైనా వాటా 19 శాతం కాగా వ్యక్తిగత సంపదలో ఆ దేశం వాటా 18.4 శాతం కావడం గమనార్హం.

అంతేకాదు ఇటీవలి కాలంలో వచ్చిన అతిపెద్ద మార్పు ఏదంటే చైనా సంపద పెరుగుదల. పదేళ్ల క్రితం ప్రపంచ సంపదలో చైనా వాటా కేవలం 9 శాతం కాగా ఈ పదేళ్ల కాలంలో అది రెండింతలకన్నా ఎక్కువ అయింది. కాగా పది లక్షల డాలర్లు అంతకన్నా ఎక్కువ సంపద కలిగిన వ్యక్తుల (మిలియనీర్ల) సంఖ్య 2021లో 7.9 లక్షలు ఉంటే 2026 నాటికి అది రెట్టింపయి 16.23 లక్షలకు చేరుకుంటుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 6.2 కోట్ల మంది మిలియనీర్లు ఉండగా, 2026 నాటికి వీరి సంఖ్య 8.75 కోట్లకు చేరుతుందని నివేదిక అంచనావేసింది. కాగా మన దేశంలో ఒక్కో వ్యక్తికి ఉన్న సంపద విలువ 2000 సంవత్సరంనుంచి ఏటా 8.8 శాతం పెరుగుతోంది. 2021 ఆఖరుకు అది 15,535 డాలర్లకు చేరింది.

ఈ నివేదికను పరిశీలిస్తే ప్రపంచంలోని 40 శాతం సంపద ఒక శాతం వ్యక్తుల చేతిలోనే కేంద్రీకృతమై ఉందని స్పష్టమవుతుంది. 10 శాతం ధనికుల వద్ద మొత్తం 82 శాతంసంపద పోగుపడి ఉంది. ఎవరివద్ద సంపద ఉందో చెప్పడంకంటే ఎవరి వద్ద లేదో చెప్పడం కూడా ముఖ్యమని నివేదిక రూపకర్త ‘ఆంతోనీ షోరాక్’ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని 50 శాతం వ్యక్తులకు కేవలం ఒక శాతం సంపద మాత్రమే ఉందనే విషయాన్ని నివేదికలో నొక్కి చెప్పారు. సంపద అందరికీ సమానంగా ఉండడం అనేది ఊహకు అందని విషయం. కానీ నిరుపేదలకు వేగంగా సంపద పంపిణీ జరిగితేనే అసలు సంపదకు అర్థం చేకూరుతుంది, అభివృద్ధి దిశగా సమాజం వేగంగా అడుగుల వేస్తుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News