Sunday, December 22, 2024

రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేస్తాం

- Advertisement -
- Advertisement -

జనాభా నిష్పత్తి ప్రకారం దేశ సంపద పంచడానికే కులగణన
తెలంగాణ కులగణన దేశానికే రోల్‌మోడల్ దేశం ఆర్థికంగా
అభివృద్ధి చెందాలంటే కులవివక్ష ఉండరాదు అంటరానితనం
భారత్‌లో తప్ప మరెక్కడా లేదు కులగణన గురించి నేను చెబుతుంటే
దేశాన్ని విభజిస్తున్నానని బిజెపి నేతలు అంటున్నారు : రాహుల్

మనతెలంగాణ/హైదరాబాద్:  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. తెలంగాణలో జరిగే కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ప్రశంసించారు. కులగణనలో కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం లేకపోలేదని అయినప్పటికి వాటిని సరిదిద్దుతామని రాహుల్ స్పష్టం చేశారు. కులగణనలో ఏ ప్రశ్నలు అడగాలన్నది ఏదో మూలన కూర్చొని అధికారులు (బ్యూరోక్రాట్స్) నిర్ణయించకూడదని, ఆ ప్రశ్నలను సామాన్యుల నుంచే రావాలని ఆయన సూచించారు.

హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో (గాంధీతత్వ చింతన కేంద్రంలో) టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కులగణనపై పౌరహక్కులు, మేధావులతో నిర్వహించిన అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో రాహుల్‌గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కలు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా కులగణన జరగాలని తాను పిలుపునిచ్చినప్పుడు ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి నాయకులు విమర్శించారని కులగణన జరిగితే వాస్తవాలు బయటకు ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ మేధావులు, బిసి సంఘాల నాయకులతో ముఖాముఖీ మాట్లాడారు. దేశంలో కులవివక్ష ఉందన్నది అక్షరాల నిజం అని రాహుల్ పేర్కొన్నారు. కులం విషయంలో ఓ విజన్‌తో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. తాము కేంద్రంలో అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కులగణన చేపడుతామని రాహుల్ గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ సర్వే గురించి తాను సంతోషిస్తున్నానని కులగణన విషయంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ కానుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

రాజకీయ, న్యాయవ్యవస్థలో కూడా కులవివక్ష ఉంది

దేశసంపదను సమానంగా పంచాలంటే దేశం మొత్తం కులగణన సర్వే చాలా కీలకమని రాహుల్ పేర్కొన్నారు. కులగణన సర్వే ఎందుకు కీలకమో రాహుల్ వివరించారు. తాను ఈ మాట అన్నప్పుడు దేశాన్ని విభజించే కుట్ర చేస్తున్నానని ప్రధాని మోడీ అంటున్నారని, వాస్తవాలు ప్రజలకు తెలియాలనుకోవడం దేశాన్ని విభజించడం అవుతుందా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కులగణన సర్వే ద్వారా కులాల లెక్క తెల్చవచ్చని, దేశవ్యాప్తంగా కులగణనపై పార్లమెంట్ చర్చపెట్టింది తానేనని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఏ వ్యవస్థలో ఏ వర్గం ఎంత ఉందో కనుక్కోవాలని, నిజం బయటకు రావొద్దని కొందరు కులగణనను వ్యతిరేకిస్తున్నారన్నారు.

తన స్నేహితుల్లో చాలామంది అగ్ర కులాల వారు ఉన్నారని, దేశంలో కులగణన ఎక్కడుందని తనను ప్రశ్నిస్తుంటారని ఆయన పేర్కొన్నారు. కానీ, వారు కనిపించకపోవచ్చు అదే దేశంలో అతి పెద్ద సమస్య అని ఆయన తెలిపారు. ఇది ఒక రంగానికే పరిమితం కాలేదని, అంతర్లీనంగా అన్ని రంగాల్లో వేళ్లూనుకుపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ, న్యాయవ్యవస్థలు కూడా ఈ కులవివక్షకు మినహాయింపు కాదన్నారు. కార్పొరేట్ కంపెనీల్లో ఎంతమంది దళితులు, ఆదివాసీలు, ఓబిసిలు, మైనార్టీలు పనిచేస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, దేశసంపద జనాభా నిష్పత్తి ప్రకారం అందాలంటే కులగణన జరగాల్సిన అవసరం తప్పదని రాహుల్ పేర్కొన్నారు.

కుల వివక్ష అనుభవించే వాళ్లకు ఆ బాధ తెలుస్తుంది

టైటానిక్ పడవను తయారు చేసిన వాళ్లు ఈ పడవ ప్రపంచంలోనే అత్యంత పెద్దది, ఇది ఎన్నటికీ మునిగిపోదు అనుకున్నారు. కానీ, సముద్రంలో ఒక మంచు కొండను ఢీకొని 20 నిమిషాల్లో మునిగిపోయిందని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. ఎందుకు అంటే సముద్రంలో ఆ మంచుకొండ 10 శాతం మాత్రమే బయటకు కనిపించిందని, మిగతా 90 శాతం సముద్రగర్భంలో ఉండడంతో దానిని గుర్తించకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. దేశంలో కులవివక్షత, అంటరానితనం అనేది బయటకు కనిపించనంత ప్రమాదకరమని ఆయన అన్నారు. అలాగే నేడు సమాజంలో కుల వివక్ష లోతుగా, బలంగా ఉందని, దేశంలో కుల వివక్ష అనుభవించే వాళ్లకు ఆ బాధ తెలుస్తుందని రాహుల్ వాపోయారు.

ప్రొఫెసర్లు సూచించిన విషయాలు నోట్ చేసుకున్న రాహుల్

కులగణన ద్వారా అన్ని కులాలకు న్యాయం జరుగుతుందని రాహుల్ అన్నారు. కులాల వారీగా జనాభా లెక్కిస్తే తరాలుగా నష్టపోతున్న వారికి తగిన ప్రాతినిథ్యం దొరుకుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కుల వ్యవస్థ అనేది కొంత మంది ఆత్మ విశ్వాసం దెబ్బతీస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల యువత సైతం ముందుకు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని రాహుల్ గాంధీ చెప్పారు. కుల వివక్షత వల్ల ఎంత ఇబ్బంది ఉంటుందో అర్థం చేసుకోగలనని, దేశం ఆర్థికంగా ఎదగాలంటే దానిని నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. కులగణనను ఎక్స్‌రేతో పోల్చుతానని రాహుల్ అభివర్ణించారు. ఈ సెన్సెస్ ద్వారా దళితులు, ఓబిసిలు, మహిళల సంఖ్యపై స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మేధావులు, ప్రొఫెసర్లు కులగణనపై మాట్లాడి సూచనలు చేశారు. ప్రొఫెసర్లు చెప్పిన విషయాలను రాహుల్ గాంధీ స్వయంగా నోట్ చేసుకున్నారు.

కులగణనను ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది: సిఎం రేవంత్

రాష్ట్రంలో కులగణనను ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు సామాన్యుల నుంచి సూచనలు తీసుకోవడానికి రాహుల్‌గాంధీ నేరుగా రాష్ట్రానికి రావడం గొప్ప విషయమన్నారు. సామాజిక బాధ్యత, సమాన అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచనతో రాహుల్ గాంధీ ఇక్కడకు వచ్చారని, మాటలు కాదు, చేతలతో చూపాలన్నది రాహుల్ గాంధీ ఆలోచన అని ఆయన వ్యాఖ్యానించారు. కులగణన విషయంలో రాహుల్‌కు ఇచ్చిన మాట నెరవేర్చడమే తమ కర్తవ్యమని సిఎం పేర్కొన్నారు. కులగణన మాటల్లో కాదు చేతల్లో చూపాలన్నదే ఆయన ఆలోచన అని సిఎం తెలిపారు.

ఈ నిర్ణయం తీసుకోవాలంటే గుండె ధైర్యం కావాలన్నారు. సామాజిక బాధ్యత, సమాన అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సిఎం రేవంత్ పేర్కొన్నారు. బిసిలకు అందాల్సిన రిజర్వేషన్లు కులగణనతో అందిస్తామని సిఎం స్పష్టం చేశారు. 2025లో చేపట్టబోయే జనగణనలో కులగణనను కూడా పరిగణలోకి తీసుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

భారత్ జోడో యాత్ర ఎంతోమందిని కదిలించింది: సిఎం

భారత్ జోడో యాత్ర ఎంతోమందిని కదిలించిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేస్తున్నామని, ఇందిరాగాంధీ ‘గరీబ్ హఠావో’ అనే నినాదంతో చరిత్రలో నిలిచారని సిఎం గుర్తుచేశారు. ప్రస్తుతం తెలంగాణలో కులగణన చారిత్రాత్మకం కాబోతోందని, రాహుల్ గాంధీ నేతలకు మాట ఇస్తే అది శాసనమని రేవంత్ చెప్పారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కులగణనపై ముందుకెళ్తున్నామని, కులగణన చేసి తెలంగాణ దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలవబోతోందని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

కులగణన పూర్తి చేసి బిసిలకు న్యాయంగా అందాల్సిన రిజర్వేషన్లు

విద్య, వైద్యం, ఉద్యోగం, సామాజిక న్యాయం ప్రజలకు అందించాలని రాహుల్ గాంధీ అడుగు ముందుకు వేశారని, రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నెరవేర్చడమే మన కర్తవ్యమని సిఎం రేవంత్ తెలిపారు. ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలో 31,383 మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారని, ఇందులో ఓసీలు- 3,076 (9.8 శాతం), ఈడబ్ల్యూఎస్- 2,774 (8.8 శాతం), ఓబిసిలు-17,921 (57.11 శాతం), ఎస్సీలు-4,828 (15.3 శాతం), ఎస్టీలు -2,783 (8.8 శాతం) అని సిఎం రేవంత్ తెలిపారు. ఇది తమ చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. మనది రైజింగ్ తెలంగాణ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. దేశానికి రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను అమలు చేయడం మన కర్తవ్యమని రేవంత్ రెడ్డి తెలిపారు. కులగణనను పూర్తి చేసి బిసిలకు న్యాయంగా అందాల్సిన రిజర్వేషన్లు అందిస్తామని సిఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు.

ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేపడుతున్నాం: డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క

సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్ల, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో రాహుల్ ప్రచారం చేస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కులగణన చేపడతామని ఆయన ప్రకటించారని, ఆయన ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేపడుతున్నామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని వెనక్కి పోలేదని ఆయన అన్నారు. రాజ్యాంగ ప్రవేశికను అమలు పరచడం, ప్రవేశికలో అన్ని ఆచరణలో పెడతామన్నారు. కులగణనపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశామని, ఆ తీర్మానం ఆధారంగా జీఓ విడుదల చేశామని, నేటి నుంచి కులగణను ప్రారంభిస్తున్నామని తెలియజేసేందుకు వర్షం వ్యక్తం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు ధన్యవాదాలు తెలిపారు.

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఫీల్డ్ స్టడీ చేశాం: మంత్రి ఉత్తమ్

నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కులగణన చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించిన సందర్భంలో కులగణన చేపడుతామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. ఆ హామీ నెరవేర్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందన్నారు. కులగణన చేస్తామని మేనిఫెస్టోలో చెప్పామని, ఇచ్చిన మాట ప్రకారం కుల గణన చేస్తున్నామని ఆయన అన్నారు. కులగణన కోసం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఫీల్డ్ స్టడీ చేశామని, లోకల్ బాడీ ఎన్నికల్లో జనాభా లెక్కల ప్రకారం బిసిల రిజర్వేషన్ పెంచుతున్నామని, బిసి రిజర్వేషన్లు కోసం కోర్ట్ డెడికేటెడ్ బిసి కమిషన్ వేయాలని సూచిస్తే వెంటనే వేశామని, ప్రభుత్వానికి బిసిల అభ్యున్నతి, సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.

రాహుల్‌కు స్వాగతం పలికిన సిఎం, డిప్యూటీ సిఎం, పిసిసి అధ్యక్షుడు

మంగళవారం సాయంత్రం బేగంపేట్‌లోని విమానాశ్రయానికి రాహుల్ గాంధీ చేరుకోగానే సిఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌లు ఆయనకు ఘన స్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయానికి కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. సిటీలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో సందడి నెలకొంది. ఈ సమావేశానికి మేధావులు, ప్రొఫెసర్లు, వివిధ రంగాలకు చెందిన వారు దాదాపు 400 మంది దాకా హాజరయ్యారు. రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాహుల్ గాంధీకి స్వాగతం పలికేందుకు ఐమాక్స్ ఇందిరా గాంధీ విగ్రహం నుంచి బేగంపేట విమానాశ్రయం వరకు బైక్ ర్యాలీ సాగింది. రాహుల్ గాంధీకి బోయిన్‌పల్లి తాడ్‌బంద్ చౌరస్తా వద్ద కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ భారీ జనంతో స్వాగతం పలికారు. ఈ సమావేశం అనంతరం రాహుల్ తిరిగి ఢిల్లీ వెళ్లిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News