లాహోర్: పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో ఒక హిందూ ఆలయంపై జరిగిన దాడికి సంబంధించి ప్రధాన అనుమానితులతోసహా 50 మందికి పైగా ముష్కరులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. రహీం యార్ ఖాన్ జిల్లాలోని భోంగ్ నగరంలోగల ఒక హిందూ ఆలయాన్ని పరిరక్షించడంలో అధికారుల ఘోర వైఫల్యం పట్ల పాకిస్తాన్ సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన దరిమిలా పోలీసులు రంగంలోకి దిగి సిసి ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టులు చేపట్టారు. ఈ దాడికి సంబంధించి బుధవారం నాడు 150 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
స్థానిక ముస్లిం ప్రార్థనా స్థలంలో మూత్ర విసర్జన చేసిన ఒక ఎనిమిదేళ్ల బాలుడిని అరెస్టు చేసి విడుదల చేయడాన్ని నిరసిస్తూ ముష్కరులు హిందూ ఆలయంపై దాడి జరిపారు. ఈ దాడిని సిగ్గుమాలిన దాడిగా పంజాబ్ ముఖ్యమంత్రి ఉస్మాన్ బుజ్దర్ అభివర్ణిస్తూ ఇప్పటివరకు 50 మందికి పైగా అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారని ట్వీట్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, ఆలయ పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. అరెస్టు చేసిన నిందితులలో కొందరి ఫోటోలను కూడా ఆయన షేర్ చేశారు.