Thursday, November 21, 2024

యుపిలో ఆగని దారుణాలు

- Advertisement -
- Advertisement -

50-year-old woman gang-raped murdered in UP  ఉత్తరప్రదేశ్ మరోసారి తన భ్రష్ట ప్రతిష్ఠను చాటుకున్నది. ఇటువంటివి ఏ రాష్ట్రంలోనైనా, ఎక్కడైనా జరగడానికి అవకాశం బొత్తిగా లేదని చెప్పలేము. కాని యుపిలో జరుగుతున్న హత్యాచార దారుణోదంతాలు ఆ రాష్ట్రాన్ని ఈ అమానవీయ ఘటనల విషయంలో అగ్రభాగాన నిలబెడుతున్నాయి. ఇటీవలే హత్రాస్ జిల్లాలో జరిగిన సామూహిక హత్యాచారం, ఆ సందర్భంలో అక్కడి పోలీసులు వ్యవహరించిన తీరు చివరకు జిల్లా కలెక్టర్ కూడా అపసవ్యంగా నడుచుకున్నారనే విమర్శ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి చెప్పనలవికాని అపఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ఇప్పుడు బుద్వాన్ జిల్లా గ్రామంలో దైవ దర్శనానికి సాయంత్రం పూట ఆలయానికి వెళ్లిన 50 ఏళ్ల మహిళపై సాక్షాత్తూ ఆ గుడి పూజారి, మరి ఇద్దరు సామూహిక అత్యాచారం చేసి తీవ్రంగా గాయపరిచి హతమార్చినట్టు వచ్చిన వార్త దేశంలోని అతి పెద్ద రాష్ట్రంలో అణగారిన వర్గాల స్త్రీలను కక్షగట్టి కాలరాస్తున్నారనే అభిప్రాయానికి అవకాశం కలిగిస్తున్నది. ఈ ఉదంతంలో కూడా పోలీసులు అత్యంత తీరికగా, నిర్లక్షంగా వ్యవహరించడం అందుకు ఇద్దరిపై చర్యలు తీసుకోడం గమనించవలసిన విషయం.

ప్రజల మానప్రాణాలకు రక్షణ కల్పించవలసిన పోలీసు యంత్రాంగం ఆ విధి నిర్వహణలో అక్కడ తరచూ విఫలమవుతున్నదని బోధపడుతున్నది. కేంద్రంలో, యుపిలో అధికారంలో ఉన్న రాజకీయ శక్తులు ఈ దారుణాల పట్ల అవసరమైనంత తీవ్రంగా వ్యవహరించడం లేదని అనిపిస్తే తప్పు పట్టలేము. తాజాగా శుక్రవారం నాడు మొరాదాబాద్‌లో ఒక విద్యార్థిపై అత్యాచారం చేసి మేడ మీది నుంచి కిందికి తోసేసిన దుర్మార్గం చోటు చేసుకున్నది. గత ఆదివారం నాడు జరిగిన బుద్వాన్ ఘటనను గురించి పై అధికార్లకు తెలియజేయడంలోగాని, తక్షణమే రంగంలోకి దిగి బాధ్యతగా వ్యవహరించడంలోగాని అక్కడి పోలీసులు విఫలమయ్యారు. పూజారి, అతడి సన్నిహితుల రూపంలోని కామపిశాచులకు బలైపోయిన మహిళ అంగన్‌వాడీ సహాయకురాలు. సామాజికంగా, ఆర్థికంగా ఆమె నిస్సహాయ స్థితిని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రధాన నిందితుడు రాయ్‌బరేలీ జిల్లా నుంచి కొంత కాలం క్రితం ఆ గ్రామానికి వచ్చి అక్కడి గుడిలో పూజారిగా తిష్ఠ వేసుకున్నట్టు తెలుస్తున్నది. గుడినే నివాసం చేసుకొని ఉంటున్న అతడు ఊరిలోని పరిస్థితులను పూర్తిగా గమనంలోకి తీసుకొని తన పశుపంజాకు ఎవరు దొరుకుతారో గ్రహించి ఈ దుర్మార్గానికి పాల్పడినట్టు కనిపిస్తున్నది.

ఆ మహిళను లొంగదీసుకునే క్రమంలో తీవ్రంగా కొట్టి మర్మస్థానాన్ని కూడా గాయపరిచి సామూహిక అత్యాచారం చేసినట్టు, బహుశా తమ గుట్టు రట్టు కాకుండా చేసుకోడానికి ఆమెను హతమార్చినట్టు అవగతమవుతున్నది. అంతటితో ఆగకుండా నిర్భయంగా మృత దేహాన్ని ఆమె ఇంటికి తీసుకు వెళ్లి కుటుంబ సభ్యులకు అప్పజెప్పడం, ఎండిపోయిన బావిలో పడుండగా చూసి తెచ్చామని బుకాయించడం, ఇంత జరుగుతున్నా అక్కడ సమాజం గాని, అధికార యంత్రాంగం గాని పట్టించుకోకపోడం ప్రత్యేకించి గమనించవలసిన విషయాలు. ఎటువంటి బలం, ప్రాబల్యంలేని కుటుంబాలకు చెందిన స్త్రీల విషయంలోనే ఇలా చేయగలుగుతారు. దీనిని మరో నిర్భయ ఘటనగా పేర్కొనడంలో పట్టణ ప్రాంతాల్లో మహిళలపై జరిగే అకృత్యాలకు, గ్రామాల్లో జరిగే వాటికి మధ్య తేడాను సామాజిక కోణంలో గమనించకపోడం లేక ఆ విషయం తెలిసినా దానిని పట్టించుకోకపోడం కనిపిస్తున్నది. ఇటువంటి దారుణాల సందర్భాల్లో బాధితుల తరపున గట్టిగా నిలబడి తగిన న్యాయం జరిగేలా చూడవలసిన అత్యంత ప్రజాస్వామ్యయుత బాధ్యత కలిగిన స్థానాల్లోని వారు చేసే ప్రకటనలు, వ్యాఖ్యలు, సూచనలు కొన్ని మరింత ఆందోళనకరంగా ఉంటున్నాయి.

ఆ మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసు అధిపతి ఒకరు అమ్మాయిల వస్త్రధారణ విధానమే వారిపై దాడులకు అసభ్య, అత్యాచార ఘటనలకు దారి తీస్తున్నదని వ్యాఖ్యానించి ఔరా అనిపించారు. ఇప్పుడు బుద్వాన్ ఘటనలో బాధిత కుటుంబ సభ్యులను కలుసుకున్న జాతీయ మహిళ కమిషన్ సభ్యురాలు చంద్రముఖి దేవి మొత్తం మహిళా లోకానికి ఓ ఉచిత సలహా పారేశారు. పొద్దు గుంకిన తర్వాత మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లరాదని అన్నారు. దేశంలోని స్త్రీలకు ముఖ్యంగా అణగారిన వర్గాలకు చెందిన వారికి రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వాలది కాదని వారే తగు జాగ్రత్తలు తీసుకొని రాత్రివేళ పర పురుషుల కంట పడకుండా తమను తాము కాపాడుకోవాలన్నది ఆవిడ అభిప్రాయంగా స్పష్టపడుతున్నది. స్త్రీలు అర్థరాత్రి ఒంటరిగా బయట తిరగగలిగిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్య్రమని మహాత్మా గాంధీ పలికిన పలుకులు ఎటువంటి ప్రభావం చూపలేదని బోధపడుతున్నది. చంద్రముఖి దేవి మాటల్లో మహిళలను గృహ జైళ్లకే పరిమితం చేయాలన్న పురుష నిరంకుశాధిపత్య దృష్టే రుజువవుతున్నది. దేశం ఎటు వెళుతోందో అనే ఆందోళన కలుగుతున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News