Friday, November 22, 2024

అస్సాంలో వరద బీభత్సం… రైల్వే ట్రాక్ పైనే 500 కుటుంబాలు

- Advertisement -
- Advertisement -

500 families in Assam live on railway tracks

బీహార్‌లో వరద సంబంధిత ఘటనల్లో 27 మంది మృతి

గువాహటి : అస్సాంలో కుండపోత వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జలదిగ్బంధంలో అనేక గ్రామాలు కూరుకుపోయాయి. 29 జిల్లాల్లో దాదాపు 8 లక్షల మందికి పైగా వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. జమునాముఖ్ జిల్లా లోని చాంగ్జురై , పటియా పాథర్ గ్రామాలు పూర్తిగా నీట మునగడంతో 500కు పైగా కుటుంబాలు రైల్వే ట్రాక్‌లపై గడుపుతున్నాయి. ఈ రెండు గ్రామాలను వదలు ముంచెత్తినా రైల్వే ట్రాక్ కాస్త ఎత్తులో ఉండటంతో అది వరద నీటిలో మునిగి పోలేదు. దీంతో ఈ గ్రామాలకు చెందిన కుటుంబాలు సర్వం కోల్పోయి ట్రాక్‌పై టార్పలిన్ షీట్లతో గుడారాలు వేసుకుని ఉంటున్నారు.

గత ఐదు రోజులుగా తమ పరిస్థితి ఇలాగే ఉందని , తినడానికి తిండి కూడా దొరకట్లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటి మూడు రోజులు గుడారాలు కూడా లేవు. ఆ తర్వాత మా దగ్గర ఉన్న డబ్బులతో టార్పలిన్ షీట్లు తీసుకొచ్చుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారుల నుంచి ఎలాంటి సాయం అందట్లేదు. తాగడానికి నీళ్లు లేవు. రోజుకు ఒక పూటే తింటున్నాం అని బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అనేక చోట్ల రైల్వే ట్రాక్‌లు కూడా నీట మునగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) , రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్) , అగ్నిమాపక శాఖ బలగాలతో పాటు స్థానికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

బీహార్ లోనూ భారీ వర్షాలు
బీహార్‌ను ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. అనేక చోట్ల చెట్లు నేల కూలాయి. వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న వరద సంబంధిత ఘటనల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. వరదల ఘటనలపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

రక్షణ మంత్రి విమానం దారి మళ్లింపు
అటు దేశ రాజధాని ఢిల్లీ లోను శుక్రవారం సాయంత్రం నుంచి ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం అనుకూలించక పోవడంతో ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లాల్సిన 11 విమానాలను లఖ్‌నవూ, జైపూర్‌కు దారి మళ్లించారు. ఇందులో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ప్రయాణించిన విమానం కూడా ఉంది. ఈ ఏడాది నైరుతి పవనాలు కూడా అనుకున్న సమయం కంటే ముందుగానే కేరళను తాకనున్నాయి. దీంతో కేరళ రాష్ట్రంలో వాతావరణం మేఘావృతమై ఉంది. కర్ణాటక లోనూ వర్షాలు కురుస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News