న్యూస్ డెస్క్: గ్రీస్ సమీపంలోని మధ్యధరా సముద్రంలో వందలాది మంది వలసవాదులతో వెళుతున్న ఒక నౌక మునిగిపోయిన దుర్ఘటనలో దాదాపు 500 మంది గల్లంతైనట్లు ఐక్య రాజ్య సమితికి(యుఎన్) చెందిన సంస్థలు వెల్లడించాయి.
ఆ నౌకలో కచ్ఛితంగా ఎంతమంది ఉన్నదీ తెలియరానప్పటికీ 400 నుంచి 750 మంది వరకు అందులో ఉండవచ్చని అంతర్జాతీయ వలసవాదుల సంస్థ(ఐఓఎం), యుఎన్ శరథార్థుల సంస్థ(యుఎన్‌హెచ్‌సిఆర్) శుక్రవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి.
ఇప్పటివరకు 104 మందిని కోస్తా గార్డు సిబ్బంది కాపడగా 78 మృతదేహాలను వెలికితీశారు. మధ్యధరా సముద్రంలో జూన్ 13న మునిగిపోయిన ఈ పడవలో వందలాది మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో చాలామంది మరణించగా వందలాది మంది సముద్రంలో గల్లంతయ్యారు. గల్లంతైన వారంతా మరనించి ఉంటారని అనుమానిస్తున్నారు.
జూన్ 14వ తేదీ నుంచి గ్రీక్ హెల్లెనిక్ కోస్తా గార్డు సముద్రంలో సహాయక, గాలింపు చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ సముద్రయాన చట్టం ప్రకారం సముద్రంలో ఆపదలో ఉన్న వారిని చట్టాలకు, నియమనిబంధనలకు అతీతంగాఅన్ని దేశాలు కాపాదవలసి ఉంటుంది.