Monday, January 27, 2025

లఖింపూర్ ఖేరీ కేసులో 5000 పేజీల ఛార్జిషీట్

- Advertisement -
- Advertisement -

5000 pages chargesheet in Lakhimpur Kheri case

ప్రధాన నిందితుడిగా కేంద్ర మంత్రి అజయ్‌కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా
నిందితుల సంఖ్య 14 కు చేరిక

లక్నో : ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీ హింసాకాండ కేసుపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సోమవారం దాదాపు 5000 పేజీల ఛార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను ( అలియాస్ మొను) కూడా నిందితుడిగా ఛార్జిషీటులో చేర్చింది. ఈ కేసులో అరెస్టయిన ఆయనను ప్రధాన నిందితుడిగా పేర్కొంది. వీరేంద్ర శుక్లా అనే మరో వ్యక్తి పేరు కూడా చేర్చడంతో ఈ కేసులో నిందితుల సంఖ్య 14 కు చేరింది. ఆశిష్ మిశ్రాతోపాటు ఛార్జిషీట్‌లో పేర్కొన్న 13 మంది ప్రస్తుతం జైలులో ఉన్నారు. అయితే సాక్షాలను నాశనం చేశారన్న అభియోగంపై వీరేంద్ర కుమార్ శుక్లాను కూడా ఛార్జిషీట్‌లో చేర్చారు. ఆయన అరెస్టు కాలేదు. కానీ సిట్ అతనికి నోటీసు జారీ చేసింది. కేంద్రమంత్రి అజయ్ మిశ్రాకు శుక్లా దూరపు బంధువు.

అతడిపై ఐపీసీ సెక్షన్ 201 కింద అభియోగాలు మోపారని ప్రాసిక్యూషన్ న్యాయవాది తెలిపారు. మాజీ రాజ్యసభ సభ్యుడు అఖిలేష్ దాస్ మేనల్లుడు లక్నోకు చెందిన అంకిత్ దాస్ ను కూడా ఛార్జిషీటులో చేర్చారు. ఇటీవల రద్దయిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతుల నిరసన సమయంలో గత ఏడాది అక్టోబర్ 3న ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీలో హింస చెలరేగింది. రోడ్డు పక్కన నిరసన చేస్తున్న రైతుల పైకి ఆశిష్ మిశ్రా వాహనం దూసుకెళ్లడంతో పలువురు రైతులు మృతిచెందారు. దీంతో ఆగ్రహించిన రైతులు
ఆ వాహనంతోపాటు మరో వాహనాన్ని తగుల బెట్టారు. బిజెపి కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. ఈ హింసాత్మక సంఘటనలో మొత్తం ఎనిమిది మంది చనిపోయారు. మృతుల్లో నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్, ఇద్దరు బిజెపి కార్యకర్తలు, వాహన డ్రైవర్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News