Thursday, January 23, 2025

అంబేడ్కర్ బాటలో.. గుజరాత్‌లో బౌద్ధం!

- Advertisement -
- Advertisement -

14 ఏప్రిల్ 2023 బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ పుట్టిన రోజున హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ సమీపంలో 125 అడుగుల ఎత్తయిన అతిపెద్ద, కంచు అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించబడింది! ఆయన పట్ల దేశ ప్రజల ప్రేమాభిమానాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఆ రకంగా భారత రాజ్యాంగ నిర్మాతకు దక్కాల్సిన గౌరవం దక్కుతోంది. ‘లైట్ ఆఫ్ ఆసియా’గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గౌతమ బుద్ధుణ్ణి; ఆయన బోధించిన ధర్మాన్ని ప్రచారం చేసిన అశోక చక్రవర్తిని ఈ ఆధునిక కాలంలో కూడా ప్రజలు స్మరించుకుంటున్నారు. అంతేకాదు, హిందూ మతాన్ని త్యజించి ఆరు లక్షల మందితో అంబేడ్కర్ బౌద్ధాన్ని స్వీకరించడం కూడా సమకాలికులకు స్ఫూర్తినందిస్తోంది. తెలంగాణ టూరిజం శాఖ నాగార్జునసాగర్‌లో బుద్ధవనాన్ని ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేసింది. అంతర్జాతీయ స్థాయిలో దాన్ని నిలబెట్టడానికి ఇంకా కృషి చేస్తోంది. ఇక భారత దేశం బయట జరిగే విషయాలు చెప్పుకోవాలంటే ఉత్తర అమెరికాలో అంబేడ్కర్ జయంతిని.. “డా. బి.ఆర్. అంబేడ్కర్ సమానత్వపు రోజు” (DAY EQUALITY) గా గుర్తించి జరుపుకొన్నారు. అంతేకాదు, నెల పొడవునా ‘దళిత చరిత్ర మాసం’ గా పలు కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ విషయాలు ఇలా వుంటే, అదే రోజు 2023 ఏప్రిల్ 14న గుజరాత్‌లో మరో మహాద్భుతం జరిగింది గుజరాత్ రాష్ట్ర రాజధాని గాంధీ నగర్‌లో యాభై వేల మంది దళితులు బౌద్ధం స్వీకరించారు. ఆ రాష్ట్రంలోని పలు గ్రామాల్లోంచి, పట్టణాల్లోంచి, నగరాల్లోంచి, అటవీ ప్రాంతాల్లోంచి దళితులు, ఆదివాసీలు అక్కడి రమాకాంతా మైదానంలో సమావేశమయ్యారు. హిందూ మతాన్ని త్యజించి, బాబా సాహెబ్ అంబేడ్కర్ నడిచిన దారిలో నడిచి, బౌద్ధం స్వీకరించారు. ఆ రాష్ట్రంలోని దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన జాతుల వారు అందరూ కలిసి పెద్ద ఎత్తున ఓ కార్యక్రమం నిర్వహించుకొన్నారు. దంగాపూర్ ఆదివాసీలైతే కుటుంబాలకు కుటుంబాలు తరలి వచ్చి, బుద్ధ దీక్ష తీసుకొన్నారు.

కార్యక్రమం చూడడానికి మరి కొన్ని లక్షల మంది అక్కడికి చేరుకొన్నారు. ఆ కార్యక్రమాన్ని స్వయం సైనిక్ దళ్ (ఎస్‌ఎస్‌డి) అనే స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించింది. అప్పుడు ఆ ఏప్రిల్ 14న జరిగిన ఆ కార్యక్రమం బౌద్ధబిక్షు ప్రజ్ఞా రత్న ఆధ్వర్యం లో జరిగింది వీరు పోరుబందర్‌లోని గ్రేట్ అశోకా బౌద్ధ విహార్ నుండి వచ్చి ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. అక్కడి వారందరితో బౌద్ధ దీక్ష ఇప్పించారు. కార్యక్రమాలు ఆ విధంగానే కొనసాగితే రాబోయే రెండేళ్ళలో అంటే 2025 నాటికి ఒక కోట మంది దీక్ష తీసుకొంటారని దీని వెనక కృషి చేస్తున్న స్వయం సైనిక్ దళ్ ఆశిస్తోంది.
ప్రభుత్వం మతాల మధ్య విద్వేషాలు రగిలించడం మాత్రమే కాదు, హిందూ మతస్థుల మధ్య కూడా కలహాలు సృష్టిస్తోంది. బలవంతంగా హిందుత్వను ప్రజల మీద రుద్దడం వల్ల ఫలితాలు వ్యతిరేకంగా వస్తున్నాయి. హిందూ మతంలోని ఎగుడు దిగుళ్ళని, నిచ్చెనమెట్ల కుల సంస్కృతిని బలపర్చడం, మహిళల హక్కులు, మానవ హక్కులు హరించడం ఈ దేశ ప్రజలు భరించలేకపోతున్నారు.

మనుధర్మ శాస్త్రాన్ని మన ప్రాచీన రాజ్యాంగం అంటూ నెత్తికెత్తుకోవడం, దేశ ద్రోహులైన గాడ్సే, సావర్కర్‌ల స్థాయి అనూహ్యంగా పెంచడం ఈ దేశ ప్రజలకు నచ్చడం లేదు. నీతి లేని, చదువు లేని ప్రబుద్ధులంతా మహా నాయకులై వెలిగిపోవడం అధర్మమే ధర్మంగా చలామణి అవుతూ వుండడం ఈ దేశ ప్రజలకు కష్టంగా వుంది. అందుకే వేల సంఖ్యలో జనం బుద్ధ మార్గాన్ని ఎంచుకొంటున్నారు. దీన్ని హిందూ దేశంగా మార్చాలని కలలు కంటున్న నేటి పాలకులకు, లక్షల మంది హిందూ మతాన్ని త్యజించడం ఒక చెంప పెట్టు!
అధికారంలో వున్న వారు ఉగ్ర మార్గాన్ని వెతుక్కుంటూ వుంటే దానికి దీటైన సమాధానం చెప్పగల సమతా మార్గాన్ని, నైతిక రుజు మార్గాన్ని సామాన్య ప్రజలు వెతుక్కొంటున్నారు. దేవుడనే రాముడి బూచీ చూపించి పాలకులు రాజకీయాలు చేస్తుంటే అసలు దేవుడనే వాడే లేడన్న బుద్ధ మార్గాన్ని ప్రజలు ఇష్టపడుతున్నారు. శోభా యాత్రల పేరుతో పాలకులు, అల్లర్లు, కల్లోలాలు ప్రోత్సహిస్తుంటే.. మనసు ప్రశాంతంగా వుంచుకొని.. సర్వ జనాభ్యుదయాన్ని కాంక్షించే బుద్ధ మార్గాన్ని జనం కోరుకొంటున్నారు.

కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్య నాయకులంతా ఆ రాష్ట్రం వారే. బ్యాంకులు దోపిడీ చేసి పారిపోయిన దొంగలంతా అక్కడి వారే. అలాంటి గుజరాత్ రాష్ట్రంలో సామాన్యుల ఆలోచనలు ఎలా వున్నాయో ఈ కార్యక్రమం తేటతెల్లం చేసింది. అబద్ధాలతో అధికారంలో వుందామనుకొన్న వారికి బదులుగా అబద్ధం ఆడరాదనీ, దొంగతనాలు చేయకూడదని చెప్పిన బుద్ధ మార్గాన్ని గుజరాత్ ప్రజలు కావాలనుకొంటున్నారు. ఇది ఎంతో ఆహ్వానించదగిన పరిణామం. మనం బతుకుదాం. మరొకరిని బతకనిద్దాం. మొత్తానికి మొత్తంగా మనిషిని బతికించుకుందాం అనే సూత్రానికి కట్టుబడ్డ సామాన్యుల చైతన్యం చాలా గొప్పది. వెలుగు వెంట నీడలుండడం కాదు, నీడల్ని మాయం చేయగల వెలుగులు అక్కడ దేదీప్యంగా ప్రసరిస్తున్నాయి.
హిందూ మతంలోని పూజలు, భజనలు, పాపాలు, పుణ్యాలు, ఆత్మలు, పునర్జన్మలు, ఆచారాలు, సంప్రదాయాలు వీటన్నిటి కంటే ముఖ్యంగా ఉన్నతులు, నిమ్న వర్గాలు వంటి వన్నీ మూఢ నమ్మకాల పుట్టలు! వీటిలో వేటికీ ఆధారాలు లేవు. నిరూపణలు లేవు.

కేవలం విశ్వాసాల ఆధారంగా శతాబ్దాలుగా కొనసాగుతూ మానవుల జీవితాలు దుర్భరం చేస్తున్నాయి. అందుకే, వాటన్నింటినీ వదిలి స్వేచ్ఛాలోచనకు, మానవ వాదానికి, విశ్వ మానవ సౌభ్రాతృత్వానికి విలువనివ్వాలని స్వయం సైనిక్ దళ్ ప్రచారం చేస్తుంది. మనుషుల్ని ఎగుడు దిగుడు స్థాయిల్లో వుంచి, వివక్ష చూపుతున్న హిందూ ధర్మాన్ని తిరస్కరించడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం. ఆనాడు అంబేడ్కర్ చేసిందే ఆదర్శంగా తీసుకొని ఈ రోజు దేశంలో లక్షల మంది బౌద్ధం స్వీకరిస్తున్నారు. మనుషులందరిదీ ఒకే స్థాయి అని నినదిస్తున్నారు. ఎవరి జ్ఞానాన్ని వారు, ఎవరి వివేకాన్ని వారు తట్టి లేపుకోవాలని, నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించాలని, బుద్ధిని ఉపయోగించాలని స్వయం సైనిక్ దళ్ జనానికి బోధిస్తోంది. దీక్ష తీసుకొనే విషయంలో ఎవరూ ఎవరినీ బలవంతం చేయడం లేదు. ఎవరూ ఎవరినీ ప్రభావితం చేయడం లేదు. ఎలక్షన్లలో మాదిరిగా ఎవరూ ఎవరినీ డబ్బుతో లొంగ దీసుకోవడం లేదు. స్వచ్ఛందంగా ఇలాంటి పని ఆలోచనా పరులే చేస్తారు. అదీగాక, ఇది పూజలో మంత్రాలు వల్లె వేసి మత మార్పిడి చేసే తంతు కాదు.

అసలు బౌద్ధం మతమే కాదు! అదొక జీవన విధానం!! బుద్ధుడి బోధనలు పూర్తిగా స్వీకరించి, అందుకు అనుగుణంగా తమ జీవన విధానం మార్చుకుంటారు. అంతే ఇది న్యాయ సమ్మతంగా, చట్టబద్ధంగా, మనస్ఫూర్తిగా చేయవల్సిన పని! దీక్ష తీసుకొనే వారు వారి వారి కలెక్టర్ ఆఫీసుల్లో అప్లికేషన్‌లు నింపాలి. ఆ తర్వాత అందులో ప్రకటించినవన్నీ నిజాలా కాదా అనేది పోలీసు ఎంక్వయిరీ జరుగుతుంది. దీక్ష తీసుకొన్న వారి వివరాలన్నీ గెజిట్‌లో అచ్చేస్తారు. ఇదంతా అధికారికంగా జరిగే కార్యక్రమం. ఈ స్వయం సేవక్ దళ్ ఎప్పుడు ఏర్పడింది? ఏమేం పనులు చేస్తుందో చూద్దాం తొలుత 2006లో ఒక యాభై మందితో ఏర్పడింది. ఒకే ఆలోచనా విధానం గల మిత్రులయిన దళిత కార్యకర్తలతో మొదలైంది. ఆ సంఖ్య క్రమంగా ఊహించని రీతిలో పెరుగుతూ పోయింది.

ఈ స్వయం సైనిక్ దళ్‌లో ఎవరు చేరవచ్చు? అంటే నిచ్చెన మెట్ల సంస్కృతిని తిరస్కరించే వారంతా చేరొచ్చు. అందరికీ సమానమైన స్థాయి, హక్కులు, బాధ్యతలు కావాలనుకొనే వారు చేరొచ్చు. మనుషులంతా ఒక్కటే అన్న భావన గలవారే ఈ స్వయం సైనిక్ దళ్ సభ్యులవుతారు. వీరిలో కొందరు నాయకులు, మరి కొందరు కార్యకర్తలు అనే హెచ్చు తగ్గులుండవు. కలిసి మాట్లాడుకోవడానికి, చర్చించుకోవడానికి ‘చింతన శిబిరాలు’ వుంటాయి. అందులో అందరూ సమానమే.
కొందరు వేదిక మీద వుండి ఉపన్యసించడం, మరి కొందరు వేదిక ముందుండి వినడం వుండదు. ఏదో ఒక మైదానంలో అందరూ నేల మీద కూర్చుంటారు. ఎక్కడి వారు అక్కడే నిలబడి మాట్లాడుతారు. అందరూ సమానమనే భావన, బాధ్యత అందరిదీ అనే భావన అక్కడ వున్న వారందరిలో కలుగుతుంది. స్వయం సైనిక్ దళ్ సభ్యులు ఆకు పచ్చ దుస్తులు ధరిస్తారు. ట్రాఫిక్, రవాణా, వైద్య రంగాలకు సంబంధించి ప్రాథమిక పరిజ్ఞానం కలిగి వుంటారు. సామాన్య పౌరులకు ఏ ఇబ్బందీ కలగకుండా అదే రోజు ఒక ‘మహా ర్యాలీ’ కూడా నిర్వహించారు.

ఆ కార్యక్రమానికి వచ్చే వారి కోసం 800ల బస్సులు, 5 వేల కార్లు ఏర్పాటు చేసుకొన్నారు. గాంధీ నగర్ విధాన సభ ముందున్న అంబేడ్కర్ విగ్రహం దగ్గర 22 ప్రతిజ్ఞలు చేశారు. ఆ ర్యాలీ ఉద్దేశమేమంటే సామాన్య పౌరుల్లో చేతనత్వాన్ని కలిగించడం. బుద్ధ మార్గంలోకి రావాలనుకునే వారిని ఆహ్వానించడం. ఏ నిర్ణయమూ తీసుకోలేక కొట్టుమిట్టాడుతున్న వారికి ఒక ఉత్తేజాన్ని కలిగించడం. దిశా నిర్దేశం చేయడం. ప్రతి సంవత్సరం అంబేడ్కర్ జయంతి రోజున ఇలాంటి దీక్షలు ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, భోపాల్, ముంబై, హైదరాబాద్, లక్నో వంటి పెద్ద పెద్ద నగరాలలో జరపాలని స్వయం సైనిక్ దళ్ పథకాలు వేసుకొంది. రాబోయే కాలంలో బుద్ధ దీక్ష కార్యక్రమాలు దేశంలో ఇంకా పెద్ద ఎత్తున జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మోసం, దగా నిత్యకృత్యాలై జీవితాలు దుర్భరమైపోతున్న ఈ రోజుల్లో.. కేవలం బౌద్ధమే నైతిక మార్గం చూపగలదని, ప్రజల మానసిక ఆరోగ్యం కాపాడగలదని, మానవ జాతిని రక్షించగలదని మానవ ప్రేమికులంతా భావిస్తున్నారు. మానవవాదులంతా ఆశిస్తున్నారు.

ఆ దేశ ప్రజలు మానవీయ విలువల పరిరక్షణ కోరుకొంటున్నారని ఈ సంఘటన చెప్పకనే బలంగా చెబుతోంది!! ఇంకా రుజువు లేం కావాలీ? భారత దేశ చరిత్రలో మే 10 కి చాలా ప్రాధాన్యత వుంది. 1857లో ఇదే రోజు దేశ స్వాతంత్య్రం సమరం తొలిసారి ప్రారంభమైంది. అందులో అన్ని ధర్మాల, అన్ని జాతుల, అన్ని ప్రాంతాల వారు సమైక్యంగా ముందుకు వచ్చి పాల్గొన్నారు. ఒక రకంగా ఆ రోజు మత సామరస్యానికి చిహ్నంగా నిలిచిన రోజు. పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (పియుసిఎల్) ఢిల్లీ శాఖ వారు ఢిల్లీలోని ఎన్.డి. తివారి భవన్‌లో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఇదే విషయం మీద ప్రఖ్యాత చరిత్ర కారిణి మృదులా ముఖర్జీ ఉపన్యాసాన్ని ఏర్పాటు చేశారు. సమకాలీన పరిస్థితుల్ని దృష్టిలో వుంచుకొని, దేశంలో ప్రజల మధ్య సుహృద్భావాన్ని, మత సామరస్యాన్ని పెంపొందించడానికి దేశ వ్యాప్తంగా ఇలాంటి సమావేశాలు, చర్చలు విరివిగా జరగాల్సిన అవసరం వుంది!.

డా. దేవరాజు మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News