Monday, January 20, 2025

రానున్న 25ఏళ్లలో వ్యవసాయరంగంలో పెనుమార్పులు

- Advertisement -
- Advertisement -

50th Anniversary celebrations of ICRISAT

కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్

హైదరాబాద్: రానున్న రెండున్నర దశాబ్దాల కాలంలో దేశ వ్యవసాయ రంగంలో పెనుమార్పులు చోటు చేసుకోనున్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వెల్లడించారు. పటాన్ చెరులోని ఇక్రిశాట్ సంస్థ స్వర్ణోత్సవ వేడుకలను శనివారం నాడు ప్రధాని నరేంద్రమోడి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ మాట్లాడుతూ ఆజాదీకా అమృత్ మహోత్సవాల సందర్బంలోనే ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలు జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఇక్రిశాట్‌లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలకు , సిబ్బందికి , అధికారులకు కేంద్ర మంత్రి స్వర్ణోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర వార్షిక బడ్జెట్‌లో ఆర్ధిక శాఖ మంత్రి వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారన్నారు.

దేశంలో 2005నుంచి వ్యవసాయ రంగానికి కేంద్ర వార్షిక బడ్జెట్‌లో నిధుల కేటాయింపులకు సంబంధించి ప్రాధాన్యతలు పెరుగుతూనే ఉన్నట్టు తెలిపారు. దేశంలో రైతులు ఎంతో కష్ట పడి పంటలు పండిస్తున్నారన్నారు. జై జవాన్..జై కిసాన్ నినాదంతోపాటు ప్రధాన మంత్రి నరేంద్రమోడి జై విజ్ణాన్ ..జై అనుసంధాన్ అనే నినాదాన్ని చేర్చారని వెల్లడించారు.దేశంలో వివిధ రకాల వాతావరణ పరిస్థితులకు తట్టుకునే కొత్త రకం వంగడాలపై మరిన్ని పరిశోధనలు చేయాలని ఇక్రిశాట్‌కు సూచించారు. దేశ ప్రజల ఆహారంలో చిరుధాన్యాల ప్రాత్ర పెరుగుతూ వస్తోందన్నారు. ఆ దిశగా పరిశోధనలను విస్తృతం చేయాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ శాస్త్రవేత్తలకు సూచించారు.ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ జాక్విలిన్‌హ్యూస్ మాట్లాడుతూ ఇక్రిశాట్ ఏర్పడి 50ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ సంస్థ ద్వారా వ్యవసాయ రంగానికి చేసిన కృషిని వివరించారు.

విభిన్న రకాల వాతావరణ పరిస్థితులకు తట్టుకుంటూ వర్షాధార భూముల్లో జొన్న , సజ్జ, కంది , వేరుశనగ , శనగ తదితర రకాల పంటల్లో కొత్త వంగడాల రూపకల్పన , వాటి ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల పెంపుదలకు చేసిన కృషి తదితర అంశాను వివరించారు. మెట్ట పంటల సాగులో భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు చేస్తున్న పరిశోధనలు క్లుప్తంగా వివరించారు. వ్యవసాయ రంగంలో రైతులకు రెట్టింపు ఆదాయం లభించేందుకు ఇక్రిశాట్ ద్వార చేస్తున్న కృషిని డైరెక్టర్ జనరల్ జాక్విలిన్ హ్యూస్ వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, ఇక్రిశాట్ సంస్థ డైరెక్టర్ జనరల్ జాక్విలిన్ హ్యూస్ , భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసిఏఆర్) డైరెక్టర్ జనరల్ మహాపాత్రో, కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులు సంజయ్ అగర్వాల్ , చంద్రశేఖర్‌తోపాటు ఇక్రిశాట్‌కు చెందిన పలువులు శాస్త్రవేత్తలు , అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News