నార్త్ మెసిడోనియాలోని తూర్పు ప్రాంత పట్టణం కొకానిలో ఆదివారం తెల్లవారు జామున ఒక నైట్‌క్లబ్‌లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 51 మంది వ్యక్తులు దుర్మరణం చెందినట్లు, 100 మందికి పైగా గాయపడినట్లు దేశీయాంగ శాఖ మంత్రి పాంచె తొష్‌కోవ్‌స్కీ మీడియా గోష్ఠిలో వెల్లడించారు. పల్స్ నైట్‌క్లబ్‌లో ఒక స్థానిక పాప్ బృందం కచేరి సమయంలో తెల్లవారు జామున సుమారు 2.35 గంటలకు మంటలు ప్రజ్వరిల్లాయని తొష్‌కోవ్‌స్కీ తెలిపారు. మండే స్వభావం కలిగిన వస్తువులు వాడడం వల్లే సీలింగ్‌కు నిప్పు అంటుకుందని ఆయన చెప్పారు. క్లబ్‌లో గందరగోళ దృశ్యాలు వీడియోలో కనిపించాయి. దట్టంగా కమ్ముకున్న పొగ మధ్య యువజనులు పరుగులు తీయడం, సాధ్యమైనంత త్వరగా తప్పించుకు బయటపడాలని సంగీతకారులు జనాన్ని కోరుతుండడం వీడియోలో కనిపించింది.
క్షతగాత్రులను రాజధాని స్కోప్జె సహా దేశవ్యాప్తంగా గల ఆసుపత్రులకు తరలించినట్లు, అనేక మందికి తీవ్రంగా కాలిన గాయాలు అయినట్లు అధికారులు తెలియజేశారు. అనేక వాలంటీర్ సంస్థలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. 118 మందిని ఆసుపత్రుల్లో చేర్పించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి అర్బెన్ తరవరి తెలిపారు. ఇరుగుపొరుగు దేశాల నుంచి సహాయ కార్యక్రమాలకు ప్రతిపాదనలు అందాయని ఆయన తెలిపారు. ‘మేము శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం. ఈ విషాద ఘటనలో యువజనుల సాయంతో సాధ్యమైనంత ఎక్కువ మందిని రక్షించేందుకు గరిష్ఠ స్థాయిలో యత్నిస్తున్నాం’ అని మంత్రి విలేకరులతో చెప్పారు. 20 లక్షల కన్నా తక్కువ జనాభా కలిగిన మెసిడోనియాలో ఇటీవలి కాలంలో సంభవించిన అత్యంత విషాద ఘటన ఇది. ‘మెసిడోనియాకు ఇది సంక్లిష్ట, అత్యంత విషాదకర దినం. అనేక మంది యువజనులు ప్రాణాలు కోల్పోవడం దుర్భరం’ అని ప్రధాని హృస్తిజన్ మిక్కోస్కి ‘ఎక్స్’లో పేర్కొన్నారు.