Wednesday, January 22, 2025

కెన్యాలో ట్రక్ అదుపు తప్పి ఢీకొనడంతో 51 మంది మృతి

- Advertisement -
- Advertisement -

నైరోబీ: పశ్చిమకెన్యాలో శుక్రవారం రాత్రి ( భారత కాలమానం ప్రకారం ) లొండియాని జంక్షన్‌లో ట్రక్ అదుపుతప్పి ఇతర వాహనాలను ఢీకొనడంతోపాటు పాదచారుల పైకి దూసుకెళ్లడంతో 51 మంది మృతి చెందారు. రాజధాని నైరోబీకి వాయువ్యదిశగా 200 కిమీ దూరంలో ఈ ప్రమాదం జరిగిందని రిఫ్ట్ వ్యాలీ పోలీస్ కమాండర్ టామ్ ఒడేరా వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన 32 మందిని ఆస్పత్రికి తరలించామని చెప్పారు.

రక్తదానం చేయాల్సిందిగా కెన్యా ప్రజలను కోరారు. భారీగా వర్షాలు కురుస్తుండడం సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోందని, కొంతమంది ఇంకా శిధిలాల్లో ఇరుక్కుని ఉన్నారని చెప్పారు. కెన్యా రవాణా మంత్రి కిప్‌చుంబా ముర్కొమెన్ ప్రమాదస్థలాన్ని శనివారం సందర్శించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు సంభవించకుండా జాతీయ రహదారిపై నుంచి మార్కెట్లను వేరో చోటికి తరలిస్తామని మంత్రి తెలిపారు.

దేశాధ్యక్షుడు విలియమ్ రూటో సంతాప సందేశాన్ని ట్వీట్ చేశారు. ఈ ప్రమాదం తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని, మోటారిస్టులు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రధాన జాతీయ రహదారిపై నుంచి ట్రక్ అదుపు తప్పి పాదచారులను ఢీ కొనేముందు అనేక వాహనాలను ఢీకొట్టిందని స్థానిక మీడియాకు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ ప్రమాదానికి బలైన వారి వివరాలు సంబంధీకులు తెలుసుకోడానికి ఆస్పత్రుల్లో సమాచార కేంద్రాలను నెలకొల్పామని కెన్యా రెడ్‌క్రాస్ సొసైటీ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News