Monday, December 23, 2024

బిజెపి కూటమిలో చేరాలని ఎంఎల్‌ఎలు…

- Advertisement -
- Advertisement -

ముంబయి: గత ఏడాది మహారాష్ట్రలో ప్రభుత్వం కూలిపోయినప్పుడు బిజెపి కూటమిలో చేరేందుకు పార్టీలో చర్చ జరిగినట్లు ఎన్‌సిపి నేత ప్రఫుల్ పటేల్ వెల్లడించారు. బిజెపి కూటమితో పొత్తు పెట్టుకునే అవకాశాలను వదులుకోకూడదని 51 మంది ఎన్‌సిపి ఎంఎల్‌ఎలు పార్టీ అధినేత శరద్ పవార్‌కు సూచించినట్లు ఓ మరాఠా న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ప్రఫుల్ పటేల్ చెప్పారు.

ఎన్‌సిపి అధికారానికి దూరంగా ఉండకూడదని, బిజెపి కూటమితో పెట్టుకుంటే పార్టీకి మేలు జరుగుతుందని ఎంఎల్‌ఎలు లేఖద్వారా శరద్ పవార్‌కు సూచించారని ఆయన చెప్పారు. 53 మంది ఎంఎల్‌ఎలున్న ఎన్‌సిపిలో 51 మంది దీనికి మద్దతు ఇచ్చారని చెప్పారు. అయితే ఈ చర్చలకు అనిల్ దేశ్‌ముఖ్, నవాబ్ మాలిక్‌లు మాత్రం హాజరు కాలేదని చెప్పారు. కానీ, దీనిపై అప్పట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. చర్చలు జరిగినప్పటికీ పార్టీ నిర్ణయానికే అజిత్ పవార్ కట్టుబడి ఉన్నారని.. వ్యక్తిగతంగా ఆయన ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని అన్నారు. ఇప్పుడు దానికి ఓ రూపం ఇచ్చినట్లు ఆయన చెప్పారు.

బిజెపి కూటమిలో చేరాలన్న నిర్ణయం తాను కానీ, అజిత్ పవార్ కానీ తీసుకున్న నిర్ణయం కాదని, ఓ పార్టీగా తీసుకున్న నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. కాగా తాను శరద్ పవార్‌కు ఎంతో సన్నిహితంగా ఉన్నప్పటికీ కొద్ది నెలల క్రితం ఆయన పార్టీ అధ్యక్ష పదవినుంచి వైదొలగాలని తీసుకున్న నిర్ణయం గురించి తనకు తెలియదని ప్రఫుల్ పటేల్ చెప్పారు. శరద్ పవార్ తనపై కోపంగా ఉన్నారని తాను అనుకోవడం లేదని కూడా ఆయన చెప్పారు. తనను పార్టీనుంచి తొలగిస్తూ శరద్ పవార్ తీసుకున్న నిరయంపై ప్రశ్నించగా, పార్టీ చీఫ్ తీసుకున్న నిర్ణయంపై తాను ఎలాంటి వ్యాఖ్యా చేయబోనని చెప్పారు. మీరు కేంద్రమంత్రివర్గంలో చేరబోతున్నారా అని అడగ్గా, ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News