Saturday, November 23, 2024

ఎఐ నిపుణులకు భారీ డిమాండ్..

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అత్యంత వేగంగా విస్తరిస్తోంది. మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఓపెన్ ఎఐ ‘చాట్‌జిపిటి’ విజయంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఎఐ) అప్లికేషన్‌లలో నిపుణులైన వారికి డిమాండ్ పెరిగింది. ఐటి ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ ఫిబ్రవరి నివేదిక ప్రకారం, అమెరికా తర్వాత భారతదేశం అత్యంత నైపుణ్యం కలిగిన ఎఐ, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా టాలెంట్‌ను కలిగి ఉంది. అందుకే ఎఐ సాంకేతికత విషయంలో ప్రపంచం భారతదేశం వైపు చూస్తోంది.

భారతీయ టెక్కీలను టెక్ దిగ్గజాలు కొత్త ఉద్యోగ ఆఫర్లు, ఫ్యాన్సీ జీతం ప్యాకేజీలతో వెంబడిస్తున్నాయి. నాస్కామ్ ప్రకారం, ప్రస్తుతం భారతదేశంలో 4.16 లక్షల మంది ఎఐ ఇంజనీర్లు ఉన్నారు. కానీ అవసరం కంటే 51 శాతం తక్కువగా ఇంజనీర్లు ఉన్నారు. ఇంకా 2.13 లక్షల మంది అదనపు ఎఐ ఇంజనీర్లకు డిమాండ్ ఉంది. గూగుల్ నుండి బైడు, మైక్రోసాఫ్ట్ వరకు దాదాపు ప్రతి టెక్ కంపెనీ ఎఐ ఇంజిన్‌లను తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నాయి. దీని కారణంగా సిలికాన్ వ్యాలీ నుండి యూరప్, ఆసియా, అనేక ఇతర దేశాలు ఎఐ ఇంజనీర్లను నియమించుకుంటున్నాయి.

ఎఐ నిపుణులకు 30- 50% ఇంక్రిమెంట్

హెల్త్‌కేర్, ఫైనాన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీలలో కూడా ఎఐ డిమాండ్ పెరుగుతోంది. కానీ ఎఐ ఇంజనీర్ల కొరత ఉంది. అవసరానికి అనుగుణంగా ఇంజినీర్లు అందుబాటులో లేరు. అయితే ఎఐ నిపుణులు 30-50 శాతం ఇంక్రిమెంట్‌తో నిరంతరం ఉద్యోగాలు మారుతున్నారు. చాలా కంపెనీలు వీరికి రెట్టింపు వేతనాన్ని అందిస్తున్నాయి.

భారత్ రెండో అతిపెద్ద బిగ్ డేటా టాలెంట్

గ్లోబల్ టెక్ పరిశ్రమ బ్యాక్ ఆఫీస్‌గా పేరుగాంచిన భారతదేశం, డిమాండ్- సప్లై అంతరాన్ని తగ్గించలేకపోయింది. నాస్కామ్ ప్రకారం, భారతదేశం అత్యంత నైపుణ్యం కలిగిన ఎఐ, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా టాలెంట్ రెండో అతిపెద్ద పూల్‌ను కలిగి ఉంది. ప్రపంచంలోని ఎఐ టాలెంట్ పూల్‌లో భారతదేశం 16 శాతం వాటా కల్గివుంది. అమెరికా, చైనాతో పాటు ప్రపంచంలోని మొదటి మూడు టాలెంట్ మార్కెట్‌లలో ఒకటిగా భారత్ ఉంది. బెంగళూరులోని బోస్టన్ ఆధారిత కార్ సబ్‌స్క్రిప్షన్ స్టార్టప్ ఫ్లెక్స్‌కార్ బెంగుళూరులో డేటా సైన్స్ హబ్ కోసం ఇంజనీర్లు, కంప్యూటర్ విజన్ స్పెషలిస్ట్‌ల బృందాన్ని నిర్మిస్తోంది. ఫ్లెక్స్‌కార్ ఎగ్జిక్యూటివ్ డుమ్లావ్ మాట్లాడుతూ, బెంగళూరులో తగినంత డేటా ఇంజనీరింగ్ ప్రతిభ ఉందని, అయితే అది సరిపోదని అన్నారు. ఈ నగరంలో ఎఐ టాలెంట్ వేట మరింత ముమ్మరం కానుంది.

66 కొత్త టెక్ ఇన్నోవేషన్ సెంటర్లు

గత సంవత్సరం భారతదేశంలో 66 కొత్త టెక్ ఇన్నోవేషన్ సెంటర్లు ప్రారంభించారు. వీటిని గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (సిజిసి) లేదా క్యాప్టివ్స్ అంటారు. ఇప్పుడు ఈ సంఖ్య దాదాపు 1600కి పెరిగింది. సరసమైన, నైపుణ్యం కలిగిన ప్రతిభ అందుబాటులో ఉన్నందున ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు భారతదేశంలో ముఖ్యంగా బెంగళూరులో సిజిసి, ఆర్ అండ్ డి హబ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News