న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వ్యాక్సిన్ తీసుకున్న 51 మందిలో దుష్ప్రభావాలు బయటపడటం కలకలం రేపుతోంది. వ్యాక్సిన్ వేసుకున్న కొందరిలో 15-20 నిమిషాల తర్వాత అలర్జీ, తేలికపాటి జ్వరం వంటి సమస్యలు తలెత్తినట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. ఢిల్లీ వ్యాప్తంగా శనివారంనాడు 4,319మంది ఆరోగ్య విభాగానికి చెందిన వర్కర్లు టీకా వేయించుకున్నారని, వారిలో 51మందికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు ఆదివారంనాడు వివరించారు. వారిలో ఎయిమ్స్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఒకరి పరిస్థితి సీరియస్‌గా ఉందన్నారు. అతనికి ఐసియులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు జైన్ పేర్కొన్నారు. సత్వర చికిత్స అందించడంతో మిగతా 50మంది వెంటనే కోలుకున్నట్లు ఎయిమ్స్ చీఫ్ రణ్‌దీప్ గులేరియా తెలిపారు. అయితే, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారిని రెండు రోజులు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచనున్నట్లు పేర్కొన్నారు.
51 Vaccine Side Effects cases in Delhi