Friday, November 22, 2024
- Advertisement -
- Advertisement -

టీమిండియా జైత్రయాత్ర..

దుబాయ్‌: ప్రపంచ టెస్టు క్రికెట్ లో ప్రస్తుతం టీమిండియా మేటి జట్టుగా ఎదిగింది. విదేశీ, స్వదేశీ అనే తేడా లేకుండా వరుస విజయాలతో తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది భారత్. ఇటీవల ఆస్ట్రేలియా జట్టును వారి సొంతగడ్డపైనే చిత్తు చేసి చరిత్ర సృష్టించింది. ఏ జట్టైనా ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే ఓడించి సిరీస్ గెలువాలంటే అది శక్తికి మించిన పనే. భారత్ కూడా ఎన్నోసార్లు ఆస్ట్రేలియా గడ్డపై ఘోర పరాభవాలు చవిచూసింది. అయితే, ధోనీ నుంచి టెస్టు పగ్గాలు చేపట్టిన తర్వాత కోహ్లీ సేన దూకుడు ప్రదర్శిస్తూ ఘన విజయాలు సాధిస్తుంది. అదే జోరుతో 2019లో కంగారుల గడ్డపై ఆడుగు పెట్టిన కోహ్లీసేన ఆస్ట్రేలియా జట్టు 2-1తో ఓడించి సిరీస్ ను కైవసం చేసుకుంది. అయితే, బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకుని ఏడాదిపాటు సస్పెన్షన్ కు గురైన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్స్ డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ లు ఈ సిరీస్ లో ఆడలేదు. దీంతో ఈ ఇద్దరు ఆటగాళ్లు ఆడకపోవడంతో ఆసీస్ బలహీనంగా మారిందని, అందువల్లే ఇండియా ఈ సిరీస్ లో గెలువగలిగిందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు చెప్పుకొచ్చారు. అయితే మళ్లీ గతేడాది డిసెంబర్ లో భారత్, ఆతిథ్య ఆసీస్ జట్టుతో నాలుగు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఇప్పడు వార్నర్, స్మిత్ లు జట్టుతో కలవడం, మిగతా ఆటగాళ్లు భీకర పామ్ లో ఉండడంతో ఆసీస్ ఫెవరేట్ గా బరిలోకి దిగింది. అందుకు తగ్గట్టుగానే తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. రెండో ఇన్నింగ్స్ టీమిండియా 36 పరుగులకే పరిమితం కావడంతో ఆసీస్ మాజీలు నోటికు పనిచెప్పారు. ఆసీస్, టీమిండియాను 4-0తో చిత్తు చేస్తుందని జోష్యం చెప్పారు. ఓవైపు కోహ్లీ కూడా పితృత్వ సెలవులతో స్వదేశానికి తిరిగి రావడం, మరోవైపు భారత సీనియర్ ఆటగాళ్లంతా గాయాలతో జట్టుకు దూరమవ్వడంతో అభిమానులు సిరీస్ పై ఆశలు వదులుకున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్ గా పగ్గాలు చేపట్టిన అజింక్యా రహానె, యువ క్రికెటర్లలో ధైర్యాన్ని నింపి తాడో పేడో తేల్చుకునేందుకు జట్టును ముందుండి నడిపించాడు. దీంతో రెండో టెస్టులో భారత్ విజయం సాధించి మళ్లీ రేసులో నిలిచింది. తర్వాత రెండు టెస్టుల్లోనూ అద్భుత పోరాట పటిమతో దుర్భేద్యమైన బౌలింగ్ కలిగిన ఆసీస్ ను మట్టికరిపించి చరిత్ర సృష్టించారు. ఈ సిరీస్ లో ముఖ్యంగా యువ క్రికెటర్లు శుభమ్ గిల్, రిషబ్ పంత్, హనుమ విహారి, శార్దుల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, సీనియర్ ఆటగాడు రవించద్రన్ అశ్విన్ అద్భుతంగా రాణించారు. ఆసీస్ సిరీస్ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్ జట్టుతో గత నెల ఫిబ్రవరి నుంచి మర్చి 6వ తేదీ వరకు జరిగిన నాలుగు మ్యాచుల టెస్టు సిరీస్ లోనూ టీమిండియా అదరగొట్టింది. ఈ సిరీస్ లో ఫెవరేట్ గా బరిలోకి దిగిన భారత్, చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. మరోవైపు ఈ సిరీస్ ను గెలుస్తేనే టీమిండియా వరల్డ్ టెస్టు చాంపియన్ ఫైనల్ కు చేరుకుంటుంది. ఈ దశలో భారత్ పుంజుకుని రెండో టెస్టులో ఘన విజయం సాధించింది.

తర్వాత అహ్మదాబాద్ లోని మోడీ స్టేడియంలో జరిగిన గులాబి బంతి టెస్టులో భారత స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ పటేల్ దెబ్బకు ఇంగ్లండ్ విలవిలలాడింది.దీంతో రెండు రోజుల్లోనే టీమిండియా విజయ ఢంకా మోగించింది. ఈ మ్యాచ్‌లో అశ్విన్ సెంచరీతో అదరగొట్టగా, అక్షర్‌ పటేల్‌ 11 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. ఇదే స్టేడయంలోనే జరిగిన నాలుగో టెస్టు కూడా అక్షర్ పటేల్, అశ్విన్ ధాటికి మూడు రోజుల్లోనే ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 205 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన భారత్ 365 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఓవైపు స్టార్ బ్యాట్స్ మెన్లు పెలియన్ చేరడంతో తీవ్ర కష్టాల్లో పడిన భారత్ ను రిషబ్ పంత్ అద్భుత సెంచరీతోపాటు వాషింగ్టన్ సుందర్ భారీ అర్థశతకంతో పటిష్ట స్థితిలో నిలబెట్టారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టుకు అక్షర్, అశ్విన్ చుక్కులు చూపించారు. తమ స్పిన్ మాయా జాలంతో చెలరేగిన వీరిద్దరూ పోటాపోటిగా చెరో ఐదు వికెట్లతో ఇంగ్లండ్ ఆటగాళ్లకు ముచ్చెమటలు పట్టించారు. దీంతో భారత్ నాలుగో టెస్టులో ఇన్నింగ్స్ 25 పరుగులతో ఘన విజయం సాధించి సగర్వంగా వరల్డ్ టెస్టు చాంపియన్ ఫైనల్ లో అడుగుపెట్టింది. ఫైనల్ లో న్యూజిలాండ్ జట్టుతో బారత్ తలపడనుంది. ఇక, ఈ విజయంతో సొంతగడ్డపై అత్యధిక టెస్టు విజయాలు సాధించిన కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ రికార్డు నెలకోల్పాడు. ఈ సిరీస్‌లో మొత్తంలో 32 వికెట్లు తీసిన అశ్విన్‌.. టెస్టుల్లో వేగంగా 400 వికెట్ల మైలురాయిని కూడా అందుకున్నాడు. దీంతోపాటు అశ్విన్ ఫిబ్ర‌వ‌రి నెల‌కుగాను ఐసిసి ప్లేయ‌ర్ ఆఫ్ ద మంత్‌గా నిలువగా, పంతో జనవరి నెలకుగాను ఐసిసి ప్లేయ‌ర్ ఆఫ్ ద మంత్‌గా నిలిచాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News