వాన చినుకులు మంచి నేల మీద పడడానికి, మురుగు కాలువలో వర్షించడానికి చాలా తేడా ఉంది. మొదటిది వాగులు, వంకలు, నదులను ప్రవహింప చేసి దాహం తీరుస్తుంది, పంటలు పండించి ఆకలి నుంచి కాపాడుతుంది. రెండోది వృథా అయిపోయి మురుగును విస్తరింప చేస్తుంది. ప్రాథమికంగా తమిళ నటుడు, విస్తృతంగా విశ్వవిఖ్యాతి గడించుకున్న దక్షిణాది నట గండరగండడు సూపర్ స్టార్ రజనీకాంత్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు సంబంధించి ఇప్పుడు ఈ రెండు కోణాలు చర్చకు వచ్చాయి. 1969 నుంచి ఇస్తున్న భారతీయ చలన చిత్రరంగ అత్యున్నత పురస్కారమైన ఫాల్కే అవార్డు పొందడానికి రజనీకాంత్‌కు గల అర్హతల విషయంలో సందేహం ఎవరికైనా కలిగితేనే వారి మానసిక ఆరోగ్యం గురించి అనుమానం తలెత్తుతుంది. ఈ విషయంలో ఈ విలక్షణ నటుడిలో వేలెత్తి చూపడానికి సూది బెజ్జమంత సందు కూడా కనిపించదు. అభినయ కౌశలం, నటనలో అనితరమైన వేగం, తనకు మాత్రమే సాధ్యమైన ప్రత్యేక హావ భావ విన్యాసం, అన్నింటికీ మించి గాలిలో పరుగెత్తే యువతను గాలం వేసి ఆకట్టుకోగలిగే విశేష అయస్కాంత శక్తి మూటగట్టుకున్న రజనీకాంత్‌ను అలంకరించి ఈ అవార్డు మరింత మెరుపును పొందిందనే చెప్పాలి.
సినిమా వ్యాపారానికి కూడా అపూర్వమైన రీతిలో రెక్కలు తొడిగిన అసమాన నటుడు రజనీకాంత్. చలన చిత్రాన్ని సంచలన స్థాయికి తీసుకు వెళ్లిన రజనీకాంత్ తమిళ సినిమా రంగంలో కమల హాసన్‌కు దీటుగాను, అంతకు మించిన స్థానాన్ని సంపాదించుకొని ఇతర దక్షిణాది భాషల్లో కూడా కీర్తి కిరీటాలను సాధించుకున్నారు. నిజ జీవితంలో బస్సు కండక్టర్ స్థాయి నుంచి ఇంత గొప్ప నటుడుగా ఎదగడం కూడా ఆయనకు మరొక ప్రత్యేకతను తీసుకు వచ్చింది. ధగధగ లాడే ధవళ వర్ణంలో రాచఠీవితో రాణించడమే హీరోయిజం కాదని ప్రజల రంగు, ప్రజలలో ఒకడుగా తెర మీద జీవించడం ద్వారానూ నటనను గొప్పగా రక్తికట్టించువచ్చునని చాటిన రజనీకాంత్ కు నిజంగానే చలన చిత్ర రంగంలో ప్రత్యేక స్థానం ఏర్పడింది. అటువంటి గొప్ప నటుడుకి ఈ అవార్డు మామూలు రోజుల్లో వచ్చి ఉంటే ఆ వన్నె, వాసి ఎంతో మిరుమిట్లు గొలిపేవి. కాని తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఘట్టం ఊపందుకొని కొద్ది రోజుల్లో పోలింగ్ జరుగనున్నదనగా ఈ అవార్డును ఆయనకు ప్రకటించడం దాని కాంతిని చాలా వరకు హరించింది. ఇంతటి నటుడినీ, కేంద్ర పాలక పార్టీ తన స్వప్రయోజన కాండకు ఉపయోగించుకోడానికి ఈ అవార్డును వాడుకున్నదనే అభిప్రాయం ఏర్పడిపోయింది.
ఇది కళకు దాపురించిన కళంకమే తప్ప వేరొకటి కాదు. తనకున్న అశేష అభిమాన జనం మీద, విశేష ప్రజాదరణపైనా విశ్వాసంతో ఇతర ప్రముఖ నట నేతల అడుగుజాడల్లో రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని ఏనాడో ప్రకటించిన రజనీకాంత్ చాలా ఆలస్యం చేసి ఈ మధ్యనే ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ జరుగదు’ అని చెబుతూ సొంత పార్టీని పెడతానని తేదీ కూడా వెల్లడించారు. అంతలోనే ఆరోగ్య కారణాలు చూపి ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటున్నట్టు ప్రకటించి ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆయన చేత అలా వెనుకడుగు వేయించిన శక్తిని గురించి ఆనాడే ఊహాగానాలు వెలువడ్డాయి. ఎన్నికల వేళ ఆయనకు ఫాల్కే అవార్డును ప్రకటించడంతో ఆ విషయం ఇప్పుడు పూర్తిగా రూఢి అయిపోయింది. భారతీయ జనతా పార్టీ దేశమంతటా అన్ని రాష్ట్రాల్లోనూ తన జెండానే ఎగిరేలా చూసుకోవాలని దీక్ష వహించి అందుకు వీలుగా అన్ని అధర్మాస్త్రాలను ప్రయోగిస్తున్న సంగతి ప్రస్తుత ఎన్నికల తెర మీద స్పష్టంగా కనిపిస్తున్నదే.
రజనీకాంత్‌కు ఫాల్కే అవార్డు ప్రకటన కూడా అటువంటి అనైతిక రాజకీయ బాణమే అన్న ఊహే ఎవరినైనా కుంగ దీస్తుంది. జీవితమంతా ఎంతో కష్టపడి నటనకు తనదంటూ విశిష్ట నిర్వచనాన్ని ఇచ్చిన ఒక గొప్ప నటుడికి అవార్డు ఈ నేపథ్యంలో లభించడం ఎంత బాధాకరమో చెప్పనక్కర లేదు. దేశంలో రాజకీయ స్వార్థ బుద్ధి ఎన్ని వెర్రి తలలనైనా వేయగలదనే చేదు నిజాన్ని ఇది కళ్లకు కడుతున్నది. రజనీకాంత్ మాదిరిగానే తమిళ రాజకీయాలపై అసాధారణ ప్రభావం చూపగల శక్తియుక్తులు, నేపథ్యం ఉన్న శశికళ కూడా జైలు నుంచి విడుదల కాగానే రాజకీయాల్లో ప్రవేశించి తడాఖా చూపిస్తానని ప్రకటించారు. అంతలోనే ఎన్నికల్లో పాల్గోబోనని చెప్పి రాజకీయ సన్యాసాన్ని ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది. భారతీయ జనతా పార్టీ తమిళనాడు పాలక పక్షం ఎఐఎడిఎంకెని తిరిగి అధికారంలోకి తేవడం ద్వారా ఆ రాష్ట్రంపై తన పట్టును గట్టి పరుచుకునే వ్యూహంలో భాగంగా బరిలో వేరే బలమైన శక్తులేవీ లేకుండా చేసుకున్నదని స్పష్టపడుతున్నది. చివరికి చలన చిత్ర కళకు కూడా ఈ మకిలి అంటడమే ఆవేదన కలిగిస్తున్నది.