తెలంగాణలో గణనీయంగా తగ్గిన మాతృ మరణాలు
అతి తక్కువ ఎంఎంఆర్‌లో దేశంలోనే మూడో స్థానం
శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం బులిటెన్ ప్రకారం 56 నుంచి 43కు తగ్గుదల
సత్ఫలితాలిస్తున్న ప్రభుత్వ మతాశిశు సంరక్షణ చర్యలు
హర్షం వ్యక్తం చేసిన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
ఎంఎంఆర్ తగ్గుదలలో వెనుకబడ్డ డబుల్ ఇంజిన్ రాష్ట్రాలు
మనతెలంగాణ/హైదరాబాద్: మాతా, శిశు సంరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. మాతృ మరణాలు (మెటర్నల్ మోర్టాలిటీ రేషియో) గణనీయంగా తగ్గటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (ఎస్‌ఆర్‌ఎస్) బులిటెన్ 2018 -20 ప్రకారం, రాష్ట్రంలో ఎంఎంఆర్ 43కు తగ్గింది. 2017- 19లో ఇది 56 ఉండగా, వైద్యారోగ్య శాఖ తీసుకుంటున్న చర్యల వల్ల ఎంఎంఆర్ ఏకంగా 13 పాయింట్లు తగ్గింది. తద్వారా అతి తక్కువ మాతృ మరణాలలో తెలంగాణ రాష్ట్రం దేశంలో మూడో స్థానంలో నిలిచింది. కేరళ, మహారాష్ట్ర మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. జాతీయ సటటు 97గా నమోదైంది. అంటే తెలంగాణ కన్నా రెట్టింపు. 2017 -19లోనూ తక్కువ ఎంఎంఆర్‌లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల జాతీయ ఆరోగ్య సూచిల్లో తెలంగాణ గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తున్నది. రాష్ట్రం ఏర్పడేనాటికి ఎంఎంఆర్ 92గా ఉండేది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల క్రమంగా తగ్గుతూ వస్తున్నది. ఇప్పుడు 43కు చేరింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 49 పాయింట్స్ తగ్గింది. జాతీయ సగటు 2014లో 130గా ఉండగా.. 97కు తగ్గింది. కేవలం 33 పాయింట్ల తగ్గుదల నమోదైంది.
కెసిఆర్ కిట్‌తో విప్లవాత్మక మార్పులు
మాతా శిశు సంరక్షణలో భాగంగా సిఎం కెసిఆర్ ప్రారంభించిన కెసిఆర్ కిట్లు విప్లవాత్మకమైన మార్పు తెచ్చాయి. కెసిఆర్ కిట్ పథకంలో నమోదు కావడం వల్ల వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే వెసులుబాటు ప్రభుత్వానికి కలిగింది. దీంతో గర్బిణుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం సాధ్యమైంది. కెసిఆర్ కిట్ పథకంలో భాగంగా ప్రతి ఒక్క గర్బిణిని నమోదు చేసుకోవడం, ప్రతి నెల పరీక్షలు చేయించడం, ఉచితంగా అమ్మఒడి వాహన సేవలు అందించడం వల్ల అన్ని దశల్లో గర్బిణులకు నాణ్యమైన సేవలు అందుతున్నాయి. అరికట్టగలిగిన మాతృమరణాల మీద కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. తప్పనిసరిగా నాలుగు ఏఎన్సీ చెకప్స్ ప్రతి గర్బిణికి చేస్తున్నది.
మొదటి రెండు చెకప్స్ పిహెచ్‌సి పరిధిలో చేస్తుండగా, మూడు, నాలుగు చెకప్స్ గైనకాలజిస్ట్, పీడియాట్రిషన్, అనస్థిషియా డాక్టర్ ఉండే ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్నది. రక్తహీనత సమస్య ఉన్న వారిని గుర్తించి వారికి సప్లిమెంటరీ టాబ్లెట్లు ఉచితంగా అందిస్తున్నది. ఆశా, ఏఎన్‌ఎంలు ప్రతి గర్బిణికి ఐరన్ క్యాప్సుల్స్ ఇవ్వడంతో పాటు, వాళ్లు సరిగ్గా వినియోగిస్తున్నారా లేదా అనే విషయాలను తెలుసుకుంటూ అవగాహన కల్పిస్తున్నారు. వినియోగంపై ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. టాబ్లెట్ రూపంలో కాకుండా, ఖర్చుకు వెనకాడకుండా ప్రతి గర్బిణికి కాప్సుల్ రూపంలో ఐరన్ టాబ్లెట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ కావడం ప్రత్యేకత. హై రిస్క్ గర్బిణులను ముందుగా గుర్తించి, వారికి అవసరమైన మద్దతు అందించేందుకు గాను ఆశా, ఎఎన్‌ఎంలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగింది.
గర్బిణీలకు కౌన్సిలింగ్
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడంలో భాగంగా మిడ్ వైఫరీ వ్యవస్థను ప్రభుత్వ ప్రారంభించింది. ఎంపిక చేసిన నర్సులకు శిక్షణ ఇచ్చి వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచింది. ఇలా 207 మంది మిడ్ వైఫరీ నర్సులు సేవలు అందిస్తున్నారు. గర్బిణులకు కౌన్సిలింగ్ ఇవ్వడం, వ్యాయామం చేయించడంతో పాటు, మానసికంగా సంసిద్ధం చేయిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచాలని ఆశాలు, ఎఎన్‌ఎంలను ఎప్పటికప్పుడు ప్రతి నెలా సమీక్ష చేసుకోవడంతో పాటు, వారి పరిధిలో ఉన్న గర్బిణులు డేట్ ఆఫ్ డెలివరీలు గుర్తించి ముందస్తుగా అప్రమత్తం చేస్తూ వారిని ఆసుపత్రులల్లో చేర్పించి తగిన సేవలు అందించేలా చూస్తున్నారు. ఇలా మాతా శిశు సంరక్షణలో భాగంగా గర్బిణుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు దేశంలోనే తెలంగాణను ఆదర్శంగా నిలుపుతున్నాయి.
వెనుకబడ్డ డబుల్ ఇంజిన్ రాష్ట్రాలు
ఎంఎంఆర్ తగ్గుదలలో డబుల్ ఇంజిన్ రాష్ట్రాలు వెనుకబడ్డాయి. అత్యధిక మాతృ మరణాలు నమోదవుతున్న టాప్ మూడు రాష్ట్రాలు బిజెపి పాలిత రాష్ట్రాలే. తాజా నివేదిక ప్రకారం, ఎంఎంఆర్ అస్సాం 195, మధ్య ప్రదేశ్ 173, ఉత్తర్ ప్రదేశ్ 167గా నమోదైంది. 2017-19 నుంచి 2018-20 ఎంఎంఆర్ తగ్గక పోగా పెరిగింది. మధ్య ప్రదేశ్‌లో 10 పాయింట్లు, హర్యానా 14 పెరగగా, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎంఎంఆర్ తగ్గుదలలో ఎలాంటి పురోగతి నమోదు కాలేదు.
వైద్యారోగ్య శాఖ కృషి అభినందనీయం: మంత్రి హరీశ్ రావు
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచనతో రాష్ట్రంలో అమలు చేస్తున్న మాతా శిశు సంరక్షణ చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. మాతృమరణాలు తగ్గించడంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయన్నారు. కెసిఆర్ కిట్స్, అమ్మ ఒడి వాహనాలతో పాటు, ఇతర సంరక్షణ చర్యలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఎంఎంఆర్ 56 నుంచి 43కు తగ్గటం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఇందులో క్షేత్రస్థాయిలో ఉండి వైద్య సేవలు అందించే ఆశాలు, ఏఎన్‌ఎంల నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వైద్యాధికారుల నిరంతర కృషి ఉందని పేర్కొంటూ వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. అయితే దీంతో మనం సంతృప్తి చెందకుండా, మాతృ మరణాలు తగ్గించడంలో మూడో స్థానంలో ఉన్న తెలంగాణను మొదటి స్థానానికి చేర్చి, దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా కీర్తి గడించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాతృమరణలను తగ్గించడంలో డబుల్ ఇంజన్ రాష్ట్రాలు వెనుకబడ్డాయని ట్విట్టర్‌లో విమర్శించారు.