Thursday, January 23, 2025

ఉత్తరాదిన వడదెబ్బతో 54 మంది మృతి

- Advertisement -
- Advertisement -

దేశంలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తరాదిన హీట్‌వేవ్ పరిస్థితులు కొనసాగుతుండగా ఇంత వరకు కనీసం 54 మంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ, పంజాబ్, ఒడిశా వంటి తీవ్ర బాధిత ప్రదేశాల్లో గత కొన్ని రోజుల్లో 45 డిగ్రీలకు పైగానే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. గడచిన 24 గంటల్లో ఒడిశా సుందర్‌గఢ్ జిల్లాలో వడదెబ్బ అనుమానంతో 12 మంది మరణించారు. పిటిఐ వార్తాసంస్థ సమాచారం ప్రకారం, ఝార్ఖండ్ పాలము జిల్లాలో వడదెబ్బ లక్షణాలతో ఒక మహిళతో సహా నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఆ జిల్లాలో గురువారం రాష్ట్రంలోనే గరిష్ఠ ఉష్ణోగ్రత 47.4 డిగ్రీలు నమోదు జరిగింది. బీహార్‌లో వడదెబ్బ వల్ల గురువారం ఎనిమిది మంది మరణించారు.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో రికార్డు స్థాయిలో 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది పూర్వపు రికార్డులను అధిగమించింది. నాగ్‌పూర్‌లోని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు (ఎడబ్లుఎస్) ఇది వరకు ఎన్నడూ లేని విధంగా అధిక ఉష్ణోగ్రతలను నమోదు చేస్తున్నాయి. సరిగ్గా ఒక రోజు వాయవ్య ఢిల్లీలోని ముంగేశ్వర్ ఎడబ్లుఎస్ నమోదు గణాంకాలను ఇది దాటింది. ముంగేశ్వర్ 52.9 డిగ్రీల ఉష్ణోగ్రతను నమోదు చేసిన విషయం విదితమే. సోనెగాఁవ్‌లో ప్రాంతీయ వాతావరణ కేంద్రంలోని ఎడబ్ల్యుఎస్ 54 డిగ్రీల ఉష్ణోగ్రతను నమోదు చేసింది.

ఢిల్లీలో నీటి సంక్షోభం, విద్యుత్ కోతలు
ఇది ఇలా ఉండగా, దేశ రాజధానిలో నీటి సమస్య విషయమై ఢిల్లీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుత హీట్‌వేవ్ పరిస్థితుల కారణంగా నగరంలో నీటి డిమాండ్ బాగా పెరిగిందని, ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ఒక నెల పాటు అదనపు నీటిని విడుదల చేయవలసిందిగా పొరుగున ఉన్న హర్యానాను తాము అర్థిస్తున్నామని ఢిల్లీ ప్రభుత్వం ఒక అర్జీలో సుప్రీం కోర్టుకు తెలియజేసింది. దుర్భరమైన ఈ ఎండ వేడిమి ఉత్తరాదిన విద్యుత్ కోతలకూ దారి తీసింది. దీనితో ప్రజల ఇక్కట్లు రెట్టింపు అయ్యాయి.

నేటి నుంచి హీట్‌వేవ్ తగ్గవచ్చు
ఇది ఇలా ఉండగా, హీట్‌వేవ్ పరిస్థితులు శనివారం నుంచి తగ్గే అవకాశం ఉందని ఐఎండి సూచించింది. ‘గడచిన 24 గంటల్లో బీహార్, ఝార్ఖండ్, ఒడిశాలో అనేక మంది మరణించారు. శనివారం నుంచి ఈ మొత్తం ప్రాంతం నుంచి హీట్‌వేవ్ పరిస్థితులు క్రమేపీ తగ్గవచ్చునని మేము ఆశిస్తున్నాం. దీని ఆధారంగా, పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఒడిశా, బీహార్, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో హీట్‌వేవ్‌కు సంబంధించి మేము శుక్రవారం ఆరంజ్ అలర్ట్ జారీ చేశాం’ అని ఐఎండి సైంటిస్ట్ సోమా సేన్ తెలియజేశారు. కాగా, ఊహించిన తేదీ కన్నా రెండు రోజుల ముందుగానే గురువారం కేరళలోను, ఈశాన్య రాష్ట్రాల్లోను నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా, అవి ఒక నెల తరువాతే ఉత్తర, మధ్య, తూర్పు భారత ప్రాంతాలకు చేరతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News