నల్లగొండ: జిల్లా నియోజకవర్గ పరిధిలోని ముషంపల్లి ఘటన అమానుషం అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ముషంపల్లి గ్రామంలో బుధవారం గుడిపాటి ధనలక్ష్మీ(54) అనే మద్యవయస్కురాలిని అదే గ్రామానికి చెందిన ఇద్దరు కూలీలు మద్యం మత్తులో అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం మంత్రి జగదీష్ రెడ్డి ఆస్పత్రికి చేరుకుని మృతురాలి భౌతిక ఖాయానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను మంత్రి పరమార్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముషంపల్లి ఘటన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరుగుతుందని వెల్లడించారు. దుండగులకు శిక్ష పడేలా ఆధారాలు సేకరిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ తరహా ఘటనలపై ప్రజల్లో స్పందన రావాలని ఆయన పిలుపునిచ్చారు. ముషంపల్లి ఘటనపై గ్రామ ప్రజల స్పందన ఇతరులకు మార్గదర్శనం కావాలని ఆయన విజ్ణప్తి చేశారు.
54 years old Woman murdered in Nalgonda