Monday, December 23, 2024

జలం పుష్కలం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో క్రమేపి వేసవి ముదురుతోంది.. మరో వైపు యాసంగిలో వివిధ రకాల పంటల సాగు విస్తీర్ణం కూడా ముగింపు దశకు చేరింది. చిన్నా, పెద్ద తరహా, మీడియం ప్రాజెక్టులతోపాటు భూగర్భ జలాల ఆధారంగా బోర్ల కింద వరినాట్లు వేసే పనులు కూడా పూర్తయ్యాయి. కృష్ణా, గోదావరి నదుల పరివాహక ప్రాంతాలలోని ప్రధాన ప్రాజెక్టుల్లో యాసంగి పంటలసాగుతోపాటు వేసవి అవసరకాలకు కూడా నీటినిలువలు పుష్కలంగా ఉన్నట్టు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ జలాశయాల్లో సుమారు 535టిఎంసీలకు పైగా నీటి నిలువలు ఉన్నాయి. అందులో ప్రధానంగా కృష్ణా బేసిన్ పరిధికి సంబంధించి జూరాల ప్రాజెక్టులో 6.16టిఎంసీల నీరు నిలువ ఉంది. గత ఏడాది కూడా ఈ ప్రాజెక్టులో ఈ సమయానికి 8.73టిఎంల నీరు నిలువ ఉండేది. దిగువన శ్రీశైలం ప్రాజెక్టులోకి నీటి చేరికలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ప్రాజెక్టులో 885అడుగుల పూర్తి స్థాయి నీటిమట్టానికి గాను, మంగళవారం నాటికి నీటిమట్టం 833.80అడుగుకు చేరింది.

ప్రాజెక్టులో పూర్తి స్థాయి 215టిఎంసీల నీటి నిలువకు గాను, ప్రస్తుతం ఈ జలాశయంలో 53.66టిఎంసీల నీరు నిలువ వుంది.గత ఏడాది కంటే నీటినిలువలు 21టిఎంసీలు అధికంగానే ఉన్నాయి. గత ఏడాది ఫిబ్రవరి 14నాటికి ఈ ప్రాజెక్టులో నీటినిలువ 32టిఎంసీలు మాత్రమే ఉండేది. శ్రీశైలం జలాయం నుంచి విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. విద్యుత్ ఉత్పత్తికోసం 5955 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటూ పవర్‌హౌస్ ద్వారా దిగువ నదిలోకి నీటిని వదిలిపెడుతున్నారు. మరో వైపు ఎత్తిపోతల పథకాల ద్వారా కాలువలకు కూడా 4095క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇతర అవసరాలకు మరో 320క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూన్‌నుంచి ఈ నీటి సంవత్సరంలో కృష్ణానది ద్వారా ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 2021టిఎంసీల నీరు చేరుకుంది. అందులో అధిక శాతం విద్యుత్ ఉత్పత్తి అవసరాలకే వినియోగించారు. ప్రస్తుతం రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటినిలువ సామర్ధంలో 162టిఎంసీల మేరకు ఖాళీ ఉంది.

సాగర్‌లో 277టిఎంసీల నీటినిలువ:

నాగార్జున సాగర్ ప్రాజెక్టులో పూర్తి స్థాయి 312టిఎంసీల నీటినిలువకు గాను, 277టిఎంసీల మేరకు నీరు నిలువ ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి 590అడుగుల నీటిమట్టానికిగాను ప్రస్తుతం 557అడుగులకు చేరుకుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా 8790క్యూసెక్కులనీరు చేరుకుంటోంది. సాగర్ జలాశయం నుంచి 24752 క్యూసెక్కుల నీరు బయటకు విడుదల చేస్తుండగా, అందులో జలవిద్యుత్ ఉత్పత్తికోసం పవర్‌హౌస్ ద్వారా 4498క్యూసెక్కులు, ప్రధాన కాలువలకు 19901క్యూసెక్కులు , ఇతర అవసరాలకు 353క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌లో గత ఏడాది ఇదే సమయానికి 578అడుగుల నీటిమట్టం వద్ద 297టిఎంసీల నీరు నిలువ వుండేది. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి సాగర్ రిజర్వాయర్‌లో నీటినిలువ 20టిఎంసీలు తగ్గింది. సాగర్ దిగువన పులిచింతల ప్రాజెక్టులో పూర్తి స్థాయి45.77టిఎంసీల నీటినిలువకు గాను ప్రస్తుతం 42.96టిఎంసీల నీరునిలువ ఉంది. పులిచింతల ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 1072క్యూసెక్కుల నీరు చేరుతుండగా, విద్యుత్ ఉత్పత్తి అనంతరం పవర్‌హౌస్ ద్వార 2000క్యూసెక్కుల నీటిని దిగువన నదిలోకి విడుదల చేస్తున్నారు. గత ఏడాదితోపోల్చితే పులిచింతల ప్రాజెక్టులో 2టిఎంసీల నీరు అధికంగా నిలువ ఉంది.

శ్రీరాంసాగర్‌లోకి 5రెట్లు అధికంగా చేరిన నీరు

గోదావరి నదీపరివాహకంగా ఉన్న ప్రధాన ప్రాజెక్టుల్లో గత ఏడాది కంటే నీటి నిలువలు కొంత తక్కువగా ఉన్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో గరిష్టస్థాయి 90.31 టిఎంసీల నీటి నిలువకుగాను ప్రస్తుతం ఇందులో 54.39టిఎంసీల నీరు నిలువ ఉంది. ఈ ఏడాది జూన్ నుంచి ఈ నీటిసంవత్సరంలో ఎగువ నుంచి ఈ ప్రాజెక్టులోకి గరిష్ట నీటినిలువ సామర్దం కంటే 5రెట్లు అధికంగా 589.90టిఎంసీల నీరు చేరింది. ప్రస్తుతం ఎగువ నుంచి గోదావరిలో నీటిప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. ఈ ప్రాజెక్టు నుంచి 7194క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తుండగా,అందులో విద్యుత్ ఉత్పత్తి అనంతరం పవర్‌హౌస్ ద్వారా 5033క్యూసెక్కులు, ప్రధాన కాలువలకు 1678క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గత ఏడాది ఇదే సమయానికి శ్రీరాం సాగర్‌లో 63టిఎంసీల నీరు నిలువ ఉండగా ఈ సారి 9టిఎంసీలనీరు తక్కువగా ఉంది.

మంజీరా ప్రాజెక్టులు కళకళ:

మంజీరా నదిపై నిర్మించిన ప్రాజెక్టులు నీటినిలువలతో కళకళలాడుతున్నాయి. సింగూరు ప్రాజెక్టులో పూర్తి స్థాయి 29టిఎంసీల నీటినిలువకుగాను ప్రస్తుతం 23టిఎంసీల నీరు నిలువ ఉంది. ఈ ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తికోసం 350 ,కాలువలకు 240క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.నిజాంసాగర్ ప్రాజెక్టులో గరిష్టస్థాయి 17.80టిఎంసీల నీటినిలువకుగాను 10.81టిఎంసీలనీరు నిలువ ఉంది. ఈ ్రప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా 546, కాలువల ద్వారా 241క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

మిడ్ మానేరులో 27టిఎంసీల గరిష్ట నీటినిలువ సామర్దానికిగాను 20.87టిఎంసీల నీరు నిలువ ఉంది.ఈ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 4170క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 4050క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా దిగవ మానేరులో 24టిఎంసీల పూర్తి స్థాయికిగాను 13.56టిఎంసీల నీరు నిలువ ఉంది.ఎగువ నుంచి ఈ ప్రాజెక్టులోకి 3750క్యూసెక్కలు నీరు చేరుతుండగా, ప్రాజెక్టు నుంచి 4779క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కడెం పాజెక్టులో 7.60టిఎంసీల గరిష్ట స్థాయికి గాను 5.19టిఎంసీల నీరు నిలువ ఉంది. ఈ ప్రాజెక్టులోకి 208క్యూసెక్కుల ఇన్‌ప్లో కొనసాగుతుండగా, ప్రాజెక్టు నుంచి 561క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో20.18టిఎంసీల గరిష్ట నీటినిలువ సామర్దానికి గాను 18.98టిఎంసీల నీరు నిలువ ఉంది. ఎగువ నుంచి 5367క్యూసెక్కుల నీరు చేరుతుండగా ,అంతే నీటిని ప్రాజెక్టు నుంచి విడుదల చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News