న్యూఢిల్లీ : దేశంలో 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటివరకు 5425 బ్లాక్‌ఫంగస్ కేసులు వెలుగు లోకి రాగా, వీరిలో 55 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నారని, అలాగే మొత్తం బ్లాక్ ఫంగస్ బాధితుల్లో 4556 మందికి గతంలో కొవిడ్ సోకిందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ సోమవారం మంత్రుల సమావేశంలో వెల్లడించారు. వాతావరణంలో సహజంగా ఉండే మ్యూకర్ అనే ఫంగస్ వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ముఖ్యంగా కొవిడ్ సోకి , ఇతర ఆరోగ్య సమస్యలున్నవారికి, లేదా స్టెరాయిడ్లను మితిమీరి వినియోగించిన వారికి ఇది ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది. అవయవ మార్పిడి జరిగిన వారికి, ఐసియులో చికిత్స పొందిన వారికి దీని ముప్పు ఎక్కువే. గాలి పీల్చుకున్నప్పుడు ఈ ఫంగస్ వైరస్‌కు ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. కొవిడ్ రెండో దశలో ఈ కేసులు పెరుగుతుండడం ఒక సవాలుగా మారింది.
65 శాతం నమూనాల్లో బి.1.617 రకం
జీనోమ్ సీక్వెన్సింగ్ చేసిన 65 శాతం నమూనాల్లో బి.1.517 కరోనా రకాన్ని గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. 25,739 నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్‌ను పరిశీలించగా, 9508 నమూనాల్లో ఆందోళన కలిగిస్తున్న రకాలను గుర్తించడమైందని, అలాగే 65 శాతం నమూనాల్లో బి.1.617 రకం కనిపించిందని మంత్రి తెలిపారు.