Sunday, January 19, 2025

జపాన్ భూకంపంలో 55మంది మృతి

- Advertisement -
- Advertisement -

తీర ప్రాంతాలను ముంచెత్తిన రాకాసి అలలు

టోక్యో : జపాన్‌లో కొత్త సంవత్సరం నాడు సంభవించిన భారీ భూకంపం సృష్టించిన విలయం విషయాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఒక్క సోమవారమే దేశంలో తీవ్రమైన 155 భూప్రకంపనలు వచ్చినట్లు గుర్తించారు. ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేటుపై 37.6 పాయింట్ల మధ్యలో నమోదయ్యాయి. మంగళవారం కూడా ఇక్కడ ఆరు సార్లు భూమి కంపించింది. కాగా భూకంపం కారణంగా చనిపోయిన వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. మంగళవారం ఉదయం దాకా 13గా ఉన్న మృతుల సంఖ్య సాయంత్రానికి 55కి చేరుకుందని జపాన్ టైమ్స్ పత్రిక పేర్కొంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.భవనాలు కూలడం, అగ్నిప్రమాదాల కారణంగానే ఎక్కువ మంది చనిపోయారు.

ఇక నీగట, టొయోమ, పుకూయ్, గిపూ నగరాల్లో భారీ సంఖ్యలో క్షతగాత్రులను గుర్తించారు. 45 వేలకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. పలు ప్రధాన రహదారులు పని చేయలేదు. ఫలితంగా సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్న వైద్యులు, ఆర్మీ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో 7.6 తీవ్రతతో సంభవించిన పెను భూకంపం కారణంగా సునామీ హెచ్చరికలు జారీ కావడంతో పలు తీర్ర పాంత ప్రజలు భయంతో ఎత్తయిన ప్రాంతాలకు పరుగులు తీశారు. దాదాపు అయిదు మీటర్ల ఎత్తున ఎగసి పడిన అలలు తీర ప్రాంతాలను ముంచెత్తడంతో వందల పడవలు కొట్టుకు పోయాయి. కార్లు, ఇళ్లు సముద్రంలోకి కొట్టుకు పోయాయి. కాగా సోమవారం జారీ చేసిన సునామీ హెచ్చరికల తీవ్రతను తాజాగా తగ్గించారు.పర్యాటక ప్రదేశమైన వాజిమా నగరంలోని అసైచి వీధిలో భూకంపం కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రాంతం కేవలం 200 చదరపు మీటర్ల ప్రదేశంలోనే ఉండడంతో అగ్నికీలలు వేగంగా వ్యాపించాయి.మంటల ధాటికి 200 భవనాలు కాలిపోయాయి. ఈ నగరంలోనే దాదాపు 20 మరణాలు ఇప్పటివరకు నమోదయ్యాయి.

కొన్ని భవనాలు ఇప్పటికీ మంటల్లోనే ఉన్నాయి. ఇక సుజు ప్రాంతంలో 50కి పైగా భవనాలు కుప్పకూలిపోయాయని అధికారులు ధ్రువీకరించారు. సునామీ అలలు పోర్టును తాకడంతో పలు పడవలు కొట్టుకు పోయాయి. షికా ప్రాంతంలో అత్యధికంగా 7పాయింట్ల తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇక్కడ వైద్యశాల భవనం పూర్తిగా ధ్వంసమయింది. చాలా ఇళ్లు కూలిపోయాయి. జపాన్‌లో మంగళవారం కూడా భూప్రకంపనలు ఆగకపోవడం సహాయక చర్యలకు పెద్ద అడ్డంకిగా మారింది.అసలు ప్రాణనష్టం ఎంతో తెలుసుకోవడం ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులను భూకంప కేంద్రమైన మారు మూల ప్రాంతమైన నోటో ద్వీపానికి తరలించినప్పటికీ వారు అక్కడికి చేరుకోవడం పెను సమస్యగా మారింది. ఇక్కడ ఉన్న ఏకైక విమానాశ్రయం రన్‌వే భూకంపం కారణంగా బీటలు వారడంతో విమానాశ్రయాన్ని మూసివేయాల్సి వచ్చింది. దీంతో కాలంతో పోటీపడుతూ గాలింపు, సహాయక చర్యలు చేపడుతున్నామని జపాన్ ప్రధాని కిషిద స్వయంగా ప్రకటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News