Sunday, December 22, 2024

రక్తసిక్తమైన మసీదులు..

- Advertisement -
- Advertisement -

కరాచీ : పాకిస్థాన్‌లోని కల్లోలిత బలూచిస్థాన్ ప్రాంతంలోని ఓ మసీదు శుక్రవారం ఆత్మాహుతి మానవ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ పేలుడు ఘటనలో కనీసం 52 మంది మృతి చెందారు. 50 మందివరకూ గాయపడ్డారని అధికారులు తెలిపారు. ప్రవక్త మహమ్మద్ జన్మదినం సందర్భంగా నిర్వహించే మిలాద్ ఉన్ నబీ కోసం జనం గుమికూడి ఉన్న దశలో మానవ బాంబు పేలుళ్లు జరిగాయి. మస్త్తుంగ్ జిల్లాలోని అల్ ఫలాహ్ రాదారిపై వెలిసి ఉన్న మదీనా మసీదు వద్ద ముందుగా జరిగిన ఈ పేలుడుతో ప్రాంతం అంతా రక్తసిక్తం అయింది. గంటల వ్యవధి తరువాత ఖైబర్ ఫక్తూన్‌వా ప్రాంతంలోని హంగూ సిటీలో మరో మానవ బాంబు పేలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. 12 మంది గాయపడ్డారు. ఇప్పటివరకూ ఈ ఘటనలకు ఏ సంస్థ బాధ్యత వహించలేదు. కారకులు ఎవరు? అనే విషయంపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

మస్తుంగ్ డిఎస్‌పి నవాజ్ గష్కోరి కూడా మానవ బాంబు పేలుడు ఘటనలో దుర్మరణం చెందినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఇక్కడి ఊరేగింపు ఉత్సవ కార్యక్రమానికి కాపలా బాధ్యతలలో ఆయనే ఉన్నారు. మస్తంగ్‌లో మానవబాంబు డిఎస్‌పి కారు వద్దనే తనను తాను పేల్చుకుందని సిటి స్టేషన్ హౌస్ ఆఫీసరు (ఎస్‌హెచ్‌ఒ) మెహమ్మద్ జావెద్ లెహ్రీ తెలిపారు. మస్తుంగ్ జిల్లాలో ఈ మధ్యకాలంలో విస్తృతస్థాయిలో ఉగ్రవాద నిరోధక చర్యలు చేపట్టారు. ఒక్కరోజు క్రితమే ఈ విభాగం సిటిడి జరిపిన దాడిలో ఐఎస్‌ఐఎస్‌కు చెందిన కీలక దళనేత హతులయ్యారు. గాయపడ్డ వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి చికిత్సకు తరలించినట్లు అధికారులు తెలిపారు. అక్కడ అత్యయిక పరిస్థితి విధించారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడైంది. దీనితో మృతుల సంఖ్య మరింతగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం అయింది. మస్తుంగ్‌కు వెంటనే సహాయక బృందాలను తరలించినట్లు బలూచిస్థాన్ అంతర్గత సమాచార వ్యవహారాల మంత్రి జన్ అచాక్‌జాయ్ తెలిపారు.

తీవ్రంగా గాయపడ్డ వారిని వెంటనే క్వెట్టాకు మెరుగైన చికిత్సకు పంపించారని వివరించారు. కొన్ని శక్తులు కావాలనే ఈ ప్రాంతంలో మతపరమైన సామరస్యం , శాంతిని విచ్ఛిన్నం చేసేందుకు యత్నిస్తున్నాయని , ఈ పేలుడు ఘటనను సహించేది లేదని తెలిపారు. ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే పట్టుకోవాలని తాత్కాలిక ముఖ్యమంత్రి అలీ మర్దన్ డోమ్కీ అధికారులను ఆదేశించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రజలంతా సంఘటితంగా వ్యవహరించాలని పిలుపు నిచ్చారు. ఇస్లాం శాంతిసామరస్యాల మతం అని, ఇటువంటి క్రూర చర్యలకు పాల్పడే వారిని ముస్లింలుగా పిలవడం కుదరదని తెలిపారు.

దోవాబా మసీదు వద్ద ఆత్మాహుతి దాడి
నలుగురు దుర్మరణం, 12 మందికి గాయాలు
ఉద్రిక్తతల కైబర్ ఫక్తూన్‌వా ప్రాంతంలోని దోవాబాలో శుక్రవారమే ఓ మసీదులో ఓ ఆత్మాహుతి పేలుడు జరిగింది. మిలాదున్ నబీ జుమా ప్రార్థనల దశలో మానవ బాంబు తనను తాను పేల్చుకుంది. ఈ ఘటనలో కనీసం నలుగురు మృతి చెందారు. 12 మంది గాయపడ్డారు. మసీదు ధ్వంసం అయింది. ఇక్కడి పోలీసు స్టేషన్‌కు సమీపంలోనే ఈ మసీదు ఉంది. ముందుగా ఐదుగురు ఉగ్రవాదులు ఇక్కడి పోలీసుస్టేషన్‌లోకి చొరబడ్డారని, వీరిపై పోలీసులు కాల్పులు జరిపారని, ఓ ఉగ్రవాది మృతి చెందగా , ఓ ఉగ్రవాది మసీదు వద్దకు వెళ్లి తనను తాను పేల్చుకున్నాడని, మిగిలిన ఉగ్రవాదులు పారిపోయ్యారని అధికారులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News