సివిల్స్ అభ్యర్థుల్లో విశ్వాసం పెంచేందుకే
ఆర్థిక సాయం కుట్రలన్నీ ఛేదించి గ్రూప్1
పరీక్షలు నిర్వహించాం రాజీవ్‌గాంధీ
సివిల్స్ అభయహస్తం కార్యక్రమంలో
సిఎం రేవంత్ వ్యాఖ్యలు ఇంటర్వూకు
ఎంపికైన 20మందికి రూ.లక్ష చొప్పున
చెక్కులు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి
వెనుకబడిన రాష్ట్రం బీహార్ నుంచి అత్యధికంగా ఐఎఎస్‌లు వస్తున్నారు. దానికి ప్రత్యేక శ్రద్ధే కారణం. అక్కడి ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలో కూడా సివిల్స్ అభ్యర్థులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. దీనిని ఆర్థిక సాయంగా కాకుండా ప్రోత్సాహకంగా భావించండి.
సిఎం రేవంత్
మన తెలంగాణ/హైదరాబాద్ : వెనుకబడిన రాష్ట్రమైన బీహార్ నుంచి అత్యధికంగా ఐఏఎస్‌లు వస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అక్కడ ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్లే ఎక్కువ మంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు వస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాభవన్‌లో నిర్వహించిన ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సివిల్స్ మెయిన్స్ ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు ఎంపికైన 20 మంది అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించారు. ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థ సివిల్స్ అభ్యర్థులకు సాయం చేస్తున్నట్లు తెలిపారు. బిహార్‌ను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలో ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు చెప్పారు. దీన్ని ఆర్థిక సాయంగా కాకుండా ప్రోత్సాహకంగా భావించాలన్నారు. వీరంతా సివిల్స్‌లో విజయం సాధించి తెలంగాణకే రావాలని ఆకాంక్షించారు.
తెలంగాణ అధికారులు కేంద్రంలో ఉన్నా రాష్ట్రం కోసం కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మా ప్రభుత్వం వచ్చాక ఏడాదిలో 55,143 ఉద్యోగాలు ఇచ్చాం. ఇది దేశంలోనే రికార్డు. పదేళ్లలో పేరుకుపోయిన ఖాళీలను భర్తీ చేస్తూ ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తున్నాం. దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలబడింది. గతంలో ఎన్నడూ 563 గ్రూప్ 1 ఉద్యోగాలు ఇవ్వలేదు. 14 ఏళ్లుగా వీటి నియామకాలు చేపట్టలేదు. ఇన్ని ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టం లేక అడ్డుకునే కుట్ర చేశారు. గ్రూప్ 1పై కుట్రలన్నీ ఛేదించి పరీక్షలు నిర్వహించాం. ఈ విషయంలో కోర్టులు ప్రభుత్వానికి అండగా నిలిచాయి. మార్చి 31 లోపు ఈ నియామకాలు పూర్తి చేస్తామ ని రేవంత్‌రెడ్డి తెలిపారు. సివిల్స్ మెయిన్స్ అర్హులైన ప్రతీ అభ్యర్థి టాప్ ర్యాంక్ తెచ్చుకుని తెలంగాణకు పనిచేయాలని కోరకుంటున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సివిల్స్ మెయిన్స్ పరీక్షకు ఎంపికైన వారికి శుభాకాంక్షలు చెబుతూ. అభ్యర్థులు టాప్ ర్యాంకులో వచ్చి తెలంగాణకు పనిచేస్తే బాగుంటుందన్నారు.
యూపీఎస్సీలో తెలంగాణ యువత విజయం సాధించాలి : భట్టి
తెలంగాణ యువతను రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పరీక్షల్లో ప్రోత్సహించేందుకు, ఉన్నత విద్యను అందుకునేందుకు రాష్ట్ర పభుత్వం పలు ప్రోత్సాహా పథకాలు అమలు చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరై మాట్లాడారు.
యూపీఎస్సీలో మన విద్యార్థులు రాణించాలని ప్రభుత్వం వారిని ప్రోత్సహించేందుకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం అమలు చేస్తుందన్నారు. సివిల్స్ లో 40మందిలో మెయిన్స్ నుంచి ఉత్తీర్ణత సాధించి 20మంది ఇంటర్వ్యూకు ఎంపికవ్వడం అభినందనీయమన్నారు. మెయిన్స్ వాళ్లకు లక్ష ఆర్ధిక సహాయం చేయడంతో పాటు ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి మరో లక్ష సహాయం చేయాలని నిర్ణయించిందన్నారు. ఇంటర్వ్యూలకు వెళ్లే వారికి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లలో వసతి కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.