Sunday, January 19, 2025

విశ్వవ్యాప్తం మధుమేహం!

- Advertisement -
- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఒకరు మధుమేహ రుగ్మతను అనుభవిస్తున్నారని, ప్రపంచ జనాభాలో దాదాపు 550 మిలియన్ల మంది డయాబెటిస్ వలలో పడ్డట్లు తేలింది. 2030 నాటికి 643 మిలియన్ల వరకు డయాబెటిస్ వ్యక్తుల సంఖ్య చేరుతుందని అంచనా వేశారు. మధుమేహ రుగ్మత అధికంగా కలిగిన దేశాల్లో చైనా, ఇండియా, పాకిస్థాన్, అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, మెక్సికో, బంగ్లాదేశ్, జపాన్, ఈజిప్ట్‌లు ఉన్నాయి. భారత జనాభాలో 11.4 శాతం మంది అనగా 10.13 కోట్ల జనం మధుమేహ రుగ్మతతో బాధపడుతున్నారని, వీరికి తోడుగా మరో 15.3 శాతం జనాభా అనగా 13.6 కోట్ల మంది భారతీయులు డయాబెటిక్స్ సమస్యకు దగ్గరవుతున్నారనే ఆశ్చర్యకర అధ్యయనాంశాలు మనల్ని భయం గుప్పిట్లోకి నెట్టేస్తున్నాయి. దీనికి తోడుగా 28.6% జనాభా స్థూలకాయ ఉచ్చులో భారంగా బతుకులు వెళ్లదీస్తున్నట్లు తేలింది.

టైప్- 1 డయాబెటిస్ వల్ల క్లోమ గ్రంధి ఉత్పత్తి చేయడంలో విఫలమవుతుంది. ఇది 10 నుంచి 25 ఏండ్ల లోపు పిల్లల్లో/ యువకుల్లో కనిపిస్తుంది. శరీరంలో చక్కెరలను అదుపు చేసే క్లోమ గ్రంధి తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయని యెడల టైప్- 2 డయాబెటిస్ రుగ్మత వస్తుంది. ఇది 30 ఏండ్లు దాటిన వారిలో అధికంగా కనిపిస్తుంది. ప్రతి ఏట నవంబర్ నెలను మధుమేహ అవగాహన మాసం (నవంబర్ డయాబెటిస్ అవేర్‌నెస్ మాసంగా 2023)గా పాటిస్తూ డయాబెటిస్ రుగ్మత పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం, డయాబెటిస్ రుగ్మతతో ముడిపడి వున్న ఇతర వ్యాధుల పట్ల విషయ పరిజ్ఞానాన్ని కల్పించడం, మధుమేహం రాకుండా జాగ్రత్తలతో పాటు జీవనశైలి మార్పులను తెలియజేయడం లాంటి అంశాలను ప్రజలందరికీ చేర్చడం ఈ మాసంలో జరుగుతున్నది. డయాబెటిస్ మాసాన్ని బ్లూ సర్కిల్‌ను ఉపయోగించి సూచిస్తారు.

ఆహార అలవాట్లతో ప్రతికూల మార్పులు
అప్పుడే పుట్టిన బిడ్డ బాటిల్ ఫీడింగ్ నుంచి నూరేళ్ల పండుటాకుల నోట్లో నానే చిప్స్ / శీతల పానీయాల వరకు అందరూ బ్రెవరేజ్స్ / ప్రాసెస్డ్/ ప్యాకెట్/ జంక్ ఫుడ్స్ వాడడం ఫ్యాషనై పోయింది. నేటి వాణిజ్య మాల్స్‌లో దొరికే ప్రాసెస్డ్ ఫుడ్ ప్యాకెట్లను కొనుగోలు చేయడానికి క్యూలు కడుతున్నారు. ఎంఎన్‌సి మాల్స్‌లో ప్రాసెస్డ్ ఫుడ్ ప్యాకెట్లను ‘బై వన్ గెట్ వన్ ఫ్రీ’ లాంటి ఆకర్షణీయ ప్రకటనలతో వినియోగదారులను బుట్టలో వేసుకుంటూ విషతుల్య ఆహార పదార్థాలను బాహాటంగానే అమ్ముతున్నారు, కొనే వెర్రిజనం కొంటూనే వున్నారు. ఇదే సరళి ఇంకా కొనసాగితే జీవనశైలి రుగ్మతల ఉప్పెనలో అధిక శాతం జనులు కొట్టుకుపోవలసిందే అని నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం విశ్వవ్యాప్తంగా మానవాళి, ముఖ్యంగా నేటి ఆధునిక యువత మితిమీరిన ప్రాసెస్డ్ ఆహారాలు (అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్), శీతల పానీయాలకు బానిసలుగా మారడంతో సాంప్రదాయ పోషకాహారానికి దూరం జరుగుతూ తమ అనారోగ్యాలను తామే ఆహ్వానిస్తున్నారు. డిజిటల్ నరుడు కార్బోనేటెడ్ డ్రింక్స్, చిప్స్, కృత్రిమ పండ్ల రసాలు, నూడుల్స్, కుక్కీస్, పిజ్జాలు, బర్గర్లు, ప్రాసెస్డ్ మీట్/ చికెన్, శిశువుల శక్తి పొడులు, ఐస్‌క్రీమ్స్, బేకరీ ఉత్పత్తులు, ఎనర్జీ బార్స్, చాకొలేట్స్, జంక్ ఫుడ్స్, ఇన్‌స్టంట్ ఫ్రైడ్ ఫుడ్స్ లాంటి రుచుల వెంట పరుగు తీస్తూ బిపి, షుగర్, అధిక శరీర బరువులాంటి జీవనశైలి రుగ్మతల వలలోపడుతూ రేపటి ఆరోగ్యానికి తూట్లు పొడుస్తున్నారు. అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాల్లో అధిక లవణం, చక్కర, కొవ్వులు ఉండడంతో మధుమేహ రుగ్మతలను కొనితెచ్చుకుంటున్నారు.

నేటి కుటుంబాల పెద్దలు 10 శాతం ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు అలవాటుపడితే వారిలో టైప్-2 మధుమేహం వచ్చే అవకాశాలు 15 శాతం పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్స్ తయారీలో ఆకర్షణ, నిలువ ఉండడానికి పలు రకాల అనారోగ్యాలకు కారణమయ్యే కాస్మటిక్ అడిటివ్స్, రంగులు, సువాసన ఇచ్చే పదార్థాలు కలపడంతో శారీరక బరువు పెరగడం, డయాబెటిస్ లాంటి దీర్ఘకాలిక రుగ్మతలు, తీవ్రమైన హృద్రోగ సమస్యలకు, ఏకంగా గుండె పోటు/స్ట్రోక్‌లతో అకాల మరణాలకు దారి తీస్తాయి.
మితిమీరిన చక్కెరలతో తయారైన శీతలపానీయాల విచక్షణారహిత వినియోగంతో 2వ రకం మధుమేహ రుగ్మత బారిన పడడం వాస్తవంగా జరుగుతోంది. ఇలాంటి డిజిటల్ యుగపు జీవనశైలి రుగ్మతలతో మరో మధుమేహ టైం బాంబు తీవ్ర రూపం దాల్చుతున్నది. ఫుడ్ ఇండస్ట్రీ యాజమాన్యాలు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్‌ను తుంగలో తొక్కి ‘ఈట్ రైట్ అండ్ హెల్దీ ఫుడ్’ నినాదాన్ని మరిచి ‘ఈట్ ఫర్ స్టైల్ అండ్ టేస్టు’ నినాదాలను హోరెత్తించడంతో యువతతో పాటు పెద్దలు, పిల్లలు సహితం ప్రాసెస్డ్ ఫుడ్ ప్యాకెట్ల దురలవాటుకు లోనవుతున్నారు. ఇంట్లో అమ్మ చేతి పోషకాహారం తీసుకోవడం, శారీరక వ్యాయామం చేయడం, ప్రాసెస్డ్/డీప్ ఫ్రైడ్ ఆహార పొట్లాలకు దూరంగా ఉండడం లాంటి దిన చర్యలను అలవర్చుకోవాలి.

మధుమేహ లక్షణాలు, దుష్ప్రభావాలు
అధిక దాహం, అధిక మూత్రం, అకారణంగా బరువు తగ్గడం, మూత్రంలో కాటోన్స్ చేరడం, చికాకు పెరగడం, అలసట, నీరసం, కంటి చూపు మందగించడం, పుండ్లు త్వరగా మానకపోవడం, స్పర్శ తగ్గడం, చెమట పట్టడం లాంటివి మధుమేహ రుగ్మత లక్షణాలుగా పేర్కొంటారు. మధుమేహ రుగ్మతల బాధితుల్లో కంటి జబ్బులు, గాయాలు మానకపోవడం, హార్ట్ అటాక్, స్ట్రోక్, మూత్రపిండ సమస్యలు, నాడీమండల సమస్యలు, నోటి చిగుర్ల అనారోగ్యాలు, పుండ్లు మానకపోవడంతో అవయవాల తొలగింపు, క్యాన్సర్, మానసిక జబ్బులు లాంటివి వెంటాడుతాయి.

మధుమేహాన్ని నియంత్రించని యెడల ప్రాణాంతకంగా కూడా మారడం చూస్తున్నాం. ప్రాసెస్డ్ ఫుడ్ ఇండస్ట్రీలను నియంత్రించే పటిష్ట ప్రభుత్వ వ్యవస్థలను తీసుకురావడం సత్వరమే జరగాలి.ఆరోగ్యకర ఆహారం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రాసెస్డ్ ఫుడ్ ప్యాకెట్లపై వినియోగదారులకు అర్థమయ్యేలా తగు హెచ్చరికలు ముద్రించడం, అనారోగ్యకర కృత్రిమ ఆహార పదార్థాలను తయారు చేసే పరిశ్రమలను కట్టడి చేయడం లాంటి చర్యలు తీసుకోవడం తప్పనిసరి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News