మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారిక నివేదిక ప్రకారం మహారాష్ట్ర లోని అమరావతి పరిపాలనా విభాగం పరిధిలో ఉన్న ఐదు జిల్లాల్లో ఈ ఏడాది ఇప్పటివరకు 500 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. డివిజన్ లోని అమరావతి, అకోలా, బుల్దానా, వాసిమ్ , యవత్కాల్ జిల్లాల్లో ఈ ఏడాది జనవరి జూన్ మధ్య కాలంలో ఏకంగా 557 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో అత్యధికంగా అమరావతి జిల్లాలో 170 మంది, యవత్మాల్‌లో 150 మంది, బుల్దానాలో 111 మంది, అకోలాలో 92, వాసిమ్‌లో 34 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
ఆత్మహత్యలకు సంబంధించి 53 కేసుల్లో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం సహాయం అందించింది. సుమారు 284 కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు నివేదిక పేర్కొంది.పంటనష్టం, తగిన వర్షపాతం లేకపోవడం, అప్పుల భారం, సకాలంలో వ్యవసాయ రుణాలు లేకపోవటం వంటి ప్రధాన కారణాలు రైతులను ఆత్మహత్య దిశగా నడిపిస్తున్నాయని అమరావతి ఎంపీ కాంగ్రెస్ నాయకుడు బల్వంత్ వాంఖడే పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని రైతుల ఆత్మహత్యలకు అడ్డుకట్టవేయాలన్నారు.