జమ్ముకశ్మీర్‌లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నారని, వారిలో అత్యధికంగా లష్కరే తొయ్యిబా ముఠా సభ్యులున్నారని భద్రతా సంస్థలు వెల్లడించాయి. భద్రతా దళాలు నిర్వహిస్తున్న రికార్డుల ఆదారంగా ఈ విషయం వెల్లడవుతోంది. వారిలో 18 మంది జైషే మహమ్మద్ , 25 మంది లష్కరే ముఠాలకు చెందిన వారని వాటిని బట్టి తెలుస్తోంది. ముగ్గురికి హిజ్బుల్ ముజాహిద్దీన్‌తో సంబంధం ఉందని, వారు కూడా పాకిస్థాన్‌కు చెందిన వారని, భద్రతా సంస్థలకు చెందిన అధికారి ఒకరు వెల్లడించారు. ఇక 17 మంది స్థానిక ఉగ్రవాదులు ఉన్నారు. విదేశీ ఉగ్రవాదులతో పోల్చుకుంటే ఆ సంఖ్య తక్కువగా ఉంది. ఈ విదేశీ ఉగ్రవాదుల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు.
పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తొయిబా అనుబంధ విభాగం ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి తెగబడినట్టు ప్రకటించుకుంది. సైనికుల దుస్తుల్లో వచ్చిన ఉగ్రమూకలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలుస్తోంది. కాల్పుల తరువాత సమీప అడవుల్లోకి పారిపోవడంతో భద్రతా సిబ్బంది గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌ఐఏ రంగం లోకి దిగి దర్యాప్తు చేపట్టింది. మరోవైపు ఉగ్రదాడి దృష్టా ఢిల్లీ లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉండగా, పహల్గాం దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదుల ఊహా చిత్రాలను దర్యాప్తు బృందాలు విడుదల చేశాయి. వీరిని ఆసిఫ్ ఫౌజి, సులేమాన్ షా, అబు తాలాగా గుర్తించారు.