Friday, December 20, 2024

ఐదో దశలో 57.38% పోలింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలోని 49 లోక్‌సభ నియోజకవర్గాలలో సోమవారం జరిగిన ఎన్నికలలో 57 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని చోట్ల చెదరుమదురు సంఘటనలు జరుగగా, బెంగాల్‌తోపాటు పొరుగున ఉన్న ఒడిశాలోని కొన్ని పోలింగ్ కేంద్రాలలో ఇవిఎంలు మొరాయించాయి. మహారాష్ట్రలో అత్యల్సంగా 48.88 శాతం ఓటింగ్ నమోదు కాగా పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 73 శాతం ఓటింగ్ నమోదైంది. బీహార్‌లో 52.55 శాతం, జమ్మూ కశ్మీరులో 54.21 శాతం, జార్ఖండ్‌లో 63 శాతం, ఓడిశాలో 60.72 శాతం, ఉత్తర్ ప్రదేశ్‌లో 57.43 శాతం, లడఖ్‌లో 67.15 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్ర 7 గంటల వరకు లభించిన వివరాల ప్రకారం 57.38 శాతం పోలింగ్ జరిగినట్లు అంచనా వేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. గడచిన నాలుగు దశాబ్దాలలో అత్యధికంగా మొట్టమొదటిసారి జమ్మూ కశ్మీరులోని బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గంలో 54 శాతానికి పైగా ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. చివరిసారి 1984లో 58.84 శాతం ఓటింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్‌లోని ఏడు పార్లమెంటరీ నియోజకవర్గాలలో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. బార్‌పోర్, బొంగావ్, ఆరంబాగ్ స్థానాల పరిధిలోని వివిధ ప్రాంతాలలో టిఎంసి, బిజెపి కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి.

ఇవిఎంలు పనిచేయకపోవడం, పోలింగ్ కేంద్రాలలోకి ఏజెంట్లు రాకుండా అడ్డుకోవడం వంటి ఆరోపణలతో వివిధ రాజకీయ పార్టీల నుంచి 1.036 ఫిర్యాదులు అందాయని ఎన్నికల కమిషన్ తెలిపింది. హుగ్లీ నియోజకవర్గంలో టిఎంసి ఎమ్మెల్యే షిమా పాత్ర నాయక్తవంలో టిఎంసి కార్యకర్తల నుంచి బిజెపి సిట్టింగ్ ఎంపి, పార్టీ అభ్యర్థి లాకెట్ చటర్జీ నిరసలు ఎదుర్కొన్నారు. రెండు వర్గాల మధ్య ఘర్షణను నివారించడానికి భారీ సంఖ్యలో కేంద్ర బలగాలు అక్కడకు చేరుకున్నాయి. హౌరా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలలో కూడా హింసాత్మక ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. బొగావ్ నియోజకవర్గంలోని గయేష్‌పూర్ ప్రాంతంలో స్థానిక బిజెపి నాయకుడు సుబీర్ బిశ్వాస్‌ను టిఎంసి కార్యకర్తలు పోలింగ్ కేంద్రంలో చితకబాదారు. గాయపడిన బిశ్వాస్‌ను ఆసుపత్రికి తరలించారు. హుగ్లీలోని కొన్ని పోలింగ్ కేంద్రాలలో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్న బిజెపి కార్యకర్తలకు కేంద్ర బలగాలు సహకరిస్తున్నాయని ఆరోపిస్తూ టిఎంసి కార్యకర్తలు కొన్ని ప్రాం తాలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని రాబీ బ్లాక్ పరిధిలోని ఖరా గ్రామంలో ఇవిఎం పనిచేయలేదని, మూడు పోలింగ్ కేంద్రాలలో ప్రజలు ఓటు వేయకుండా బిజెపి కార్యకర్తలు అడ్గుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. రాయబరేలిలోని సరేనికి చెందిన రసూల్‌పూర్‌లో ని ఐవ నంబర్ బూత్‌ను ఉదయం 8 గంటల నుంచి మూసివేశారని,

ఓట ర్లు తిరుగుముఖం పడుతున్నారని యుపి పిసిసి ఎక్స్ వేదికగా తెలిపింది. 400కి పైగా సీట్లు సాధించడమంటే ఇదేనని పేర్కొంటూ బిజెపిపై విమర్శలు గుప్పించింది. మంకాపూర్ ప్రాంతంలోని 180, 181 పోలింగ్ బూ త్‌లలో ఓటింగ్ సక్రమంగా జరగడం లేదని సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి ఇసి కి ఫిర్యాదు చేశారు. కౌశంబి పరిధిలోని హిసంపూర్ మధో గ్రామంలో గ్రా మస్తులు ఓటింగ్‌ను బహిష్కరించినట్లు వార్తలు అందాయి. మహారాష్ట్రలోని అనేక పోలింగ్ కేంద్రాల వెలుపల ఓటర్లకు సౌకర్యాలు కల్పించడంలో అనేక ఫిర్యాదులు వస్తున్నాయని శివసేన(యుబిటి) నాయకుడు ఆదిత్య థాక్రే తెలిపారు. ముంబైలోని భండూప్ వద్ద పోలింగ్ కేంద్రాలలో శివసేన (యుబిటి) నాయకులు సంజయ్ రౌత్, సునీల్ రౌత్ అక్రమాలకు పాల్పడుతున్నట్లు బిజెపి నాయకుడు కిరీట్ సోమయ్య ఆరోపించారు. ఒడిశాలోని కొన్ని చోట్ల ఇవిఎంలు మొరాయించినట్లు ఫిర్యాదులు అందాయి. కాగా. ఇప్పటివరకు జరిగిన ఐదు దశల ఎన్నికలలో 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 379 సీట్లకు పోలింగ్ పూర్తయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News