Thursday, January 23, 2025

చిన్న కాళేశ్వరం ఎత్తిపోతలకు రూ.571కోట్లు

- Advertisement -
- Advertisement -

మంథని శాసనసభ నియోగవర్గం పరిధిలోని 63 గ్రామాలను సస్యశ్యామలం చేయగల చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మిగిలిపోయిన పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2007లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనులు ఇప్పటిదాకా 75 శాతం పూర్తయ్యాయి. ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చొరవతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎత్తపోతల పథకాన్ని తక్షణం పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుల జాబితాలో చేర్చింది. శనివారం ఎర్రమంజిల్ కాలనీలోని జలసౌథలో నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో ఉన్నతాధికారులతో సమీక్ష జరిగింది. చిన్న కాళేశ్వరం (ముక్తేశ్వర్) ఎత్తిపోతల పథకం పనులకు రూ.571.57 కోట్లు పరిపాలనా అనుమతి లభించినట్టు సమీక్ష అనంతరం మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. మొత్తం 45 వేల ఎకరాలకు సాగునీరు, అర టీఎంసీ నీటిని మంచి నీటి సరఫరా కోసం వినియోగించనున్నట్టు ఆయన తెలిపారు.

గోదావరి నుంచి అప్రోచ్ కెనాల్ ద్వారా నీటిని తరలించి కన్నెపల్లి వద్ద ఒకటో పంప్ హౌజ్ ద్వారా 4.2 టిఎంసీల నీరు దిగువన రెండో పంప్ హౌజ్ కు నీరు సరఫరా అవుతుంది. మొదటి పంపు హౌజ్ సెకనుకు 600 క్యూబిక్ ఫీట్ల నీటిని ఎత్తిపోస్తుంది. అక్కడి నుంచి మందిరం చెరువు, ఎర్ర చెరువుకు నీటి సరఫరా జరుగుంది. మిగిలిన నీరు రెండో పంపు హౌజ్ కు చేరుతుంది. కాటారంలో ఏర్పాటు చేసే రెండో పంపు హౌజ్ ద్వారా గారెపల్లి, పోలారం, తాండ్ర, యెల్లాపూర్, కొత్తపల్లి, రుద్రారం, ధన్వాడ, ఆదివారం పేట, గుమ్మలపల్లి, వీరాపూర్, గూడూర్ చెరువులకు గోదావరి జలాలు చేరతాయి. ఈ పథకంలో భాగంగా ఎర్ర చెరువు సామర్థ్యాన్ని పెంచుతారు. వరదకు తెగిపోయిన రుద్రారం చెరువు గండిని పూడ్చి బలోపేతం చేసే పనులు కూడా పూర్తి కావచ్చాయి. రానున్న రెండేళ్లలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి చెరువుల ద్వారా సాగునీరు అందించాలని నీటి పారుదల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

శ్రీరాంసాగర్ నీటితో 28 వేల ఎకరాల ఆయకట్టు : ప్రస్తుతం మంథని నియోజకవర్గంలో శ్రీరాంసాగర్ జలాలతో 28,800 ఎకరాలకు సాగునీరు అందుతోంది. డి-83 డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ద్వారా గుండారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లోకి గోదావరి జలాలు చేరుకుంటాయి. అక్కడి నుంచి 24 మైనర్ కాల్వల ద్వారా మొత్తం 28.800 ఎకరాలకు సాగునీరు అందేది. కాలక్రమేణా మైనర్లలో పూడిక చేరడం లాంటి పలుకారణాల వల్ల నిర్దేశిత ఆయకట్టుకు నీరు అందడం లేదు. గుండారం చెరువు నుంచి మైనర్ల చివరి వరకు మరమ్మతులు జరిపి నీటి సామర్థ్యాన్ని పెంచాలని మంత్రి శ్రీధర్ బాబు శ్రీరాంసాగర్ ఇంజనీర్లను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News