58 మంది విద్యార్థినుల సస్పెన్షన్
బెంగళూరు: హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల తర్వాత కూడా కర్నాటకలో హిజాబ్ వివాదం వేడి తగ్గుముఖం పట్టడం లేదు. హిజాబ్‌తో తరగతులకు అనుమతించాలని విద్యార్థినులు పట్టుబడుతుండడం, కాలేజి యాజమాన్యాలు, పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినా సానుకూల ఫలితాలు రాకపోవడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. శనివారం నాడు హిజాబ్ వివాదంపై వెనక్కి తగ్గని 58 మంది విద్యార్థినులను శివమొగ్గ జిల్లా షిరలకొప్పలోని ప్రభుత్వ ప్రీ యూనివర్సిటీ కాలేజి యాజమాన్యం సస్పెండ్ చేసింది. విద్యార్థినులకు తాము ఎంతగా నచ్చజెప్పినప్పటికీ తమ డిమాండ్‌పై పట్టు వీడక పోవడంతో వారిని కళాశాలనుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేయాల్సి వచ్చిందని కళాశాల ప్రిన్సిపాల్ చెప్పారు. కాలేజి అధికారులతో విద్యార్థినులు వాగ్వాదానికి దిగడంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని అక్కడినుంచి చెదరగొట్టారు.
మరోవైపు హిజాబ్ ధరించిన విద్యార్థినులు తమను తరగతులకు అనుమతించాలని డిమాండ్ చేయడంతో బెళగావి, యాద్‌గిర్,బళ్లారి, చిత్రదుర్గ, షిమోగా జిల్లాల్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. బెళగావిలోని విజయ్ పారామెడికల్ కాలేజి యాజమాన్యం నిరవధిక సెలవు ప్రకటించగా, హరిహరలోని ఎస్‌జెవిపి కాలేజి విద్యార్థినులు తరగతులను బహిష్కరించారు. బళ్లారి సరళాదేవి కాలేజిలో హిజాబ్ ధరించిన విద్యార్థినులను అనుమతించకపోవడంతో వారంతా ప్లేగ్రౌండ్‌లో సమావేశమయ్యారు. పోలీసులతో మాట్లాడేందుకు వారంతా నిరాకరించడమే కాకుండా తమను డిస్ట్రబ్ చేయవద్దని పోలీసులను కోరారు. కొడగులో విద్యార్థినులు ప్లకార్డులు ధరించి కాలేజి గేటు ముందు నిరసన ప్రదర్శన జరిపారు. కాగా, తాజా పరిణామాలపై కర్నాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర మాట్లాడుతూ హిజాబ్ వివాదం అన్ని కాలేజిల్లో లేదని, చాలా కొద్ది కాలేజిల్లోనే ఆందోళనలు జరుగుతుండగా వారిని హెచ్చరించామని తెలిపారు. కాలేజిల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని తెలిపారు.నిబంధనలు అతిక్రమిస్తే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తామన్నారు.ఈ వివాదం వెనుక మతతత్వ శక్తులు ఉన్నాయని, వారిపై కేసులు పెడతామనిహెచ్చరించారు.