కట్రో: ఇటలీ పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఇవాళ మరో 19 మంది మృతదేహాలు లభ్యం కావడంతో మొత్తం మృతుల సంఖ్య 59కి చేరుకుంది. ఆదివారం ఉందయం దక్షిణ కలాబ్రియా రీజియన్‌లో భారీ బండరాయిని ఢీకొట్టి పడవ మునిగిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో మొత్తం 200 మంది ఉన్నారు. వారిలో 59 మంది మరణించగా, 81 మంది ప్రాణాలతో బయటపడ్డారు.
రెస్క్యూ టీమ్స్ కాపాడిన 81 మందిలో 20 మందికి గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా మరణించిన 59 మంది 12 మంది చిన్నారులు ఉన్నారు. ప్రమాద సమయంలో పడవలో సామర్థ్యానికి మించి జనం ఉండటం.. సముద్రంలో బలమైన ఈదురు గాలులు వీయడం ప్రమాదానికి కారణమైందని ఇటాలియన్ కోస్ట్‌గార్డ్స్ తెలిపారు.
ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్ దేశాలకు చెందిన వలసదారులు యూరప్‌కు వెళ్తుండగా పడవ ప్రమాదం జరిగింది. ఆఫ్రికా దేశాల నుంచి ప్రమాదకర పరిస్థితుల్లో యూరప్ దేశాలకు వెళ్తూ వలసదారులు మృతిచెందిన ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. 2022లో సముద్ర మార్గంలో ఇటలీకి వచ్చిన వలసదారుల సంఖ్య 14,000 కాగా, అంతకుముందు ఏడాది ఆ సంఖ్య కేవలం 5,200 మాత్రమే ఉండెనని అధికారులు చెబుతున్నారు.