Wednesday, November 6, 2024

యువతులను వేధిస్తున్న పోకిరీల అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః మహిళలు, యువతులను వివిధ ప్రాంతాల్లో వేధింపులకు గురిచేస్తున్న పోకిరీలను రాచకొండ పోలీస్ కమిషనరేట్ షీటీమ్స్ అరెస్టు చేసింది. 59మందిని అరెస్టు చేసిన పోలీసులు వారికి తల్లిదండ్రుల సమక్షంలో ఎల్‌బి నగర్‌లోని సిపి క్యాంప్ ఆఫీస్‌లో శుక్రవారం కౌన్సెలింగ్ ఇచ్చారు. కమిషనరేట్ పరిధిలో ఉమెన్ సేఫ్టీవింగ్, షీటీమ్స్ ఆధ్వర్యంలో వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తు చేసి అదుపులోకి తీసుకున్నారు. 13-.05.-2023 వ తేదీ నుంచి 30.-06.-2023 వరకు బాధితుల నుంచి 197 ఫిర్యాదులు వచ్చాయని పోలీసులు తెలిపారు. ఫిర్యాదుల పై విచారణ చేపట్టి దర్యాప్తు పూర్తి చేశామన్నారు.

ఫిర్యాదుల్లో ఫోన్ల ద్వారా -30, వాట్సాప్ కాల్స్ & మెసేజ్‌ల ద్వారా -40, సోషల్ మీడియా ద్వారా 20, ఇతర వాటి ద్వారా -28వచ్చాయని తెలిపారు. వీటిలో 44మందిపై క్రిమినల్ కేసులు, 29మందిపై పెట్టీ కేసులు పెట్టి, 45మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు. షీ టీమ్స్ వారు స్కూళ్ళు, కాలేజీలు, హాస్టళ్ళు, రద్దీ ప్రదేశాలలో డెకాయ్ ఆపరేషన్ చేసి మహిళలను, యువతులను వేధిస్తున్న 106 మంది ఆకతాయిలను గుర్తించారు. షీటీమ్స్ 150 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 13,000 అవగాహన కల్పించారు. కార్యక్రమంలో విమెన్ సేఫ్టీ వింగ్ టి. ఉషా రాణి , షీటీమ్స్ ఎసిపి నరేందర్ గౌడ్, షీటీమ్స్ సిబ్బంది పాల్గొన్నారు.

బాలికతో అసభ్య ప్రవర్తన…
మైనర్ బాలికతో స్విగ్గీ బాయ్ అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన ఉప్పల్ ప్రాంతంలో అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకుంది. బాలిక పొరుగున ఉన్న వారు స్విగ్గీలో ఆర్డర్ చేశారు. ఆర్డర్ ఇచ్చేందుకు డెలివరీ బాయ్ రాగా అదే సమయంలో బాలిక(5) లిఫ్ట్‌లో ఉంది. బాలిక లిఫ్ట్‌లో ఒంటరిగా ఉండడంతో డెలివరీ బాయ్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధిత బాలిక తన తల్లిదండ్రులకు సమాచారం అందించింది. వారు షీటీమ్స్‌కు ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

జాబ్ పేరుతో మోసం
ఉద్యోగం ఇస్తానని చెప్పి ఓ యువతికి చెందిన సర్టిఫికేట్లు తీసుకుని మోసం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. యువతి దిల్‌సుక్‌నగర్‌లో ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో తనకు పరిచయమైన యువకుడు ఉద్యోగం ఇస్తానని చెప్పడంతో తన సర్టిఫికేట్లు మొత్తం ఇచ్చింది. సర్టిఫికేట్లు తీసుకుని ఉద్యోగం ఇవ్వకుండా ఫోన్‌లో వేధించడం ప్రారంభించాడు. తను అడిగినన్ని డబ్బులు ఇవ్వాలని లేకపోతే , ఆమె ఫోటోలను న్యూడ్‌గా మార్చి సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించాడు. దీంతో యువతి వాట్సాప్ ద్వారా షీటీమ్స్‌ను సంప్రదించింది. వెంటనే స్పందించిన టీమ్ నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

డెకాయ్ ఆపరేషన్…
షీటీమ్ మల్కాజిగిరి ఆనంద్ బాగ్ ఎక్స్ రోడ్డు వద్ద డెకాయ్ ఆపరేషన్ నిర్వహించింది. రోడ్డు పై వెళ్తున్న మహిళలు, కాలేజీ విద్యార్థినులను వేధిస్తున్న ఐదు మంది పోకిరీలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు.

మహిళలు, యువతులు భౌతిక పరమైన దాడులు, లైంగిక వేదింపులు, ప్రయాణ సమయాల్లో వేధింపులు ఎదురైతే రాచకొండ పోలీసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారని పోలీసులు తెలిపారు. మహిళలు వేదింపులకు గురి అయినప్పుడు వెంటనే షీటీమ్స్‌ను, వాట్సాప్ నంబర్ 8712662111 ఆయా ప్రాంతాలకు చెందిన నంబర్లలో ఫిర్యాదు చేయాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News