న్యూఢిల్లీ: 1,50,173 కోట్ల రూపాయల విలువైన స్పెక్ట్రమ్‌లు అమ్ముడవడంతో భారతదేశపు అతిపెద్ద ఎయిర్‌వేవ్ వేలం ఆగస్టు 1న ముగిసింది. ఏడు రోజుల పాటు సాగిన వేలం ఈ రోజు మధ్యాహ్నంతో ముగిసినట్లు అభిజ్ఞ వర్గాలు తెలిపాయి. విక్రయాల ద్వారా వచ్చిన తాత్కాలిక సొమ్ము(ప్రావిజినల్ సేల్ అమౌంట్) రూ. 1,50,173 కోట్లు కాగా తుది లెక్కింపు ఇంకా జరుగుతోందని వారు తెలిపారు. భారతదేశంలో 5జి సేవలకు మద్దతిచ్చే స్పెక్ట్రమ్ వేలం జూలై 26న ప్రారంభమైంది, తొమ్మిది బ్యాండ్‌ల క్రింద సుమారు 72,000 MHz 20 సంవత్సరాల చెల్లుబాటు వ్యవధితో విక్రయించబడుతోంది.
ఈ రోజు నాలుగు రౌండ్ల వేలం పూర్తయిందని, దరఖాస్తుదారుల నుండి “బలమైన బిడ్లు” వచ్చాయని మంత్రి వైష్ణవ్ పేర్కొన్నారు. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మరియు అదానీ డేటా అనే నలుగురు బిడ్డర్లు పోటీలో ఉన్నారు. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో బిడ్‌లలో అత్యంత దూకుడు ప్రదర్శించగా, సునీల్ భారతి మిట్టల్ నేతృత్వంలోని భారతీ ఎయిర్‌టెల్ తర్వాతి స్థానంలో ఉంది.