అన్ని జిల్లా కేంద్రాల్లో పరుగు ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్లు
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఓటు హక్కు ఆవశ్యకతపై రాష్ట్రవ్యాప్తంగా.. అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం వివిధ జిల్లాల్లో కలెక్టర్లు జెండా ఊపి పరుగు ప్రారంభించారు. ప్రజలకు ఓటు హక్కు ప్రాధాన్యం తెలిపేందుకే.. ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ 31వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ముందస్తుగా ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా కచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకుంటామని.. యువతతో ప్రతిజ్ఞ చేయించారు. ఓటు హక్కు వినియోగంపై జిల్లాల కేంద్రాల్లో ’5కె, 3కె రన్’ ఉత్సాహంగా సాగింది. జిల్లా కలెక్టరేట్ వరకు సాగిన ఈ పరుగులో విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు. పరుగు పందెం విజేతలకు బహుమతులను అందించారు. అదే విధంగా వివిధ కూడళ్లలో ఓటు ఆవశ్యకతపై విద్యార్థులు ప్లకార్డులు చేతబూని ర్యాలీ తీశారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు ఓటు హక్కు వినియోగం, ఆవశ్యకత, ఓటు నమోదు కార్యక్రమం పై ప్రజలకు వివరించారు.