Wednesday, January 22, 2025

సర్వేపై ఆందోళన వద్దు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హుస్నాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలనలో భాగంగా సిఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అ వసరం లేదని రవాణా, బిసి సంక్షేమ శాఖ మం త్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు. సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్‌లో ఎన్యూమరేటర్లతో కలిసి ఆదివారం నిర్వహించిన సర్వేలో
పాల్గొని వివరాలు సేకరించి నమోదు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ..కుటుంబ సమగ్ర సర్వేపై అనుమానాలు అవసరం లేదని.. సమాచారం గోప్యంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం దేశంలోనే చారిత్రాత్మక ఘట్టంగా చరిత్రలో నిలిచిపోతుందని.. దేశానికే తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ గా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ప్రజలంతా ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా ఎన్యూమరేటర్లకు స్వచ్ఛందంగా సమాచారాన్ని అందివ్వాలని కోరారు. సర్వేలో భాగంగా శనివారం రాష్ట్ర గవర్నర్ కూడా తమ కుటుంబ వివరాలు నమోదు చేసుకున్నారని గుర్తుచేశారు.

సుమారు 85 వేల మంది సిబ్బందితో 150 ఇండ్లకు ఒక ఎన్యూమరేటర్ ద్వారా సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. కుల బలం తెలిస్తే అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక చేయడానికి ప్రభుత్వానికి దోహదపడుతుందని.. ఎవరికెంత. వారికంత ఆలోచనతో తేడాలు సరిచేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కుల సంఘాల నాయకులు సమాచార సేకరణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మనిషికి ఏదైనా ఇబ్బంది వస్తే బాడీ ఎక్స్‌రే చేసిన మాదిరిగా కులగణన సర్వే ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత తమ ప్రభుత్వానిదని అన్నారు. జీవో నెంబర్ 18 ద్వారా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో భాగంగా సర్వే చేయడానికి ఇంటింటికీ వస్తున్నారని, ప్రజలు వారికి పూర్తి సమాచారం ఇవ్వాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, అధికారులు చారిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వామ్యమై ప్రజలు వివరాలు అందించేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ కమిటీ ఛైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో ఛైర్మన్ బొలిశెట్టి శివయ్య, ఆర్‌డిఒ రామ్మూర్తి, తహసిల్దార్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఐదవ రోజు కొనసాగిన ఇంటింటి కులగణన సర్వే
సమగ్ర ఇంటింటి సర్వే, కులగణనకు సంబంధింది ఐదో రోజు అదివారం కూడా అధికారులు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు ప్రాంతాల్లో ఇప్పటికీ కుటుంబ గుర్తింపు, స్టిక్కర్ వేసే కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. సమగ్ర కుటుంబ సర్వేకు అనేక ప్రాంతాలలో ప్రజల నుండి అభ్యంతరాలు వ్యక్తం కావడం, సర్వే సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన సంఘటనలు అనేకం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రజల సందేహాలు, భయాలను తొలగిస్తూ మంత్రలు, ప్రజా ప్రతినిధులు ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినప్పటికీ పలు ప్రాంతాల్లో ప్రజల నుండి సమస్యలు ఎదురవుతున్నట్లు సిబ్బంది వాపోతున్నారు. సమాచార సేకరణకు సంబంధించిన ప్రశ్నావళిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న తరుణంలో ప్రజలకు తాము ఇవ్వదలుచుకున్న సమాచారాన్ని ఇవ్వొచ్చని మంత్రులు వారి భయాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు స్వయంగా కుటుంబ సర్వే లో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News