Friday, November 22, 2024

నేటి నుంచి పల్లె, పట్టణ ప్రగతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: దశాబ్ధాల తరబడి ఎదుగుబొదుగూ లేకుండా పడివున్న గ్రామలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలని చెప్పిన జాతిపిత గాంధీజి కలలను నిజం చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ పల్లెప్రగతి పేరుతో రూపొందించిన వినూత్న ప్రథకం అభివృద్ధిని పరుగులు తీయిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా రూపుదిద్దుకోవాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర గ్రామీణ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది. తెలంగాణ పల్లెల్లో పచ్చదనం-పరిశుభ్రత వెల్లివిరియాలని, ప్రణాళికాబద్ధంగా గ్రామాల అభివృద్ధిని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామీణ ముఖచిత్రాన్ని మార్చడానికి ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్నే మార్చి వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రమంతటా ఈ కార్యక్రమం ద్వారా సమస్యలుగుర్తించి ,వాటిని తొలగించేందుకు జరిగిన ప్రయత్నంలో పల్లేజనం ఎంతో పురోభివృద్ధిని సాధించారు. ఈ నెల 3నుంచి 5విడత పల్లె ప్రగతికి రాష్ట్రంలోని పల్లె జనం సమాయుత్తమవుంతోంది.
పల్లె ప్రగతి సైన్యం: పల్లె ప్రగతి కార్యక్రమం కింద దేశంలోనే తొలిసారిగా ప్రతి గ్రామ పంచాయతీలలో గ్రామీణ ప్రజలను భాగస్వాములుగా చేస్తూ స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేయడంతో ఈ పథకం విజయానికి తొలిబీజం పడింది.. వర్క్ కమిటీ, శానిటేషన్ కమిటీ, స్ట్రీట్ లైట్ కమిటీ, గ్రీన్ కవర్ కమిటీ పేర్లతో ఒక్కో గ్రామంలో 4 కమిటీలు ఏర్పాటయ్యాయి. ఈ కమిటీల్లో 8,20,727మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు. వీరిలో 4,03,758మంది మహిళలను కూడా సభ్యులుగా ఎంపికచేసుకున్నారు. ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకూ నాలుగు విడతలుగా గ్రామాల్లో పల్లె ప్రగతిపై ప్రత్యేక అవగాహన చైతన్య కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించింది. తొలిసారి 2019 సెప్టెంబర్ 6 నుంచి అక్టోబర్ 5 వరకు 30 రోజుల పాటు గ్రామీణ తెలంగాణం పల్లెప్రగతి నినాదాలతో హోరెత్తిపోయింది. రెందవ దఫాగా 2020 జనవరి 2 నుండి 12 వరకు 11 రోజులు, మూడవ దఫాగా జూన్ 1 నుండి 8 వరకు 8 రోజులు, నాలుగవ దఫాగా 2021లో జులై 1నుండి 10 వరకు 10 రోజులపాటు పల్లె ప్రగతి కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. మొత్తం 4 విడతలుగా పల్లె ప్రగతి ప్రత్యేక అవగాహన – చైతన్య కార్యక్రమాలు గ్రామీణ ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహణ పెంచాయి. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పల్లె ప్రగతిలో స్వచ్ఛందంగా పాల్గొని శ్రమదానం చేసి, తమ గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచే పనుల్లో భాగస్వాములయ్యారు. ఏ ఊరికి ఆ ఊరు ప్రజలు.. తమ గ్రామ అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యతలు నిర్ణయించుకుని వార్షిక ప్రణాళికలు , పంచ వర్షిక ప్రణాళికలు రూపొందించుకున్నారు. దశల వారీగా ప్రణాళికా బద్దంగా పనులు చేస్తూ గ్రామాలను అన్ని విధాలుగా తీర్చిదిద్దుకుంటున్నారు. పచ్చదనం పెంచేందుకు హరిత ప్రణాళిక రూపొందించు కున్నారు. ఊరిని అద్దంలా తీర్చి దిద్దుకునేందుకు పారిశుద్ధ్య పనులను నిర్వహించారు. ఎక్కడికక్కడ వీధులను, శుభ్రం చేసుకున్నారు. గ్రామాల్లో నిరుపయోగంగా ఉటూ ఏళ్ల తరబడి పాడుపడిన ఇండ్ల శిథిలాలను, పిచ్చి మొక్కలను, పొదలను, సర్కారు తుమ్మలను తొలగించుకున్నారు.దేశంలో మరెక్కడా లేనివిధంగా ప్రతి గ్రామానికి వైకుంఠధామం, నర్సరీ, డంప్ యార్డ్, ట్రాక్టరు, ట్యాంకర్, ట్రాలీ, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్యం చర్యలు తీసుకున్నది . రాష్ట్రంలోని ప్రతి గ్రామాణ పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా వీటిని ఏర్పాటు చేసుకోగలిగారు.
మౌలిక వసతులకు ప్రాధాన్యం:
గ్రామీణ తెలంగాణలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. రాష్ట్రంలో 12,737 గ్రామ పంచాయతీలు ఉండగా అన్ని పంచాయతీల్లో, వాటి పరిధిలోని మజరా గ్రామాలు, తండాలు శివారు గ్రామాలలో డంపు యార్డులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చారు. వైకుంఠ ధామాల నిర్మాణాలు చేపట్టిన గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే 12,622 గ్రామాలలో వైకుంఠధామాల నిర్మాణం పూర్తి అయినది. మిగిలిన వాటిలో పనులు తుది దశలో ఉన్నాయి. 12,769 గ్రామాల్లో ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలోని 19,472 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటయ్యాయి.రైతులు పండించిన పంటలు ఎండబెట్టడానికి కల్లాలు లేక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం లక్ష కల్లాలు నిర్మిస్తోంది. వీటిలో ఇప్పటికే సగం పూర్తవగా, మిగతా వాటి పనులు చివరి దశకు చేరుకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని 100 శాతం గ్రామాలు వైకుంఠధామాలు కలిగిన గ్రామాలుగా మారుతున్నాయి. గతంలో ఏ ఒక్క గ్రామంలో కూడా శాస్త్రీయ పద్ధతిలో చెత్త విసర్జించడానికి డంపు యార్డులు వుండేవి కాదు. పల్లె ప్రగతిలో భాగంగా 12,737 గ్రామాల్లో డంపు యార్డులు నిర్మించి వినియోగంలోకి తీసుకొచ్చారు. ప్రతి ఇంటి నుండి తడి చెత్త పొడి చెత్త వేర్వేరుగా సేకరించి దాన్ని డంపు యార్డుకు తరలించాలని నిర్ణయించారు. తద్వారా గ్రామంలోని చెత్తను ఏ రోజుకు ఆ రోజే పూర్తిగా తొలగించాలని లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చెత్తతో కంపోస్టు ఎరువు తయారు చేసి పచ్చదనం పెంపొందించేందుకు నాటిన మొక్కలకు వాడుతున్నారు.రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా 12,759 గ్రామాలలో గ్రామ నర్సరీల ఏర్పాటు జరిగింది. 2021–2022 సంవత్సరంలో 8.76 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 9.29 కోట్ల మొక్కలను నాటడం పూర్తి చేశారు. ప్రతి గ్రామపంచాయతీలోనూ, వాటి నివాస ప్రాంతాల్లోనూ పచ్చదనం కోసం పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. ఈ వనాలలో దాదాపు 4 వేల చెట్లు నాటి, పార్కులో విహరించే విధంగా ట్రాక్ ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 19,472 నివాస ప్రాంతాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటయ్యాయి. మండలానికి 5 చొప్పున బృహత్ పల్లె ప్రకృతి వనాలు 5 నుండి 10 ఎకరాలలో ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఇప్పటివరకు 98 బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. మల్టీలేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్ 6,908 కిలోమీటర్ల రహదారులకు ఇరువైపులా నాటడం జరిగింది. గ్రామాల్లో పచ్చదనం పెంచడానికి గ్రామపంచాయతీలు బడ్జెట్లో 10 శాతం నిధులను వినియోగిస్తున్నాయి. అంతేగాక 11.59 లక్షల వ్యక్తిగత, 31,924 కమ్యూనిటీ మ్యాజిక్ సోక్ పిట్ల నిర్మాణం జరిగింది. 2,597 రైతు వేదికలు, 49,710 డ్రైయింగ్ ప్లాట్ ఫారాలను చేపట్టి, 19,309 ప్లాట్ ఫారాలు పూర్తి చేశారు. మొక్కలకు నీళ్లు పోసేందుకు, చెత్త సేకరణకు ప్రతి గ్రామ పంచాయతీకి తప్పనిసరిగా ట్రాలీ, ట్యాంకర్లతో కూడిన ట్రాక్టర్ ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. 12,769 గ్రామాల్లో ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ కొనుగోలు చేయిచింది.దశాబ్దాలుగా పెండింగులో ఉండి ప్రమాదాలకు కారణమవుతున్న విద్యుత్ సంబంధమైన ఇబ్బందులు తొలగించేందుకు పల్లె ప్రగతి కార్యక్రమం ఎంతగానో దోహదపడింది. విద్యుత్ సిబ్బంది సహకారంతో పనులు జరిగాయి. 1,28,278 మిడిల్ పోల్స్ ఏర్పాటు చేశారు.1,04,857 వంగిన, పాడైన, తుప్పుపట్టిన పోళ్ల స్థానంలో కొత్త పోళ్లు వేయడం జరిగింది. 64,744 చోట్ల పాడైన స్టే వైర్ మార్చివేశారు. 2,23,251 చోట్ల వదులుగా ఉన్న వైర్లను మార్చారు. 50,230 కిలోమీటర్ల మేర థర్డ్ వైర్ ఏర్పాటు చేశారు.27,308 పాత స్ట్రీట్ లైట్ల మీటర్లను మార్చి కొత్తవి ఏర్పాటు చేశారు. 37,107 చోట్ల కొత్త స్ట్రీట్ లైట్ల మీటర్ల ఏర్పాటు చేశారు.

పంచాయతీలకు నిధుల గలగల:
2021—22లో జిల్లా పరిషత్ లకు, మండల పరిషత్తులకు 15వ ఆర్థిక సంఘం ద్వారా నిధులు విడుదలవుతున్నాయి. బడ్జెట్లో రూ.1,365 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నిధులతో సమానంగా రూ.1,365 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలకు కేటాయించి విడుదల చేసింది .ఇందులో జిల్లా పరిషత్తులకు రూ.68.25 కోట్లు ,మండల పరిషత్తులకు రూ.136.50 కోట్లు, గ్రామ పంచాయతీలకు రూ.1,160.25 కోట్లు కేటాయించింది. తక్కువ ఆదాయమున్న పంచాయతీలకు ఆర్థిక చేయూత నిస్తూ ప్రభుత్వం ప్రతీ పంచాయతీ రూ.5 లక్షలు కేటాయించింది. రాష్ట్రంలో 332 గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం రూ.2.84 కోట్లు నిధులు విడుదల చేసింది. ప్రతి నెలా విడుదల చేసే నిధులతో గ్రామ పంచాయతీల్లో ముందుగా ఖర్చులను చెల్లిస్తున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు, కరెంటు చార్జీలు, ట్రాక్టర్ లోన్లకు ముందుగా ఈ నిధులను వినియోగిస్తున్నారు.పల్లె ప్రగతి పనులు, పారిశుధ్యం, గ్రామాభివృద్ధి పనులుకు నిధుల కొరత ఉన్న పంచాయతీల్లో, ప్రభుత్వం విడుదల చేసే గ్రాంట్లు రూ. 5 లక్షలకు తగ్గకుండా నిధుల విడుదలవుతుండటంతో పనులు సజావుగా సాగిపోతున్నాయి.

5th Phase Palle Pragathi starts from June 3rd

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News